Saturday, November 23, 2024
HomeTrending Newsహిజ్బోల్లా అధినేత న‌స్ర‌ల్లా మృతి

హిజ్బోల్లా అధినేత న‌స్ర‌ల్లా మృతి

హిజ్‌బొల్లాను తుదముట్టించడమే ధ్యేయంగా ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. హిజ్‌బొల్లా అధినేత హ‌స్సన్ న‌స్రల్లాను టార్గెట్ చేస్తూ శుక్రవారం ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. దాడుల్లో హిజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం శనివారం అధికారికంగా ధ్రువీకరించింది.

నస్రల్లాను అంతమొందించడమే లక్ష్యంగా లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులకు దిగింది. బీరుట్‌ లోని బిల్డింగ్‌ల‌ను టార్గెట్ చేస్తూ వైమానిక దాడులకు పాల్పడింది. దాహియ లోని హిజ్‌బొల్లా క‌మాండ్ సెంట‌ర్‌పై తీవ్ర స్థాయిలో వైమానిక దాడి జ‌రిగింది. దక్షిణ లెబనాన్‌లోని దాహియాలోని భూగర్భంలో ఉన్న హిజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించింది.

అండ‌ర్‌గ్రౌండ్ హెడ్‌క్వార్టర్స్‌లో దాక్కున్న న‌స్రల్లా ఆ అటాక్‌లో ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దాడుల్లో నస్రల్లాకు ఏమీ కాలేదని హిజ్‌బొల్లా వర్గం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తమ దాడుల్లో నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తాజాగా ప్రకటించింది. ‘హసన్‌ నస్రల్లా ఇకపై ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేయలేరు’ అంటూ ఐడీఎఫ్‌ ట్వీట్‌ చేసింది. మరోవైపు తాజా దాడుల్లో నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె మరణంపై హిజ్‌బొల్లా గానీ, లెబనాన్‌ అధికారులుగానీ అధికారికంగా ధ్రువీకరించలేదు.

దాదాపు 30 ఏళ్ల నుంచి హిజ్‌బొల్లాకు న‌స్ర‌ల్లా నేత‌గా కొన‌సాగుతున్నాడు. ఆ ప్రాంతంలో హిజ్‌బొల్లాను అత్యంత శ‌క్తివంత‌మైన గ్రూపుగా తీర్చిదిద్దాడు. బీరుట్ స‌మీపంలోని బౌర్జ్ హ‌మ్మౌద్‌లో 1960లో ఆయ‌న జ‌న్మించారు. 9 మంది పిల్ల‌ల్లో అత‌ను పెద్ద‌వాడు. లెబ‌నాన్ సివిల్ వార్ స‌మ‌యంలో అత‌ని రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైంది. తొలుత అమ‌ల్ ఉద్య‌మంలో చేరాడు. ఆ త‌ర్వాత 1980 ద‌శ‌కంలో హిజ్‌బొల్లాను స్టార్ట్ చేశాడు.

1985లో తొలిసారి అమెరికా, సోవియేట్ దేశాల‌కు హిజ్‌బొల్లా వార్నింగ్ ఇచ్చింది. ఆ బ‌హిరంగ లేఖ‌లో ఇజ్రాయిల్‌ను నిర్మూలించ‌నున్న‌ట్లు పేర్కొన్న‌ది. 1997లో హిజ్‌బొల్లాను ఓ ఉగ్ర‌వాద సంస్థ‌గా అమెరికా ప్ర‌క‌టించింది. 32 ఏళ్ల వ‌య‌సులోనే హిజ్‌బొల్లా సంస్థ‌కు లీడ‌ర్‌గా ఎదిగాడ‌త‌ను. అబ్బాస్ అల్ ముసావి న‌స్ర‌ల్లా త‌ర్వాత ఆ పార్టీకి కీల‌క బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. 2006లో ఇజ్రాయిల్‌తో 34 రోజుల యుద్ధం చేశాడు. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌7వ తేదీన ఇజ్రాయిల్‌, హ‌మాస్ మ‌ధ్య మొద‌లైన యుద్ధంలో.. పాల‌స్తీనాకు హిజ్‌బొల్లా స‌పోర్టు ఇచ్చింది.

మధ్య ప్రాచ్యంలో షియా ఇస్లామిస్ట్ గ్రూపున‌కు న‌స్ర‌ల్లా ప్రముఖ నేతగా పేరుంది. ఇరాన్‌తో అత్యంత స‌న్నిహితంగా మెలిగాడు. హిజ్‌బొల్లా గ్రూపును అత్యంత శ‌క్తివంత‌మైన రాజ‌కీయ‌, మిలిట‌రీ శ‌క్తిగా మార్చ‌డంలో అత‌ను కీల‌క పాత్ర పోషించాడు. అత‌ని నేతృత్వంలోనే పాల‌స్తీనాకు చెందిన ఫ్యాక్ష‌న్ గ్రూపు హ‌మాస్‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రిగింది. ఇరాన్ నుంచి మిస్సైళ్లు, రాకెట్ల‌ను సేక‌రించాడు. దీంతో ఇజ్రాయిల్‌పై పోరాడేందుకు కావాల్సిన ఆయుధాల‌ను అత‌ను తెప్పించుకోగ‌లిగాడు.

న‌స్ర‌ల్లా మృతితో ఇరాన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. షియా నేత కావటంతో ఇజ్రాయల్ పై ప్రతీకార దాడులకు ఇరాన్ దిగే అవకాశం ఉందని అంచనా.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్