Friday, November 15, 2024

మన భాష- 9

గణితంలో లాగానే మన లిపిలోనూ బిందువుకు చాలా ప్రాముఖ్యం ఉంది. తెలుగులో బిందువు రెండు రకాలు. అర్ధబిందువు, పూర్ణబిందువు. బిందువును అనుస్వారం అని కూడా అంటాం. సున్న/సున్నా అనీ అంటాం. మనలిపిలో పూర్వం అర్ధ, పూర్ణ బిందువులకు ప్రత్యేకంగా లిపి చిహ్నా లుండేవికావు. ముద్రణ వచ్చిం తర్వాతే అరసున్నాకి ‘c’ అనే లిపి చిహ్నం ఏర్పడింది. అంతకు ముందు నిండు సున్నానే రాసేవారు. దాని తరువాత ఉన్న హల్లునుద్విరుక్తంగా రాస్తే అది పూర్ణబిందువు, ఉదా: కొండ్డ. అద్విరుక్తంగా రాస్తే అది అర్ధబిందువు. ఉదా: నాండు.

తెలుగు మాటల్లో బిందువు పరుష సరళాలకు ముందే ఉంటుంది. అంటే కచటతప, గజడదబ అనే వర్ణాలకు ముందే ఉంటుంది. వంక, కొంగ, కొంచెం, గుంజ, గంట, కొండ, కంఠ, కంద, కంప, చెంబు వంటి మాటలలోనే ఉంటుందన్న మాట. ఇవి అయిదు వర్గాల హల్లులు. ప్రతి వర్గంలోనూ ఒక అనునాసికం ఉంటుంది. ఆ హల్లు ముందు ఆ వర్గ అనునాసికమే వస్తుందన్నమాట. వంక అంటే వఙ్క గంట అంటే గణ్ట, కంత అంటే కన్త, కంప అంటే కమ్ప అని. ఈ రెండు రకాలుగానూ రాయవచ్చు. కాని ప్రాచీన కాలంలోనే ఈ అనునాసికాల స్థానంలో బిందువును రాసే సంప్రదాయం ఏర్పడింది. వర్గహల్లుల ముందు ఆయా వర్గాల అనునాసికాల స్థానంలో బిందువును రాయడం ఇప్పుడు మన భాషలో సార్వత్రికం అయింది.

కచటతప, గజడదబలు తప్ప బిందువు తరువాత ఇతర హల్లులలో ఏది ఉన్నా ఆ మాట తెలుగుమాట కాదని చెప్పాలి. తెలుగులో అనునాసికాలలో న, మ లు మాత్రమే ద్విత్వాలుగా వస్తాయి. ఇటువంటి సందర్భాల్లో పూర్వం శాసనాలలో అంన్న, అంమ్మ వంటి లేఖనం కని పిస్తుంది. తక్కిన చోట్ల బిందువును రాసే సంప్రదాయం ప్రభావం ఇది. భాష రాయడం నేర్చుకునే దశలో చాలామంది పిల్లలు అంన, అంమ అని రాయడం గమనించవచ్చు.

సంయమనం, సంయమి వంటి మాటలు సంస్కృతం. సంవత్సరం, సంవాదం కూడా సంస్కృతం మాటలే. సంరంభం కూడా సంస్కృతమే. వంశం, హంసలు కూడా సంస్కృతాలే. సంలబ్ధి కూడా సంస్కృతమే. సంహారమూ సంస్కృతమే.

మహాప్రాణవర్గాలు అంటే ఖ, ఘ వంటి ఒత్తక్షరాలు ఎలాగూ తెలుగులో లేవు కాబట్టి బిందువు తరువాత ఇవి వచ్చినప్పుడు తెలుగుమాటలు కావని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. శంఖం, సంఘం వంటి మాటలు సంస్కృతాలే.

మన భాషను అజంత భాష అనీ, సంగీతానికి చాలా అనుకూలమైన భాష అనీ, తీయని భాష అనీ చెప్పుకుంటూ ఉంటాం. హలంతంగా ఉన్న మాట మీద అచ్చు చేర్చుకొని దాన్ని అజంతంగా మార్చుకుంటాం. అందువల్లే అనేక సంస్కృత పదాలూ, అన్యభాషా పదాలూ ఆ భాషల్లో హలంతాలై ఉండీ తెలుగులోకి వచ్చినప్పుడు అజంతాలైపోతాయి. ఫలమ్ ఫలము అవుతుంది. ధనమ్- ధనము అవుతుంది. హృదయమ్- హృదయము అవుతుంది. డాక్టర్ డాక్టరు అవుతుంది. జమీందార్- జమీందారు అవుతుంది. అన్యదేశ్యాల మకారాంత శబ్దాలు కూడా అజంతాలవుతాయి. ఉదా: ప్లాటినమ్- ప్లాటినము, ఇస్లామ్ – ఇస్లాము, ముస్లిమ్-ముస్లిము.

వాడుక భాషలో ఈ మాటలను ముఖ్యంగా మకారాంతాలను మకారాంతాలుగానే ఎక్కువగా వాడుతున్నాం. ఉచ్చారణలోనూ, రాతలోనూ కూడా వీటిని హలంతాలుగానే వాడుతున్నాం. పత్రం, పుష్పం, ఫలం, ప్లాటినం, ఇస్లాం, ముస్లిం అని. ఇతర హల్లుల విషయంలో హలంత అజంత రూపాలు రెండూ వాడుతున్నాం. ఉదా: స్కూల్ – స్కూలు, బెల్- బెల్లు, పాన్ – పాను, సుల్తాన్ – సుల్తాను.

పూర్వం మన పేర్లు హలంతాలుగా ఉండేవికావు. ఇప్పుడు హలంతాలుగా పేర్లు పెట్టు కోవడం నాగరికం అయిపోయింది. స్త్రీల పేర్లు మాత్రం మనవాళ్ళవి ఇంకా హలంతాలు కాలేదు. మగవాళ్ళ పేర్లు కొంత ఇంగ్లీషు వర్ణక్రమం వల్లా, కొంత బెంగాలీ ప్రభావం వల్లా హలంతాలుగా మారుతున్నాయి.

సుబ్రహ్మణ్యము, సత్యము, రామబ్రహ్మము వంటి పేర్లు కూడా హలంతాలై సుబ్రహ్మణ్యం, సత్యం, రామబ్రహ్మంగా మారిపోయాయి. స్త్రీల పేర్లలో ‘ము’ చివర ఉండేవి హలంతాలయ్యాయి. సూర్యకాంతము – సూర్యకాంతం అయింది. నాగరత్నము నాగరత్నం అయింది.

సర్వనామాలలో కూడా మేము మేం అయింది. మనము మనం అయింది. క్రియలలో కూడా వచ్చాము- వచ్చాం అయింది. ఉత్తమ పురుష క్రియలన్నీ ఈ విధంగానే హలంతాలయ్యాయి. వస్తాం, వస్తున్నాం, రాం, తినం మొదలయినవి. తనము, తినం వంటి ప్రత్యాయాలలో కూడా చివరి అచ్చు లోపించి తనం, రికం అయ్యాయి.

పదమధ్యంలో ఉండే బిందువు వర్గానునాసికం అయితే పదాంతంలోని బిందువు మకారం మీద అచ్చులోపించడం వల్ల ఏర్పడ్డది. పదాంతంలో అర్ధబిందువు ఉండదు. ఆధునికభాషలో అర్ధబిందువుకు ప్రయోగం లేదు. బిందువు అచ్చుకు తరువాతే వస్తుంది. అందువల్ల సున్నాతో మొదలయ్యే మాటలుండవు. కేవలం బిందువు అక్షరం కాదు. దాని ముందున్న వర్ణంతో కలిసి అది అక్షరం అవుతుంది. అందుకే తెలుగువారి లేఖన సంప్రదాయంలో పదంలో బిందువు దగ్గర విరిచి బిందువును తరువాత పంక్తిలో రాయడం కుదరదు. పదాన్ని విరచవచ్చుకాని, అక్షరాన్ని విరవకూడదు.

(ఇందులో వాడిన ఫోటోలు “Telugu Nerchukundam Randi”, “RS telugu channel” యూట్యూబ్ వి. వారికి కృతఙ్ఞతలు)

-డి. చంద్రశేఖర రెడ్డి
98661 95673

రేపు:-
మన భాష- 10
“ఎక్కడ అల్పప్రాణం- ఎక్కడ మహాప్రాణం”

RELATED ARTICLES

Most Popular

న్యూస్