Saturday, September 28, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసంపన్నుల స్వర్గం - నిరుపేదల నరకం

సంపన్నుల స్వర్గం – నిరుపేదల నరకం

నీరింకిన నేలలు, తడారిన గొంతులు కరువుదీరా పాడుకోవడానికి విద్వాన్ విశ్వం 1957లో రాసిన కావ్యం- పెన్నేటి పాట. కోటి గుండెల కంజరి కొట్టుకుంటూ పెన్న ఇరుగట్ల జనం వినిపించే విషాద గానమిది. యాభై ఏళ్ల వరుస కరువులకు వందల ఎకరాల సంపన్న భూస్వామి నారపరెడ్డి కొడుకు రంగారెడ్డి…రంగడు అయి చివరికి రామిగాడు అయి…పశువుల కొట్టంలో కూలీ చేసుకుని బతికే దయనీయమైన కథ ఇది. ఒక కోటీశ్వరుడి కొడుకు పూటకు పట్టెడన్నం దొరక్క గంజి తాగడానికి కరువు ఎలా కారణమయ్యిందో చెప్పిన వాస్తవ చిత్రణ ఇది. ఆ సందర్భంలో పెన్నేటి పాట కావ్యనాయకుడు రంగడు పనిచేసే కలవారి ఇంటిని, వారి వైభోగాన్ని, వారి అభిరుచులను ఇలా వర్ణిస్తున్నాడు కవి.

ఆ ఇంట్లో ఏది కావాలంటే అది ఉంది. ఆ ఇల్లు దాటగానే ఏదీ ఉండదు. అంతా రాళ్లు.

ఆ ఇంట్లో ఎక్కడ చేయి పెట్టినా నగదు, నగలు, కళాఖండాలు. ఆ ఇల్లు దాటితే అంతా మొండి గోడలు.

ఆ ఇంటి ఇనుపపెట్టెల నిండా మూలిగే డబ్బు. ఆ ఇల్లు దాటితే జబ్బు.

ఆ ఇంట్లో ఊరి చెమట సంపదగా కళకళలాడుతూ ఉంటుంది. ఆ ఊరిమీద ఆ ఇంటి భూతం నీడపడి తిరుగుతున్నట్లుంటుంది.

ఆ ఇంటి గోడల నునుపు అద్దమై…ఏది అద్దమో! ఏది గోడో తెలుసుకోలేనంతగా తళతళలతో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆ ఇంటి పెంపుడు పిల్లి కూడా ఊళ్లో పులిలాంటి పెద్ద రైతును శాసించగలుగుతుంది.

ఆ ఇంట్లో తేన్పులే కానీ…ఆకలి కేకలు, బాధల నిట్టూర్పులు వినపడవు. ఆ ఇంట్లో లక్ష్మి- సరస్వతులు గజ్జెకట్టి నాట్యం చేస్తుంటారు. ఆ ఇంట్లో లేనిది లేదు- మానవహృదయం తప్ప.

ఆ ఇంటి పెద్ద గొప్ప విద్యావంతుడు. ఎప్పుడూ భాగవత పారాయణం చేస్తూ ఉంటాడు. ఆ ఇంటి ఇల్లాలి చల్లని చూపులకే పెరట్లో మల్లెలు పూస్తూ ఉంటాయి. ఆ ఇంటి అబ్బాయి ఇంగ్లాండ్లో ప్రజాస్వామ్యం మీద పరిశోధన చేసి…పట్టా పుచ్చుకుని…వచ్చాడు. ఆ ఇంటి అమ్మాయి ఈమధ్యే సాంఘిక శాస్త్రంలో పట్టా పుచ్చుకుంది. ఆ ఇంట్లో ఏ గోడకు చూసినా వేలాడే చిత్రాలు. ఏ మూల చూసినా అపురూపమైన కళాఖండాలు. ఎక్కడా దుమ్మూధూళి ఉండదు. ఆత్మ తప్ప ఆ ఇంట్లో అన్నీ ఉన్నాయి.

ఊళ్లో మూడొందల మట్టి మిద్దెలు కట్టడానికి అయిన ఖర్చు…ఆ ఇంట్లో ఆరుబయట ఒక అరుగు కట్టిన ఖర్చు కంటే చాలా తక్కువ. ఆ ఊరిని అమాంతం మింగి ఉబ్బినట్లుగా ఆ ఇల్లు ఒక్కటే బలిసి ఉంది.

కావ్యం కాబట్టి ఇదంతా వర్ణన. నిజజీవితంలో ఇలా ఎందుకుంటుందని మనం ఆశ్చర్యపోవాల్సిన పనిలేకుండా…ఎన్ని దశాబ్దాలైనా…ఎన్ని శతాబ్దాలైనా…ఎంతటి సమసమాజ శ్రేయోరాజ్యంలో అయినా ఇలాంటి ఊరినంతా మింగి ఉబ్బి ఉండే ఇళ్లు కనిపిస్తూనే ఉంటాయి. నిజానికి ఇలాంటి ఇళ్లు ఇప్పుడు ఊరికొకటి కాదు. లెక్కలేనన్ని. ఒక్కో ఇంటిమీద ఒక్కో పన్నీటి పాటో లేక కన్నీటిపాటో రాయడానికి ఎందరు విద్వాన్ విశ్వమ్ లు పుట్టాలో?

అన్నట్లు-
భారత్ మార్కెట్లోకి పన్నెండు కోట్ల రోల్స్ రాయిస్ కార్లు వచ్చాయి. ఒక రాష్ట్ర మంత్రిగారి గారాల కొడుకు ఒక్కొక్కటి ఏడు కోట్ల విలువ చేసే ఏడు చేతి గడియారాలు అక్రమ హవాలా మార్గంలో ముచ్చటపడి కొన్నట్లు…కేంద్ర ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్- ఈ డి ఆ మంత్రిగారి ఇంటిమీద మెరుపుదాడి చేసినట్లు వార్త.

మనలో మన మాట-
అత్యంత సంపన్నుల యాభై కోట్ల గడియారాల్లో కాలం వేరు వేరుగా ఉంటుందా? ఒకే కాలాన్ని అత్యంత సంపన్నులు వేరు వేరు గడియారాల్లో ఒకేసారి చూసుకుంటారా?

కాలం చాలా విలువైనది అంటే ఏమో అనుకున్నాం.
మరీ ఇన్ని వందల, వేల కోట్ల విలువైనదా!

“ఎవరికైనా టైమ్ బాగుండాలి-
దేనికైనా టైమ్ రావాలి” అంటే ఇదా?

ఇట్స్ రిచ్ లివ్ టైమ్!
ఇట్స్ పూర్ డై టైమ్!
కాలమహిమ!

ఇందులో ప్రస్తావించిన పద్యాలు ఆసక్తి ఉన్న పద్యప్రేమికుల కోసం:-

“ఈ యింట నున్నంత సేపు –
కోయన్న కోటి సామాను;
ఈ యిల్లు దాటితేనేమొ –
రాయెత్తితే రాయి నీను.

ఈ యింట నేమూలనైన
చేయి వెట్టిన రాల్‌ వరాలు;
ఈ యిల్లు దాటితేనేమొ
వేయంచులన్‌ దెగు నరాలు;

ఈ యింట నేపెట్టెనైన
ఈయూరి సిరులెల్ల పూచు;
ఈ యిల్లు దాటి పారాడ
ఈ యూరి కడగండ్లు వేచు;

ఈ యింట నేపెట్టెనైన
ఈయూరి సిరులెల్ల పూచు;
ఈ యిల్లు దాటి పారాడ
ఈ యూరి కడగండ్లు వేచు;

ఈ యింటిలో తొంగిచూడ
ఈ యూరి చెమట నీరాడు;
ఈ యూరిలో తొంగిచూడ
ఈ యింటి భూతమ్ము నీడ;

ఈ యింట చలువఱా
లిమిడిచి చెక్కిన
నేలపై నీనీడ
వాలుదోచు;
ఈ యింట నున్నట్టి
యిటుల గోడల, పాల
గారలో అద్దాలు
కలసి పోవు;
ఈ యింటి మహడీల
నెక్కిన చానల
వేనలిలో మబ్బు
సోనలూరు;
ఈ యింట దిరుగాడు
నింతపిల్లియు, నూరి
పెద్ద రైతుల
నిలవేయ జాలు –

ఇచట త్రేన్పులెకాని విన్పింప వూర్పులు –
ఇచట రూకల గల గల లెత్తిపోవు;
ఇచట లక్ష్మీ సరస్వతులే వసింతురు –
ఇచట లేనిది – మానవ హృదయ మొకటె.

ఈ యింటి యజమాని
ఎంతో విద్యావంతు
డెపుడు భాగవతమ్ము
నే పఠించు;
ఈ యింటి యిల్లాలు
పూయించు గన్నుల
కొల్లలు కొల్లలు
మల్లెపూలు;
ఈ యింటి కొడుకొక్క
డింగ్లాండులో, ప్రజా
స్వామ్య శోధన నెంతొ
జఱిపి వచ్చె;
ఈ యింటి కూతురు
పోయిన యేడె,
సాంఘిక శాస్త్రమున
పట్ట మొకటి గొనియె;
ఎచట జూచిన చిత్రాలు
నెన్నొ శిల్ప ఖండములు గనిపించు,
నెక్కడను మలిన మన్న దేలేదు –
కాని, సంపన్న గృహము
చొచ్చి చూచిన
నాత్మయే
శూన్య మిచట.

మున్నూరు మట్టి మిద్దెల
క్రొన్నెత్తములెల్ల దీని కొత్త యరుగులం
దన్నగలే విది యొకటే
ఉన్నది ఊరెల్ల మ్రింగి యుబ్బినట్లుగన్‌”

(విద్వాన్ విశ్వమ్(1915-1987) పెన్నేటి పాట నాలుగో సర్గలో కొన్ని పద్యాలివి)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్