Tuesday, December 3, 2024

మన భాష- 5

చదవడమూ, రాయడమూ చదువుకున్నవాళ్ళ పని. మాట్లాడేటప్పుడు ఎదుటివాళ్ళకు అర్థమయితే చాలు కాబట్టి అంతవరకూ జాగ్రత్తపడతాం. మనం మాట్లాడిన విషయంలో కొంచెం అటూఇటూ అయినా  ఎదుటివాడు అర్థం చేసుకోగలుగుతాడు. మరీ అపార్ధం కలిగేటట్లుంటే వెంటనే మనమే సరిచేసుకుంటాం. కానీ రాసేటప్పుడు అటువంటి అవకాశం ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాం. అయితే మాట్లాడేటప్పుడు లేని సమస్యలు కొన్ని రాసేటప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. మనం సరిగ్గానే రాస్తున్నామా అని చాలాసార్లు అనుమానం వస్తూ ఉంటుంది. ఈ అనుమానంవల్ల పొరపాట్లు కూడా దొర్లుతూ ఉంటాయి.

‘ఋ’, ‘ౠ’లు తెలుగు మాటల్లో ఉండవు. వీటి ఉచ్చారణ ‘రి’, ‘రీ’, ‘రు’, ‘రూ’లతో సమానంగా ఉంటుంది. అందువల్ల సంస్కృత పదాలను ఉచ్చరించేటప్పుడు ఈ రెండు రకాల ఉచ్చారణా కనిపిస్తుంది. ఉదాహరణకు ‘కృష్ణ’ను కొంత మంది ‘క్రిష్ణ’ అనీ, కొంతమంది ‘క్రుష్ణ’ అనీ ఉచ్చరిస్తారు. ‘ఋ’తో మొదలయ్యే మాటలను ‘రు’తో రాయడం సంప్రదాయంగా కూడా మారిపోయింది. ‘ఋణం’, ‘ఋతువు’లను ‘రుణం’, ‘రుతువు’ అని రాస్తున్నారు. తెలుగులో ‘ఋ’ లేదు కాబట్టి పరవాలేదు మార్చుకున్నాం అనుకోవచ్చు. తెలుగు మాటల్లో ‘ఋ’ రాసినప్పుడే సమస్య వస్తుంది.

‘మంత్రి పదవి పోవడంతో ఆయన ఎంతో కృంగిపోయారు’ వంటి వాక్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ‘భూమిలోకి కృంగిపోయింది’, ‘కృంగి, కృశించిపోయారు’ వంటివీ కనిపిస్తాయి. ‘కృశించి’లోని ‘ఋ’ ప్రభావమేమో కృంగడానికి. ‘క్రుంగు’ అనేది తెలుగుమాట. తెలుగు మాటల్లో ‘ఋ’ ఉండకూడదు కదా. ‘క్రుంగు’లో రకారంపోయి ‘కుంగు’ అవుతుంది. ‘కుంగింది’, ‘కుంగి పోయారు’ అని రాయవచ్చు. ‘కుంగడం’ తప్పనుకొని దాన్ని ‘కృంగడం’ చేశారు. ఈ పద్ధతే కొనసాగితే ‘తుంచడం’, ‘తృంచడం’ కావచ్చు. ‘కుక్కడం’, ‘కృక్కడం’ కావచ్చు. ‘తుళ్ళిపడు’, ‘తృళ్ళి పడు’ కావచ్చు.

తెలుగు మాటల్లోనూ సంస్కృతపదాల్లోనూ ‘ఋ’ ‘రు’లను ఒకదాని బదులు ఒకటి రాయడం అలవాటయిపోతూ ఉంది. ‘తృటిలో తప్పిపోయిన రైలు ప్రమాదం’ అని రాస్తున్నారు. ‘త్రుటి’ అన్నది సరయిన మాట. తామర రేకులో తీక్షణమయిన సూది దిగడానికి పట్టేకాలం అని అర్థం. ఒక లఘువును ఉచ్చరించడానికి పట్టే కాలంలో నాలుగోవంతు కాలం అని కూడా అంటారు. కనురెప్పపాటు, కన్నుమూసి తెరిచేంత తక్కువ సమయంలో అన్న అర్థంలో ఈ మాటను వాడుతున్నాం. ఇది తెలుగుమాట కాదు. అందుకే ‘ర’కారంపోయి ‘తుటి’ అని కాదు, ‘త్రుటి’ అనే ఉంటుంది.

‘రాజకీయ నాయకులు పదవులకోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారు’ వంటి వాక్యాలూ కనబడతాయి. ఆత్రం అంటే ‘తొందర’, ‘త్వర’ అనీ, ‘విపత్తు’ అనీ అర్థం. ‘ఆత్రపడు’ అంటే ‘త్వరపడు’, ‘కళవళపడు’ అని అర్థం. ‘ఆతురపడు’ అన్నా అదే అర్థం. సంస్కృతంలో ‘ఆతురమ్’, ‘విద్యాతురాణాం న సుఖం న నిద్రా’ అంటారు. ‘ఆతురుడు’ అంటే తొందరపడేవాడు. ‘వ్యాధి గ్రస్తుడు’, ‘పీడితుడు’ అని కూడా అర్థాలున్నాయి. ఆతురత, ఆత్రుత అని రాయవచ్చు. ఆతృత సరయిందికాదు.

సర్టిఫికెట్ అన్న మాటకు సమానార్థంలో ‘ధృవపత్రం’, ‘ధృవీకరణ పత్రం’ అని వాడుతున్నారు. ఈ వార్తను ‘ధృవీకరించారు’ అని రాస్తున్నారు. ‘ధ్రువం’ అంటే కదలనిది, ‘శాశ్వత మైనది’, ‘నిశ్చితమయినది’ అని అర్థం. ధ్రువ నక్షత్రం ఉంది. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఉన్నాయి. సంగీతంలో పధ్నాలుగక్షరాల కాలం కలిగిన తాళం ధ్రువతాళం. ఈ అన్ని సందర్భాల లోనూ ‘ధ్రువం’ అన్నదే సరయిన మాట, ‘ధృవం’కాదు. కొంతమంది ‘శతృవు’ అనీ, ‘శతృ స్థావరం’ అనీ రాస్తుంటారు. శత్రువు, శత్రుస్థావరం సరయిన రూపాలు. ఉచ్చారణలో భేదం లేకపోవడంవల్ల రాతలో ఇటువంటి పొరపాట్లు దొర్లుతుంటాయి. దీనివల్ల పెద్ద నష్టమేమీ లేకపోయినా ఆ మాటలకు అర్థాలు తెలియనప్పుడు నిఘంటువులో వెతుక్కుంటే దొరకకపోవడం ఒక కష్టం. ఈ మాటలు తెలిసిన వారికి తప్పు రూపాలు వికారంగా కనిపిస్తాయి. తెలియని పాఠకులు ఇవే సరయిన మాటలనుకొని వీటికి మరింత ప్రచారం కలిగిస్తారు. అందువల్ల సరయిన రూపం తెలుసుకొని వాడడం మంచిది.

(ఇందులో వాడిన ఫోటోలు “VBA DURBHINI” యూట్యూబ్ వి. వారికి కృతఙ్ఞతలు)

-డి. చంద్రశేఖర రెడ్డి
98661 95673

రేపు:-
మన భాష- 6
“అచ్చుతో ఎందుకు రాయాలి”

RELATED ARTICLES

Most Popular

న్యూస్