Monday, October 21, 2024

మేవాడ్ కథలు-6

మేవాడ్ లో ఎన్ని వందల, వేల ఆలయాలుండేవి? ముస్లిం రాజుల దాడుల్లో ఎన్ని ధ్వంసమై ఎన్ని మిగిలాయి? అన్నది ఒక విషాద చారిత్రిక గాథ. బహుశా ఒక వారం రోజులు ఉదయ్ పూర్ పరిసర ప్రాంతాల్లో ఓపికగా తిరిగినా ఇంకా ఎన్నో చూడాల్సిన ఆలయాలు మిగిలిపోతాయి. ప్రత్యేకించి చిత్తోర్ గఢ్, కుంభల్ గఢ్ కోటల్లో ఆలయాల నిర్మాణ శైలి, శిల్ప సంపద, పురాణగాథలు చెబితే అర్థమయ్యేవి కావు. ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసి అనుభవించాల్సినవి. గర్భగుడిలో పూజలందుకునే ప్రధాన విగ్రహాలను శత్రు సైన్యాలు ధ్వంసం చేయడంతో అయిదారు శతాబ్దాలుగా పూజల్లేకుండా మిగిలిపోయినవే దాదాపు తొంభై శాతం ఆలయాలుంటాయి. శిథిలమైన గుడిగోపురాలు కూడా తమ కథను తామే చెప్పుకునేంత గొప్పవి.

హంపీలో కూడా ఏకశిలా రథమున్న విఠలాలయం మెదలు ఇదే సమస్య. ముస్లిం రాజులు గర్భాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆనాటినుండి ఆ గుళ్లు గబ్బిలాలకు నిలయమయ్యాయి. హజార రామాలయం అందం వర్ణించడానికి భాషలో ఉన్న మాటలు సరిపోవు. అలాంటి ఆలయాల్లో విగ్రహాన్ని పునః ప్రతిష్ఠ చేసి…పూజలు మొదలు పెట్టడానికి ఆగమశాస్త్రంలో ఏవో వెసులుబాట్లు ఉండి ఉంటాయి. బహుశా రాజ్యపతనం తరువాత అప్పట్లో వారికి కుదరకపోయినా… తరువాత మనం ఆ కోణంలో ఆలయాల పునరుద్ధరణకు నడుం బిగించలేదు. ఆర్కియాలజీ వారి చేతిలో పెట్టాక ఎంతటి ఆలయంలో అయినా ఒక ఇసుక రేణువును అటు నుండి ఇటు కదిలించడానికి వీలుండదు. గుడ్డి గుళ్లో లైటు బిగించడానికి ఒక మేకు కొట్టాలంటే ఢిల్లీ నుండి అనుమతి రావాలి. భారత పురావస్తు శాఖ అనగానే ఉన్నది ఉన్నట్లు కాపాడడం వరకే తప్ప…పూర్వ వైభవం తెచ్చే బాధ్యత తమది కానట్లు నిర్దయగా ఉంటుంది వారి వ్యవహారం. ధ్వంసమైన ఆలయాల విషయంలో విజయనగర హంపి, పెనుగొండలో ఏమి జరిగిందో మేవాడ్ లో కూడా అదే జరిగింది.

హిందూ ఆలయాల్లో గర్భాలయం విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఇక ఆ ఆలయం గబ్బిలాల కొంప అవుతుందన్న ముష్కర మూకల ఎత్తుగడను చిత్తు చేసే అవకాశం శాస్త్రోక్తంగా ఉన్నా ఎందుకో అటువైపు హిందూ సమాజం ప్రయత్నించలేదనిపిస్తుంది.

మొఘలుల దాడులు జరిగిన ప్రతిసారీ మేవాడ్ లో కొన్ని ఆలయాలు ధ్వంసమయ్యాయి. బహుశా ధ్వంసమైన ప్రతిసారీ మేవాడ్ రాజులు మరింత భక్తి శ్రద్ధలతో వేగంగా మరికొన్ని కొత్త ఆలయాలను కట్టినట్లున్నారు. అన్ని ఆలయాల చరిత్ర రాస్తే కొన్ని వేల పేజీల మహాగ్రంథమవుతుంది. ఇప్పటికీ నిత్యపూజలతో కళకళలాడుతున్న కొన్ని ఆలయాల చరిత్ర తెలుసుకుంటే…శిథిలమైన, గర్భాలయంలో విగ్రహమొక్కటి లేకపోయినా మిగతా ఆలయమంతా అద్భుతంగా ఉన్న ఎన్నో ఆలయాల ఆనాటి వైభవాన్ని ఎవరి ఊహాశక్తిని బట్టి వారు ఊహించుకోవచ్చు.

ఉదయ్ పూర్ కు దగ్గర్లోని “ఏక్ లింగ్ జీ” ఆలయం చూడ్డానికి రెండు కళ్లు చాలవు. అది ఒక ఆలయం కాదు. 108 ఆలయాల సమూహం. మేవాడ్ రాజుల కులదైవం ఈ “ఏక్ లింగ్ జీ”. శాసనాధారాలను బట్టి 1400 ఏళ్ల క్రితం నాటికే ఈ ఆలయంలో నిత్యపూజలు జరిగేవి. అప్పటికే ఉన్న ఆలయాన్ని ఎనిమిదో శతాబ్దంలో మేవాడ్ రాజ్యస్థాపకుడు బొప్పా రావల్ మరింత విస్తరించాడు. మరిన్ని అందాలను అద్దాడు. ఆలయంలోపలికి వెళితే వైకుంఠం పురవీధుల్లోనో, కైలాసం గుమ్మం ముందో తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది.

ఏక్ లింగ్ జీ శివుడు మహారాజుగా ఉండగా…తాము “మహారాణా” పేరిట మంత్రులుగా మేవాడ్ రాజ్య పరిరక్షకులమని అనుకుని ఆ దేవుడి పేరిటే రాజ్యపాలన చేసిన భక్తితత్పరులు వారు.

ఉదయ్ పూర్ సిటీ ప్యాలెస్ కు దగ్గర్లోని జగదీశ్ విష్ణ్వాలయం చూసి తీరాల్సిన చోటు. వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయం మొత్తం రాతి కట్టడం. అందం పోతపోసిన శిల్పాలతో అలరారుతున్న ఈ ఆలయంలో మేవాడ్ రాజులు నిత్యపూజలు చేశారు. ఇప్పటికీ ఆ సంప్రదాయంలోనే పూజలు, భజనలు జరుగుతున్నాయి.

ఉదయ్ పూర్ ఊళ్ళో కొండమీద ఉన్న నీమచ్ మాతా ఆలయానిది కూడా శతాబ్దాల చరిత్ర. ఆలయానికి రోప్ వే ఒక్కటే మార్గం.

కర్ణి మాతా, మాహాలక్ష్మి, మహాకాళేశ్వర్, శ్రీనాథ్ జీ…ఇలా అడుగడుగున గుళ్లే. ఓపిక ఉండి తిరగాలే కానీ మేవాడ్ లో ఏ గోడను తాకినా అది కోట గోడో, గుడి ప్రాకారం గోడో అయి ఉంటుంది.

రెండు వేల ఏళ్లకు పైబడ్డ చరిత్ర కలిగిన వందల మేవాడ్ ఆలయాల గురించి తెలుసుకోవడానికి నాలుగు రోజులు ఏమి సరిపోతుంది? నా వరకు నాలుగు రోజుల్లో తిరగగలిగిన గుళ్లన్నీ తిరిగి కళ్లల్లో శిల్పాలను నింపుకున్నాను. మనసులోకి విగ్రహాలను ఒంపుకున్నాను. మిగతావాటి గురించి మేవాడ్ చరిత్ర పుస్తకాల్లో చదివి తెలుసుకున్నాను.

రేపు:-
“కృష్ణుడే మైమరచి విన్న మీరా భజనలు”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్