Friday, October 11, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఏయ్! ఎవర్రా అక్కడ! వేట్టాయన్ తెలుగు కాదన్నది?

ఏయ్! ఎవర్రా అక్కడ! వేట్టాయన్ తెలుగు కాదన్నది?

భీమయ్య:-
ఏమి రామయ్యా! దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?

రామయ్య:-
ఏమీ లేదు భీమయ్యా! మన తెలుగు కొంపకు ఏ పైకప్పు వేద్దామా అని ఆలోచిస్తున్నా.

భీమయ్య:-
ఇందులో ఆలోచించడానికేముంది రామయ్యా! మన్నికకు, నాణ్యతకు పేరెన్నికగన్న వేట్టాయన్ తమిళ పైకప్పులు వేస్తే సరి!

రామయ్య:-
…అంటే అవి అరవ పైకప్పులు కదా! తెలుగు ఇనుప రేకులు, సిమెంట్ రేకులు, పెంకులు, రెల్లు గడ్డి, బోద, మట్టి, ఆర్ సి సి స్లాబులు…ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా! ఇవన్నీ కాదని అరవ వేట్టాయన్ పైకప్పులే వేయాలంటావా?

భీమయ్య:-
ఎంత మాటన్నావు రామయ్యా! తెలుగు ఎంత అరచి గీ పెట్టినా అరవంతో సమానమవుతుందా చెప్పు! అరవం అరవం అని వాళ్లు లొడ లొడ అరుస్తున్నా…ఎంత వీనులవిందుగా ఉంటుందో తెలుసా?

రామయ్య:-
ఏమో! నావరకు తెలుగు పెన్నా సిమెంట్, విశాఖా పైకప్పులు, మంజీరా మట్టి పైపులు అంటే ఎంత అందంగా ఉంటుంది చెప్పు!

భీమయ్య:-
పిచ్చి రామయ్యా! తెలుగు పుట్టిందే తమిళం నుండి. మనల్ను మద్రాసీలు అనే అనేవారు ఇదివరకు. తెలుగులో తెగులు ఉంది. తమిళంలో మిళమిళ తళతళ ఉంది…

రామయ్య:-
తమిళం పేరు వేట్టాయన్ తెలుగులోకి వస్తే తమిళంలోనే ఉండడం తప్పు కానప్పుడు…తెలుగు వేటగాడు; అందగాడు; మొరటోడు నా మొగుడు; ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాంటివి తమిళులు అలాగే ఎందుకు పెట్టుకోకూడదు?

భీమయ్య:-
అంటే తమిళులకు భాషాభిమానం ఎక్కువ. చాలా పట్టింపు. ఒప్పుకోరు.

రామయ్య:-
అప్పుడు నేనూ ఒప్పుకోను.

భీమయ్య:-
బోడి నీ ఒప్పుకోలుతో మాకేమి పని. మా తెలుగు నిర్మాతలు చూడు. తమిళ వేట్టాయన్ ను తెలుగు ప్రేక్షకులు తమిళ వేట్టాయన్ గానే ఎందుకు చూడాలో వివరణాత్మక జ్ఞానబోధ చేస్తున్నారు.

రామయ్య:-
తెలుగువారికి స్వభాషాభిమానం లేదన్న ధైర్యమది.

భీమయ్య:-
ఉంటే మాత్రం ఏమి చేస్తారు? ఉంటే అనడానికి ఉల్టే అన్నప్పుడే ఏమీ చేయలేదు. ఇప్పుడు వేట్టాయన్ తమిళ కత్తి తెలుగు ప్రేక్షకులను వేటాడుతుంటే నోరుమూసుకోక…నోరు చేసుకోగలరా? అంత ధైర్యముందా?

రామయ్య:-
ఏమి చేస్తారేమిటి?

భీమయ్య:-
వేట్టాయన్ తెలుగు కాదు…తమిళం అన్నవారందరినీ చెట్టుకు కట్టేసి కొడతాం. తెలుగు పేరు పెట్టాలన్నవారందరిని ప్రాంతీయ భాషా విద్వేషాలు, వైషమ్యాలు, వైరుధ్యాలు, వైమనస్యాలు రెచ్చగొడుతున్నారని కేసులు పెట్టి బొక్కలోకి తోసి మక్కెలిరగదంతాం. అవసరమైతే దేశద్రోహం, భాషాద్రోహం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అంతు చూస్తాం!

రామయ్య:-
భీమయ్యా! నిజం చెప్పు. నేను తప్ప భూప్రపంచంలో ఉన్న పదిహేను కోట్లమంది తెలుగువాళ్లల్లో ఒక్కరన్నా వేట్టాయన్ అని తెలుగు సినిమాకు తమిళ పేరు పెట్టడం తెలుగుభాషను, తెలుగువారిని ఘోరంగా అవమానించినట్లు అని నిరసన తెలిపారా? తెలుగు నిర్మాతలే తెలుగుకు తీరని ద్రోహం చేస్తున్నారని నిలదీశారా? చెప్పు.

భీమయ్య:-
నిజమే రామయ్యా! అందుకే నీ నోరు మూయించడానికి తమిళ వకాల్తా తీసుకున్న తెలుగు నిర్మాతల తరపున వకాల్తా తీసుకుని నేనొచ్చాను. నువ్ ఇక ఈ విషయం మీద నోరు తెరిచావో! నా చేతిలో చచ్చావే!

రామయ్య:-
తెలుగువారికి తెలుగుమీద ప్రేమ ఎప్పుడో చచ్చింది. ఏ మూలో మాతృభాష మీద ప్రేమ మిగిలి ఉన్నవారిని చావగొట్టి చెవులు మూయడానికి నీలాంటివారు ఉండనే ఉన్నారు.

భీమయ్య:-
వరుసగా తెలుగులో రానున్న గొప్ప గొప్ప సినిమాల్లో కొన్ని ఇవి. ముందే టికెట్ బుక్ చేసుకో!
# మూన్డ్రమ్ పిరై
# వజక్కు ఎన్
# విసరానై
# తావమై తిరుదిరున్డ్రు
# కదలుక్కు మరియాదై
# సూదు కావం
# అలై పాయుత్తే

రామయ్య కరెంటు షాక్ తగిలిన కాకిలా నోట్లో తెలుగు నురగలు కక్కుకుంటూ తెలుగు కళ్లు తేలేశాడు!
భీమయ్య తమిళకళ్లు చల్లబడ్డాయి!!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్