కుక్కకాటుకు చెప్పుదెబ్బ అని విన్నాం గానీ వాస్తవంలో అనేక రకాలుగా చెప్పులు ఉపయోగిస్తున్నారు. సత్య హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుని పాత్రకు పేరొందిన బలిజేపల్లి లక్ష్మీకాంతకవికి ఒకసారి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఇది స్వాతంత్య్రం రాకముందే జరిగింది. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైనా అప్పటికే రచయితగా నటుడిగా ఆయనకు మంచి పేరుంది. పెద్ద వర్షం వచ్చినా కదలకుండా ఆయన నటన ఆస్వాదించేవారు. ఇక ఆయన పద్యాలు ఈనాటికీ సాహిత్యాభిలాషులకు వీనుల విందు.
ఒక ఊరిలో సత్య హరిశ్చంద్ర నాటకం వేస్తున్నారు. నక్షత్రకుడి పాత్రలో చంద్రమతిని కష్టాలు పెడుతుంటే ముందు వరుసలో ఉన్న ఒక బ్రిటిష్ అధికారి కోపం పట్టలేక బలిజేపల్లి మీదికి చెప్పు విసిరాడు. అంతలోనే తన తప్పు తెలుసుకుని మన్నించమని కోరాడు. ఆ అధికారిని మన్నించడమే కాకుండా ఆ పాదరక్షని మెడలో ధరించి నాటకం పూర్తిచేశాడు. దాంతో అక్కడికక్కడే ఆయనకి “పాదరక్షక” బిరుదు ప్రదానం చేశారు. ఆ విధంగా బలిజేపల్లి చరిత్రలో నిలిచిపోయారు. అలా చెప్పులు రకరకాలుగా ఉపయోగపడతాయి. కొన్నిసార్లు ఆకతాయిల చెంపలు పగలగొట్టడానికీ పనికొస్తాయి. ఇంకొన్నిసార్లు నిరసన తెలపడానికి దిష్టిబొమ్మలకు చెప్పుల దండ వేసి ఊరేగిస్తారు. ఇలా చెప్పుకొంటూ పోతే చెప్పు పురాణం చాలా ఉంటుంది.
తాజాగా ఒక వినియోగదారుడి నిరసన అందరి దృష్టినీ ఆకర్షించింది. సంగారెడ్డికి చెందిన సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఓలా బైక్ బుక్ చేసుకుంటే ఆలస్యంగా డెలివరీ ఇచ్చారు. ఆ తర్వాత తరచూ రిపేర్లు. సర్వీసింగ్ కి ఇస్తే ఎన్నాళ్లయినా బండి ఇవ్వలేదు. అడిగాడు. గొడవపడ్డాడు. అయినా లాభం లేకపోవడంతో ఓలా బ్యాటరీ బైక్ షోరూమ్ కి చెప్పులదండ వేశాడు. (ఇప్పటికే విని యోగదారులు ఓలా బైక్ తో అనేక సమస్యలు ఎదుర్కొంటు ఆందోళనలు చేస్తున్నారని వార్త) తాజా ఘటన సోషల్ మీడియాలో వ్యాప్తి అయింది. ఇప్పటికైనా ఓలా వారు దారికొస్తారో లేక చెప్పులదండనే సత్కారంగా భావించి చెప్పుల షోరూం కూడా ప్రారంభిస్తారో వేచి చూడాలి. అయినా చెప్పులు కాబట్టి సరిపోయింది గానీ …. ఊహించడానికే భయమేస్తోంది.
-కె. శోభ