Tuesday, November 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంజాగ్రత్త! తెలుగు మరణించే ప్రమాదం ఉంది

జాగ్రత్త! తెలుగు మరణించే ప్రమాదం ఉంది

తెలుగులో-
కావ్య భాష;
గ్రాంథిక భాష;
ప్రామాణిక భాష;
మాండలిక భాష;
యంత్రానువాద భాష;
తెలుగు- ఇంగ్లిష్ కలగలిపిన తెంగ్లిష్ భాష; చివర క్రియాపదం మాత్రమే తెలుగయి…ముందు భాగమంతా ఇంగ్లిష్ అయిన నవనాగరికుల ఆధునిక భాష;
రైల్వే స్టేషన్ అనౌన్స్ మెంటు లా ప్రతిపదాన్ని అక్షరాన్ని విరిచి విరిచి పలికే కర్ణకఠోర భాష;
కృత్రిమ మేధ యంత్ర భాష…ఇలా తెలుగులోనే లెక్కలేనన్ని భాషలు వింటున్నాం. చదువుతున్నాం. అంటున్నాం.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి గ్రూప్-3 తెలుగు మీడియం ప్రశ్న పత్రాల పుణ్యమా అని తాజాగా ఈ పద్దులో “ముతక” తెలుగు కూడా కొత్తగా వచ్చి చేరింది!

క్రూడ్ బర్త్ రేట్; క్రూడ్ డెత్ రేట్ అన్న ఇంగ్లిష్ మాటలను మనుషులు అనువదించారో! యంత్రాలు అనువదించాయో! లేక మనుషులే యంత్రాల సాయంతో అనువధించి వధాన్యులు అయ్యారో తెలియదు కానీ…తెలుగు అభ్యర్థులు ఇప్పటివరకు ఏనాడూ వినని, చదవని
“ముతక మరణాల రేటు”
ముతక జననాల రేటు”
ప్రశ్నలకు గురయ్యారు. ఇలాంటి లేదా ఇంతకంటే ఘోరమైన కొరుకుడు పడని, ఏమాత్రం అర్థం కాని అనువాద ప్రశ్నలే తెలుగు మీడియం అభ్యర్థులకు ఎదురవుతున్నాయట.

ప్రతి వెయ్యి జననాల, మరణాల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని రూపొందించే డేటాకు పారిభాషికపదాలు- క్రూడ్ బర్త్ రేట్; క్రూడ్ డెత్ రేట్. ఈ మాటలను తెలుగులో ప్రతి వెయ్యి జననాల/మరణాల రేట్ అనికాని, జననాల రేట్ అనికాని అనాలి. ఇంకా స్పష్టతకోసం అవసరమైతే పక్కన బ్రాకెట్లో ఆ ఇంగ్లిష్ పారిభాషిక పదాలనో, బాగా వాడుకలో ఉంటే వాటి పొట్టి అక్షరాలనో యథాతథంగా ఇస్తే సరిపోయేదానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ “ముతక”ధోరణి ఎంచుకుంది. చాలా క్రూడ్ గా క్రూడానువాదం చేసి తెలుగు అభ్యర్థులతో పరమ క్రూడ్ గా ఆడుకుంది! ఇలాంటి క్రూడాయిల్ పరీక్షల్లో అభ్యర్థులు ఎంతగా ముడి చమురు మేధో జ్ఞానాన్ని మండించినా క్రూడ్ ప్రతిఫలంగా ముతక ఫలితాలే వస్తాయి కానీ…రిఫైన్డ్ ఫలితాలు రావు!

కనీసం ఇది కేంద్ర ముడిచమురు- సహజవాయు నిక్షేపాల వెలికితీత విభాగంలో ఉద్యోగాలకు అర్హత పరీక్ష అయినా ముడి జననాలు, ముడి మరణాలు సందర్భశుద్ధికి సరిపోయాయని సర్దుకుపోవచ్చు!  గ్రూప్-3 తెలుగు అభ్యర్థులపట్ల కమిషన్ మరీ ఇంత ‘ముతక’గా వ్యవహరిస్తుందా?

ఈ నిట్టూర్పు కొనసాగింపుగా బయట సమాజంలో బోర్డులు, వాహనాల మీద రాతల్లో తెలుగు కూడా ఇలాగే అఘోరిస్తోంది. ఇంతకంటే భయపెడుతోంది.

ఒక జాతీయ రహదారి మీద విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఒక దారి ఒక చోట ఆగిపోతుంది. అక్కడ వాహనాలను పక్కకు తీసుకోవాలి. “బి కేర్ఫుల్- డెడ్ ఎండ్” అన్న ఇంగ్లిష్ బోర్డు ఎడమవైపు; కుడి వైపు దీనికి అనువాదంగా “జాగ్రత్త- మరణించే ప్రమాదం ఉంది” అని ఉంది!

ఒక ఏడు నక్షత్రాల కార్పొరేట్ ఆసుపత్రి పద్నాలుగు అంతస్థుల ఇంద్రభవనం. ప్రతి ఫ్లోర్ మెట్ల పక్కన గోడ మీద “fire exit” అని ఇంగ్లిష్ లో “ప్రవేశించగల అగ్ని నిష్క్రమణ” అని తెలుగులో రాసి పెట్టారు! నిప్పు కణికల్లా రగిలే ఆ అక్షరాలు తమంతట తామే నిష్క్రమించడానికి చేయని ప్రయత్నం లేదు. అయితే ఆసుపత్రి సెంట్రలైజ్డ్ అతి శీతల వాతావరణం వల్ల అగ్ని అక్షరాలు మంచుగా గడ్డకట్టి ఎలాగో ప్రవేశించగలిగినా ఎలా నిష్క్రమించాలో తెలియక ఆత్మహత్యాసదృశంగా ఆసుపత్రి ఐ సి యు లోనే మూసిన కన్ను తెరవక నిర్యాణం చెందుతూ ఉన్నాయి!

“Vehicles are not allowed after this point” అన్న ఇంగ్లిష్ బోర్డుకు పక్కన తెలుగు అనువాద బోర్డు ఇలా ఉంది:-

“ఈ పాయిం
ట్దాటి వాహనాలు
లేవు”!

ఒక బస్సు వెనకాల తెలుగులో రాసిన విజ్ఞప్తి:-

“నన్ను చూసి ఎడ్వకురా”

ఇలా రాసి ఏడవకూడదని ఎలా షరతు విధిస్తారు! చదివిన ప్రతివారూ రోడ్డు మీద పొర్లి పొర్లి ఎడ్వల్సిందే కదా!

చివర ఫలశ్రుతిగా భాషాపరమైన పోతన భాగవతం గజేంద్ర మోక్షణం కార్టూన్ చూడండి. తెలుగు తెగులును దేవదేవుడే దిగివచ్చినా మొసలి నోటినుండి ఎందుకు కాపాడలేడో స్పష్టంగా అర్థమవుతుంది.

…దేశభాషలందు తెలుగు లెస్సు!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

Previous article
RELATED ARTICLES

Most Popular

న్యూస్