Monday, October 14, 2024

మేవాడ్ కథలు-3

ఉదయ్ పూర్ కు 110 కిలోమీటర్ల దూరంలో చిత్తోర్ గఢ్ కోటది శాతబ్దాల చరిత్ర. ఎన్నెన్ని ఆక్రమణలను, దాడులను చూసిందో చిత్తోర్ గఢ్? శిథిలమైన ప్రతిసారీ శిథిలాలనుండి శిఖరాలకు లేవడానికి ప్రయత్నించింది. “శిలలు ద్రవించి ఏడ్చినవి…” అని శిథిల హంపీలో ఒకనాటి వైభవాన్ని చూసి పొంగిపోయాడు కొడాలి వేంకట సుబ్బారావు హంపీక్షేత్రం కావ్యంలో. అలాంటి హంపి మట్టిలో మట్టిగా కలిసిపోయిందని అక్కడి బండరాళ్ళే గుండెలు పగిలేలా ఏడుస్తున్నాయట. 1565 లో తళ్లికోట యుద్ధంలో అళియరామరాయలు తల నరికిన తరువాత విజయనగర రాజధాని హంపీని పునాదులతోపాటు పెకలించడానికి, తగలబెట్టడానికి, మొత్తం దోచుకోవడానికి ముస్లిం రాజులు నలుగురూ ఏకమయ్యారు. 330 ఏళ్లపాటు ఆకాశమే హద్దుగా ఎదిగిన హంపీని ఆరు నెలలపాటు తగలబెట్టి బూడిద చేసి…పగ చల్లారాక…వికటాట్టహాసం చేస్తూ… సంపదనంతా  దోచుకెళ్ళారు. గుడిలో తలలు తెగిన విగ్రహాలుంటే హిందువులు పూజలు చేయరని తెలుసుకుని…ప్రధానమైన గార్భాలయాలన్నిటిలో విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆనాడు తెగిన హంపీ తల ఇక లేవలేదు. మొండేన్ని చూసి తలదించని హంపీ తలను ఎలా ఊహించుకుంటున్నామో…అలాగే చిత్తోర్ గఢ్ శిథిలాల్లో ఒకనాటి వెలుగులను వెతుక్కోవాలి.

ఒక వెలుగు వెలిగి…కలలా కనులముందు చెదిరిపోవడంలో హంపీకి-చిత్తోర్ గఢ్ కు చాలా దగ్గరి పోలికలున్నాయి. అదే ముస్లిం రాజుల దాడులు. అవే యుద్ధాలు. పేర్లే వేరు. అదే కథ. అదే వ్యథ. కాలగతిలో హంపీకంటే పెద్దది చిత్తోర్ గఢ్ కథ. హంపీ వదిలి ప్రాణాలు అరచేతపట్టుకుని పెనుగొండకు, చంద్రగిరికి విజయనగరరాజులు వెళ్లి రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ…కాలం కలిసిరాలేదు. చిత్తోర్ గఢ్ వదిలి…ఉదయ్ పూర్ కు వచ్చిన రాజ్ పుట్ రాజులు 1559నుండి సిటీ ప్యాలెస్ రాజసౌధాన్ని నిలుపుకుని…బ్రిటిషువారి కాలంలో, ఆపై స్వాతంత్ర్యానంతరం ఇప్పటికీ అక్కడే ఇల్లు కట్టుకుని ఉండడం ఒక్కటే తేడా.

క్రీస్తు శకం 730 ప్రాంతాల్లో మేవాడ్ రాజ్య వ్యవస్థాపకుడు బొప్పా రావల్ రావల్పిండి నుండి వచ్చి…చిత్తోర్ గఢ్ ను స్వాధీనం చేసుకునేనాటికే చిత్తోర్ గఢ్ బాగా స్థిరపడిన రాజ్యం. మౌర్యుల రాజు చిత్రాంగద్ మౌరి నిర్మించడంతో దీనికి చిత్తోర్ గఢ్ అని పేరొచ్చింది. ఇదే ఒకనాటి పురాణాల్లో పేర్కొన్న చిత్రకూటం అని కొందరి వాదన. శాసనాధారాలను బట్టి ఇప్పటికి దాదాపు 1400 ఏళ్ల కిందట చిత్రాంగద్ మౌరి నిర్మించింది చిత్తోర్ గఢ్ కోట.

ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ 1303లో, సుల్తాన్ బహదూర్ షా 1535లో, మొఘల్ చక్రవర్తి అక్బర్ 1567లో మొత్తం మూడుసార్లు చిత్తోర్ గఢ్ మీద దాడిచేశారు. వేలమందిని చంపేశారు. ఖిల్జీ నెలపాటు చిత్తోర్ గఢ్ లో సాగించిన విధ్వంసంలో ముప్పయ్ వేలమంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు.

మేవాడ్ రాణి పద్మిని (పద్మావతి) గురించి కథలు కథలుగా చిత్తోర్ గఢ్ కోటలు వినిపిస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ సినిమాల్లో ఆమె కథావస్తువు అయి…హీరోయిన్ అయ్యింది. టీవీ సీరియళ్లలో, ఓటీటీ వెబ్ సీరీస్ లో ప్రధాన పాత్ర అయ్యింది. శ్రీలంకలో పుట్టి చిత్తోర్ గఢ్ కు కోడలిగా వచ్చిన ఆమె అందం గురించి కవులు కవితలు రాశారు. చిత్రకారులు బొమ్మలు గీచారు. శిల్పులు శిల్పాలు చెక్కారు. ఆనోటా ఈనోటా పడి ఆ సంగతి అల్లావుద్దీన్ ఖిల్జీ దాకా చేరింది. ఆమెను ఎలాగైనా చూడాలనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే చిత్తోర్ గఢ్ కోటమీద దాడి చేశాడు. కోటను గెలిచాడు. రాజును బంధించాడు. కానీ రాజస్థానీ రాణులు పరదాల మాటునే ఉంటారు. పరపురుషుడి ముందుకు రారు. దాంతో చివరకు పద్మినిని అద్దంలో చూడడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఆ అపురూప లావణ్యవతిని అద్దంలో చూసి ఖిల్జీ మనసు నిండిపోయింది. ఇది ఒక ఉర్దూ కవి రాసిన కవితలో ఉండి…ఈ కథకు బాగా ప్రాచుర్యం వచ్చి…సినిమాల్లోకి కూడా ప్రవేశించింది.

మరో కథనం ప్రకారం- ఖిల్జీ చిత్తోర్ గఢ్ ను జయించాడని తెలియగానే రాణీ పద్మిని మూడు వేలమంది మహిళలతో కోటలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న చితిలో దూకి ఆత్మార్పణ చేసుకుంది(1303లో).

జేమ్స్ టాడ్ తన సుదీర్ఘ రాజస్థాన్ చారిత్రిక గ్రంథంలో కూడా రాణి పద్మిని గురించి చాలా వివరాలు నమోదు చేశాడు. రాజ్ పుట్ రాజులు తరతరాలుగా చెబుతున్న వివరాలనే తాను పొందుపరిచినట్లు టాడ్ స్పష్టంగా పేర్కొన్నాడు. ఆయన ప్రకారం రాణి పద్మినిని అపహరించుకు వెళ్లాలని ఖిల్జీ చిత్తోర్ గఢ్ కోటను ముట్టడించాడు.  పద్మిని భర్త రాజు భీమ్సీ ఖిల్జీ సేనలతో వీరోచితంగా పోరాడుతున్నాడు. ఆ సమయంలో భీమ్సీని వలవేసి పట్టుకున్న ఖిల్జీ… రాణి పద్మినితో బేరసారాలకు దిగాడు. “నీవు నాదగ్గరికి వస్తే నీ భర్తను వదిలి పెడతా” అని ఎర వేశాడు. దాంతో అంతఃపుర పరివారంతో కలిసి రాణి పద్మిని ఆత్మార్పణ చేసుకుంది. ఈ విషయం తెలిసిన పద్మిని భర్త తుదిశ్వాసదాకా ఖిల్జీతో  కోటకు ఆవల పోరాడి యుద్ధసీమలోనే చనిపోయాడు. జేమ్స్ టాడ్ చెప్పిన ఈ కథనాన్నే ఎక్కుమంది అంగీకరించారు.

16వ శతాబ్దం నుండి మొన్న మొన్నటిదాకా ఉర్దూ, పర్షియా భాషల్లో పద్మిని అందచందాల మీద, ఖిల్జీ ఆమెను అద్దంలో ప్రతిబింబంగా చూడడం మీద లెక్కలేనన్ని కవితలు అల్లారు.

రాజ్ పుట్ ల మీద శతాబ్దాలుగా రాజస్థాన్ నృత్య రూపకాల్లో కూడా పద్మిని ప్రధాన పాత్ర పోషిస్తోంది.

పద్మిని విషయంలో కట్టుకథలకే ఎక్కువ ప్రచారం కలిగి…వాస్తవాలు మరుగునపడ్డాయని చరిత్రకారుల అభిప్రాయం.

మేవాడ్ రాణి మీరాబాయ్(1498-1546) భర్త చనిపోయాక బంధువులు మానసికంగా హింసించడంతో ఆమె వారికి దూరంగా భక్తి మార్గంపట్టి…ద్వారక చేరి…కృష్ణుడినే భర్తగా భావిస్తూ కృష్ణుడిలోనే ఐక్యమైపోయింది. ఆమె రాసి…పాడినవే మీరా భజనలు.

దాదాపు 700చదరపు కిలోమీటర్ల మేర ఆరావళి కొండమీద విస్తరించిన చిత్తోర్ గఢ్ కోటలో తవ్వుకున్నవారికి తవ్వుకున్నంత చరిత్ర. చిత్తోర్ గఢ్ రాజ్ పుట్ రాజు రాణా కుంభ 1448లో సారంగపూర్ లో ఖిల్జీ సేనలను ఓడించినందుకు గుర్తుగా నిర్మించిన “విజయస్తంభం” ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఆకాశమంత ఎత్తులో నిలుచుని ఉంది. నాలుగేళ్లు వర్షాలు పడకపోయినా కోటలో నీళ్లకు కరువు లేకుండా రాతిని తొలిచి నిర్మించిన కృత్రిమ చెరువులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. రాజభవనాల మొండిగోడలు ఏవో చెప్పాలనుకుంటున్నాయి. రాజులకు, రాణులకు విడి విడిగా ఈత కొలనులున్నాయి. 19 దేవాలయాలున్నాయి. శత్రువులు దాడులు చేస్తే తప్పించుకోవడానికి కిలోమీటర్ల మేర భూగర్భ సొరంగ మార్గాలు ఇప్పటికీ ఉన్నాయి. ఏనుగులు, గుర్రాలు, రథాలు, మేనాలు తిరగడానికి విడి విడి దారులున్నాయి.

కొస మెరుపు:-
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి భద్రపరుస్తున్న చిత్తోర్ గఢ్ కోట లోపల ఒక మూల వందల ఇళ్లల్లో సామాన్యులతో ఇప్పుడు ఒక ఊరే ఉంది. కోట గుమ్మం లోపలికి ప్రవేశించగానే ఆర్కియాలజీ గైడ్లు వెయ్యేళ్లకు పైబడ్డ చిత్తోర్ గఢ్ చరిత్ర చెబుతుంటారు. రాణి పద్మిని మూడంతస్థుల మేడ ఇది అని చెబుతుంటే…పక్క వీధిలో రేకుల షెడ్డు మీద ఆధునిక పద్మిని బట్టలారేసుకుంటూ ఉంటుంది. రాణా కుంభ తొమ్మిదడుగుల ఆజానుబాహుడు…మదించిన ఏనుగులతో ఆడుకునేవాడు అని వర్ణిస్తుంటే పక్క వీధిలో కోట అంచు కొక్కీకి మేకను కట్టేయడానికి పొట్టివాడొకడు కుస్తీ పడుతుంటాడు- ఎంతటి చరిత్రకైనా బూజు పడుతుందని చెప్పడానికి సాక్ష్యంగా!

ఫోటోలు- పమిడికాల్వ సుజయ్

రేపు:-
“కుంభాల్ గఢ్ కోట”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్