Monday, November 25, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇచ్చట భయం వినోదీకరించబడును!

ఇచ్చట భయం వినోదీకరించబడును!

నవరసాల్లో భయం చాలా భయంకరంగానే ఉంది. ఆ భయం ఎన్ని రకాలు? అన్న దగ్గరే స్పష్టత లోపించినట్లుంది. సైకాలజీకి కూడా భయమంటే చచ్చేంత భయమే. నిలువెల్లా వణుకే. భయాన్ని చిటికెలో తీసి అవతల పారేస్తాను అని అంతటి సైకాలజీ కూడా ధైర్యంగా చెప్పలేదు.

భయం ఒక భావోద్వేగ అంశం అన్నారు. “భయపడేవాళ్లంతా వచ్చి నా చుట్టూ పడుకోండి” అన్నాడట వెనకటికి ధైర్యం నటించే ఒకానొక పిరికివాడు. “అనవసరంగా భయపడకండి…మీకేమీ కాదు” అని ఓదార్చడం సులభం. భయపడేవారికే తెలుస్తుంది భయమంటే ఏమిటో!

మరీ బీటింగ్ అరౌండ్ ది బుష్- ముసుగులో గుద్దులాట కాకుండా నేరుగా విషయంలోకి వెళదాం.
ఆరోగ్యకరమైన భయం;
అనవసరమైన భయం;
అనర్థదాయకమైన భయం;
మితిమీరిన ధైర్యం-
అన్న అంశాల ఆధారంగా ‘దేవర’ సినిమా కథను అల్లినట్లు దర్శకుడు, రచయిత కొరటాల శివ భయవిశ్లేషణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిజమే. ఆరోగ్యకరమైన భయమే వ్యవస్థను భద్రంగా ఉంచుతుంది. అందులో సందేహం లేదు. దేవర సినిమా ట్రయిలర్ల ప్రకారం:-

“విలన్ల ధైర్యాన్ని చంపే భయం- హీరో”

“కులం, మతంతో పాటు భయంలేని హీరో”

“ధైర్యం తప్ప ఏమీ తెలియని విలన్ల కళ్లల్లో మొదటిసారి భయం పొర- హీరో”

“రక్తంతో ఎరుపెక్కిన సంద్రం- హీరో”

ట్రయలర్లలో అంతా చెప్పరు కాబట్టి…ఇది శాంపుల్ భయమే అని భయం భయంగా అనుకోవడమే మనకభయం!

“దూకే ధైర్యమా జాగ్రత్త!
రాకే తెగబడి రాకే!
దేవర ముంగిట నువ్వెంత?
దాక్కోవే!
కాలం తడబడెనే…
పొంగే కెరటములాగెనే…
ప్రాణం పరుగులయ్యే…
కలుగుల్లో దూరెనే…”
అన్న పాట కూడా ఈ సినిమాలో ఉంది కాబట్టి…ధైర్యానికి దూకేంత తెగింపు ఉండదు. ఉన్నా దేవర ముంగిట ధైర్యం పప్పులుడకవు. దాంతో ధైర్యం బిక్కచచ్చి దాక్కుంటే…కాలం గతి తప్పుతుంది. పొంగే కెరటం పొంగకుండా ఆగిపోతుంది. ప్రాణం కలుగుల్లోకి ఎలుకల్లా పరుగులు పెడుతుంది. మిగతా భయ విశ్వరూప వర్ణనను భయరహితంగానో, భయసహితంగానో తెరమీద చూసుకోవచ్చు.

సినిమా కథల్లో షరా మామూలుగా విలన్ల ధైర్యానికి హీరో భయమవుతాడు. లాస్ట్ సీన్లో హీరో ధైర్యానికి విలన్ బూడిదవుతాడు. ద్విపాత్రభినయ దేవర ద్వితీయ భాగం కూడా అయిపోయేదాకా ప్రేక్షకుల భయం తీరేలా లేదు.

జీవితంలో భయాలు చాలవన్నట్లు థియేటర్ భయాలు కూడా తోడైన ఒక భయవిహ్వల సందర్భంలో ఉన్నాం.

  • మొదటి వారం, పదిరోజులు బెనిఫిట్ షోలు వేయరేమోనన్న నరాలు తెగే ఉత్కంఠ. భయాందోళన.
  • మొదటి వారం సినిమా టికెట్ కు ఎక్కువ రేటు పెట్టి సగటు ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెట్టరేమో అన్న భయోత్పాతం.
  • హీరో కటౌట్ కు బ్లేళ్లతో వేళ్లు కోసుకుని రక్తాభిషేకాలు చేయడానికి తగిన రక్తం ఒంట్లో లేకపోతే ప్రేక్షక నైతికాభిమాన పతన భయం.
  • వరల్డ్ వైడ్, పాన్ ఇండియా మొదటి రోజు మొదటి ఆటకు వెయ్యి కోట్లు రాకపోతే ఎలా అన్న భయంకర నిరీక్షణ.
  • ప్రాణాలకు తెగించి థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులకు టికెట్ రేట్ భయం. పార్కింగ్ ఫీజ్ దోపిడీ భయం. చిరు తిళ్లు కొనబోతే కొరివిలాంటి భయం.
  • గుండె చిక్కబట్టుకుని తెర ముందు కూర్చుంటే…పరపరా సొరకాయలు కోసినట్లు హీరో కోసే తలలు చిందే రక్తారుణవర్ణ విధ్వంస భయం. హీరో ఏ పి నంద్యాలలో తొడగొడితే రైళ్లు వెనక్కు తమిళనాడు నాగర్ కోయిల్ దాకా వెళ్లి…ముందుకు రావేమోనన్న భయం. తెరమీదే కాకుండా బయట కూడా హీరో ప్రేక్షకుల దవడలు పగలగొడతాడేమోనన్న భయం.
  • సకల ప్రజాస్వామిక విలువలను తుంగలో తొక్కే…రాజ్యాంగ పాలనను, గౌరవాన్ని కాలికింద నలిపేసే కథల హీరోకు అనేక యూనివర్సిటీలు పోటీలు పడి ఎక్కడ గౌరవ డాక్టరేట్లు ఇవ్వకుండాపోతాయోనన్న భయం.
  • సినిమా ప్రీ రిలీజు ఈవెంట్లకు పుట్టలు పగిలిన అభిమాన జనసునామీల దెబ్బకు సాయుధ పోలీసులే నిలువెల్లా వణికే భయం. ప్రీ రిలీజులు రద్దు చేసుకోవాల్సిన భయం.
  • చుట్టూ ఒకటే భయం.
  • రాత్రి చిక్కబడ్డ చీకటి భయం.
  • పగలు గడ్డకట్టిన ధైర్యం మీద దూకే భయం.

భయంతో బతకలేక చస్తున్నాం.
ధైర్యంగా చావలేక బతుకుతున్నాం.

పన్నెండొందల ఏళ్ల కిందట శంకరాచార్యులు సౌందర్యలహరిలో
“భువన భయభంగ వ్యసనిని” అన్నాడు.
ఈ లోకాల భయాన్ని పోగొట్టడం అమ్మవారికి ఒక బాధ్యత. ఒక ప్రధానమైన పని.

తల్లీ! దేవతా!
ఈ ‘చిత్ర’ విచిత్ర భయాలను పోగొట్టే పనిని త్వరగా చేపట్టమ్మా!
దయుంచమ్మా!
అమ్మలగన్న అమ్మా!
చచ్చి నీ కడుపున పుడతాం!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్