Monday, November 18, 2024

మన భాష- 12

సంస్కృతం నుండి మనం అరువు తెచ్చుకున్న మాటల్లో థ, ధలతో ఉండే మాటలెన్నో ఉన్నాయి. అయితే ఈ రెండింటి మధ్యా భేదాన్ని పాటించడంలో పొరపాట్లు దొర్లుతుంటాయి. ఒకదాని బదులు ఒకటి రాయడమో, లేకపోతే అన్నిచోట్లా ఒకటే రాయడమో కూడా పరిపాటి. కొన్నిచోట్ల వీటిని తారుమారు చేయడంవల్ల అర్థభంగం వాటిల్లుతుంది. తక్కినచోట్ల ఉచ్చారణలో భేదం పోతుంది.

ఉదాహరణకు అర్ధ- అర్థ శబ్దాలను తీసికోవచ్చు. అర్ధ అంటే సగం, అర్థ అంటే కోరబడేది, ధనం, వస్తువు, ప్రయోజనం- శబ్దానికి ఉండే అర్థం. అర్థశాస్త్రం అన్నప్పుడు భూమి, బంగారం, ధనం సంపాదించే మార్గం తెలిపేది. చాణక్యుని నీతిశాస్త్రం అర్థశాస్త్రం. పదార్థం అన్నప్పుడు వస్తువు. కీర్త్యర్థం అన్నప్పుడు కీర్తికోసం అని అర్థం. శబ్దార్థాలు అన్నప్పుడు పదమూ అది బోధించే విషయమూ. అర్థశాస్త్రం అన్న మాటను ఈనాడు ధన సంబంధమైన విషయాలకు సంబంధించిన శాస్త్రంగా వాడుతున్నారు. అర్థ సంబంధమైనది ఆర్థికం. అర్థించు అంటే కోరడం. అర్థి అంటే అడిగేవాడు. అర్థన అంటే అడగడం. అభ్యర్థి, విద్యార్థి, ప్రత్యర్థి మొదలయిన పదాలన్నీ అంతే. సార్థకం అంటే ప్రయోజనవంతం. నిరర్థకం అంటే ప్రయోజన రహితం. సగం అన్న అర్థంలో తప్ప అర్ధ అనే మాటకు ప్రయోగంలేదు కాబట్టి తక్కిన అన్ని సందర్భాలలోనూ అర్థ అనే మాటనే వాడాలి.

అధి ఉపసర్గ. అధిక, అధికార, అధిక్షేప, అధిప, అధిపతి, అధిరోహణ, అధిష్ఠాన, అధ్యక్ష, అధ్యాత్మ మొదలయిన పదాలన్నీ ఈ ఉపసర్గతో వచ్చేవే. ఈ పదాల నుండి ఆధిక్యం, ఆధిపత్యం, అధ్యాత్మికం వంటి మాటలు వచ్చాయి. అధస్ అంటే కింద, అధోలోకం అంటే కింద ఉండేలోకం. అధమ, అధర అనే మాటలు అధస్ నుండే వచ్చాయి. అధముడు కిందివాడు. అధరం అంటే దిగువన ఉండేది. కింది పెదవి.

ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు అధ్యయనం చేయించే వాళ్ళు. వేదం చదివించే వారని అప్పటి అర్థం. ఇప్పుడు గురువు, చదువు చెప్పేవాడు అన్న అర్థంలో వాడుతున్నాం.

అధీనుడు అంటే స్వతంత్రం లేనివాడు, పరాధీనుడు. స్వాధీనం అంటే తన అధీనంలోనే ఉన్నది. స్వాధీనుడు అంటే స్వతంత్రుడు. అధునా అంటే ఇప్పుడు. అధునాతనం అంటే ఇప్పటిది. దీనినుండే ఆధునికం ఏర్పడింది.

అగాధం అంటే మిక్కిలి లోతైనది.

అధ్వరం, అవధానం, అనురోధం, అంతర్ధానం, అపరాధం, అభిధానం మొదలయిన మాటలన్నింటిలోనూ ధకారమే ఉంది. అంధ శబ్దానికి చూపు లేకపోవడం అని అర్థం. అంధత్వం, ఆంధ్యం, అంధకారం దీనినుండే వచ్చాయి.

అవధి అంటే హద్దు. ఆధి అంటే మానసిక వ్యథ.

ఆధార, ఆయుధ, ఆరాధన, ఇంధన, ఊర్ధ్వ, ఓషధి, ఔషధ, కంధర, కబంధ, స్కంధ, స్కంధావార, బంధు, బాంధవ, క్రోధ, క్షుధ, గంధ, ప్రధాన, బంధ, ప్రబంధ, బంధన, యోధ, విధ, బాధ, బుధ, నిధి, ప్రతినిధి, ప్రాతినిధ్యం, సన్నిధి, నిధన, నిబంధ, నిబంధన, పరిధి, పరిధాన, సంధి, సంధ్య, వ్యాధ, వ్యాధి, వర్ధన, బోధన, బధిర, బంధుర, విధి, విధాన, విధేయ, విధాత, మధు, మధుష, మధుకర, మధ్య, మాధవ, వంధ్య, బుధ, విబుధ, వధ, వధూ, మూర్ధ, మేధా, రాధ, రుధిర, వివిధ, విరోధ, శోధన, సాధారణ, సాధు, సాధ్వి, సుధా, సుధీ, సౌధ, సాధ్య సాధన, సింధు, సైంధవ, సైరంధ్రి మొదలయిన శబ్దాలన్నింటిలో ధకారమే ఉంది.

పదాదిలో ధ కారమే ఉంటుంది. థకారం ఉండదు. అందువల్ల ధర, ధరణి, ధర్మ, ధూర్త, ధన, ధాన్య, ధ్వజ, ధార, ధరిత్రి, ధవళ, ధాత, ధాత్రి, ధ్రువ, ధ్వని, ధ్వంస, ధీ, ధీర, ధూళి, ధూసర మొదలయిన మాటలన్నీ ధ కారాదులే. ధర అంటే భూమి అని అర్థం. భూమిని ధరించేది భూధరం. అట్లాగే పయోధరం, మహీధరం, గంగాధరుడు, చక్రధరుడు, గదాధరుడు, విద్యాధరుడు మొదలయిన మాటలన్నీ ఇటువంటివే.

కథ అంటే రచింపబడేది. కథ అనేక రకాలు. ఉపరి కథ, ఖండకథ, ఉపకథ, బృహత్కథ. చిన్న కథను కథానిక అంటున్నాం. కూర్చబడినది గ్రంథం. గ్రథనం అంటే కూర్చడం. గ్రథితం అంటే కూర్చబడింది. గ్రంథి అంటే వెదురు కణుపు. తిథిలో థకారం ఉంటుంది. తిథి నుండే అతిథి, ఆతిథ్యం వచ్చాయి.

తథా అంటే ఆవిధంగా, అట్లా, యథా అంటే ఏవిధంగా, ఎట్లా, తథ్యం అంటే సత్యం. యథార్థం అన్నా యథాతథం అన్నా సత్యమే. యథాతథం అంటే ఉన్నదున్నట్లుగా అన్న అర్థంలో వాడుతున్నాం. తథాగతుడంటే బుద్ధుడు. ఏ విధంగా మునులు మోక్షం పొందారో ఆవిధంగా మోక్షం పొందినవాడనీ, మంచిజ్ఞానం కలవాడనీ అర్థం.

తీర్థం అంటే బావిదగ్గర ఉండే నీళ్ళ తొట్టి, శాస్త్రం, ఋషులు సేవించిన జలాశయం, గురువు. తరింపజేసేది కాబట్టి తీర్థం. పథం అంటే తోవ. పథికుడు అంటే తోవలో నడిచేవాడు. త్రిపథగ అంటే గంగ. మూడు తోవలలో నడచినది. పంథ అన్నా మార్గమే. పాంథుడు అంటే బాటసారి. పథ్యం అంటే రోగం లేని మంచిమార్గం. పృథు అంటే విపులం, విశాలం, పెద్దది. పృథ్వి బహు ప్రయోజనాలను కలిగించేది. పృథివి, పార్థివ శబ్దాలు దీనినుండే వచ్చాయి. పృథక్ అంటే వేరుచేయడం. ప్రథమ అంటే తొలి. దీనినుండే ప్రాథమిక, ప్రాథమ్యం. వృథా అంటే వ్యర్థం. వ్యథ అంటే బాధ. నిశీథం అంటే అర్ధరాత్రి. నిశీథిని అంటే రాత్రి. నేపథ్యం, నైపథ్యం అంటే నేత్రాలకు హితవైనది. భూమిక అన్న అర్థంలో వాడుతున్నాం. సమర్థ, శపథం, వీథి, మిథునం, మథనం, మంథనం, మిథ్యా, మన్మథ, రథ, సారథి, మనోరథ, భాగీరథి, భీమరథి మొదలయిన మాటల్లో థ కారమే ఉంది. కచటతపలకు థ ఒత్తే ఉంటుంది. గజడదబలకు ధ ఒత్తే ఉంటుంది. అశ్వత్థ, ఉత్థాన, కపిత్థ, సక్థిలలో థ కారం, ఉద్ధారణ, బద్ధ, బుద్ధ, వృద్ధ, ప్రసిద్ధ, సిద్ధ, శుద్ధ, సిద్ధాంత, సగ్ధి, దగ్ధ, దుగ్ధలలో ధ కారం ఉంటాయి. సకారంతో థకారమే ఉంటుంది, ధ కారం ఉండదు. అస్థి, స్థూల, స్థితి, స్థాన, అవస్థ, స్థాలి, ప్రస్థాన మొదలయినవి ఉదాహరణలు. నాథ శబ్దానికి మాత్రం నాధ అన్న రూపాంతరం ఉంది.

(ఇందులో వాడిన ఫోటోలు “Telugu Vanam” యూట్యూబ్ వి. వారికి కృతఙ్ఞతలు)

-డి. చంద్రశేఖర రెడ్డి
98661 95673

రేపు:-
మన భాష- 13
“మన పేర్లు”

RELATED ARTICLES

Most Popular

న్యూస్