భాషలో కొత్త పదాలను కల్పించుకోవడమన్నది చాలా ముఖ్యమయిన ప్రక్రియ. ఏ భాష అయినా అభివృద్ధి చెందడమన్నది ఈ పదకల్పనా ప్రక్రియ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతిభాషకూ ఈ సామర్థ్యం ఉంటుంది. అయితే పదకల్పనలో భాషలు ప్రత్యేకమయిన విధానాలను అవలంబిస్తాయి. ఈ విషయంలో తెలుగుకూ, సంస్కృతానికీ భేదం ఉంది. కృత్తద్ధితాలూ, సమాస నిర్మాణం వంటివి రెండు భాషలకూ సమానమే. కాని సంస్కృతంలో ఉపసర్గలు ఒక విశిష్టమైన ప్రక్రియ.
పద నిర్మాణంలో ధాతువు మూలం. ధాతువుకు ఒక అర్థం ఉంటుంది. దానికి ప్రత్యేక అర్థాలు కల్పించడానికి ఉపసర్గలు చేరతాయి. ఉపసర్గ ధాతువుకు ముందు చేరుతుంది. హృ అనేది ధాతువు. దీనికి బలవంతమని అర్థం. సంహారం, విహారం, ఆహారం, ప్రహారం వంటి మాటలన్నీ ఈ ‘హృ’ ధాతువునుండే ఏర్పడుతున్నాయి. ఈ మాటలన్నిటికీ అర్థాలు వేరు. ఈ వేరు వేరు అర్థాలు, సం, వి, ఆ, ప్ర మొదలయిన ఉపసర్గలు చేరడంవల్ల ఏర్పడుతున్నాయి. కాబట్టి సంస్కృతంలో ఉపసర్గలు చేరి వివిధ అర్థాలలో పదాలు ఏర్పడడం అన్నది చాలా విస్తృతమయిన ప్రక్రియ.
సంస్కృతంలో ఇరవై రెండు ఉపసర్గలున్నాయి. అవి ‘ప్ర, పరా, అప, సం, అను, అవ, నిస్, నిర్, దుస్, దుర్, వి, ఆఙ్, ని, అధి, అపి, అతి, సు, ఉత్, అభి, ప్రతి, పరి, ఉప’. ధాతువులకు ఈ ఉపసర్గలుచేరి ఎన్నో మాటలు ఏర్పడతాయి.
‘ప్ర’ అనే ఉపసర్గను తీసికుంటే ప్రయోగం, ప్రవాదం వంటి మాటలెన్నో దీనితో ఏర్పడతాయి. యోగం అనే మాటకు యుక్త, కూర్చడం, నిగ్రహం వంటి అనేకార్థాలున్నాయి. ప్రయోగం అంటే వాడడం, కూర్చడం, అర్పణం వంటి ఆర్థాలున్నాయి. ప్రయోగం అన్న మాటను ఇంగ్లీషు ఎక్స్ పరిమెంట్ కు సమానార్థకంగా కూడా వాడుతున్నాం. విషప్రయోగం చేశారు, అణ్వస్త్రాలను ప్రయోగించారు, బలప్రయోగం చేశారు, నాటకప్రయోగం జరిగింది వంటి వాక్యాలలో ప్రయోగ శబ్దానికి అర్థచ్ఛాయలున్నాయి. నాటక ప్రయోగంలో ప్రయోగానికి ప్రదర్శన అని అర్థం. ఈ ప్రయోగ శబ్దం నుండి ప్రయోక్త- ప్రయోగించేవాడు అన్న పదం ఏర్పడింది. ప్రయోగి అన్నా ఇదే అర్థం. ప్రయోగ్యం, ప్రయోజ్యం, ప్రయోజనం, ప్రయోజకుడు మొదలయిన మాటలు ఈ విధంగా ఏర్పడ్డవే. నాటకాల పరిభాషలో ప్రయోగాతిశయం అనే మాట ఉంది.
సాధారణంగా ఈ ‘ప్ర’ అనే ఉపసర్గకు మిక్కిలి అని అర్థం. కంపం, కంపనం అన్న మాటలకు ‘ప్ర’ చేరి ప్రకంపం, ప్రకంపనం ఏర్పడతాయి. మిక్కిలి వణకడం అని అర్థం. ప్రకంపనాలు కలిగాయి అని ప్రయోగం. కాండం- ప్రకాండం అవుతుంది. చెట్టు బోదె అని అర్థం. వేళ్ళ దగ్గరినుండి కొమ్మలదాకా ఉండే వృక్షభాగం. ప్రకోపం అంటే తీవ్రమైన కోపం. ఉద్రేకం, అతిశయం అని కూడా అర్థం.
ప్రక్రియ అంటే మంచిపని, చేయదగినపని, పని విధానం అని అర్థం. క్షాళనం- ప్రక్షా ళనం అవుతుంది. బాగా కడగడమని అర్థం. శుద్ధి చేయడం.
ప్రఖ్యాతి అంటే మిక్కిలి ప్రసిద్ధి చెందినది. ప్రఖ్యాతి అంటే కీర్తి. ప్రగాఢం అంటే ఎక్కువ. ప్రఘోష అంటే పెద్ద ధ్వని. తప్తం అంటే వేడి చేయబడింది. ప్రతప్తం బాగా వేడి చేసింది. ప్రతాపం అంటే కూడా వేడి అనే అర్థం. పరాక్రమం, శక్తి అనే అర్థాలూ ఉన్నాయి. ప్రదక్షిణ చేయడం అంటున్నాం. ఎక్కువగా తిరగడం అన్న అర్థంలో ప్రదక్షిణకు చాలా ప్రాచుర్యం వచ్చింది.
ప్రదర్శనం అంటే విశదపరచిచూపడం. ప్రదానం అంటే గొప్పదానం. ప్రదాత అంటే గొప్ప దాత. ప్రస్తుతం ప్రదానం అంటే ఇవ్వడం అనీ, ప్రదాత అంటే ఇచ్చేవాడనీ ప్రయోగం. బహుమతి ప్రదానం జరిగింది అంటున్నాం. బహుమతి ప్రదాత అన్నప్పుడు బహుమతిని నెలకొల్పి ఇచ్చేవాడితోపాటు, సభలో ఔపచారికంగా బహుమతిని అందించే వ్యక్తీ స్ఫురిస్తున్నాడు.
పితామహుడు అంటే తాత. ప్రపితామహుడు అంటే ముత్తాత. ప్రప్రపితామహుడు అంటే ముత్తాత తండ్రి. పౌత్రుడు అంటే మనుమడు. ప్రపౌత్రుడు అంటే మునిమనుమడు. ప్రఫుల్లం అంటే బాగా వికసించింది. ప్రబంధం అంటే ప్రకృష్టమైన బంధం. కావ్యమనీ అర్థం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వర్ణనాప్రధానంగా వచ్చిన కావ్యాలను ప్రబంధాలు అంటున్నాం. బలం- ప్రబలం అవుతుంది. చాలా బలం కలిగింది అనీ, గొప్పదనీ, ముఖ్యమైనదనీ అర్థం. ఎక్కువ అని కూడా అర్థం. ప్రబలసాక్ష్యం అంటే చాలా బలమైన సాక్ష్యమని అర్థం. బాధకం అంటే బాధించేది. ప్రబాధకం ఎక్కువగా బాధించేది.
ప్రబోధం అంటే చక్కగా బోధించడం, వివరించడం, మెలకువ అనీ, జ్ఞానం అనీ కూడా అర్థాలున్నాయి. ప్రబోధనం అన్నా ఇదే అర్థం. ప్రబోధించు, ప్రబోధితుడు, ప్రబోధకుడు దీని నుండి ఏర్పడ్డవే.
ప్రభాస అంటే మిక్కిలి కాంతి. ‘భా’ అనే ధాతువుకు కాంతి అని అర్థం. ఈ ధాతువు నుండి భాస శబ్దం ఏర్పడింది. భానుడని సంస్కృతంలో గొప్ప నాటకకర్త ఉన్నాడు. ప్రభేదం అంటే విభజించడం, వేరుపరచడం. చిన్న చిన్న విభాగాలు చేయడం. ప్రమత్తుడు అంటే మిక్కిలి మత్తు పొందినవాడని అర్థం. ఏమరుపాటు కలిగినవాడనీ అర్థం. దీనికి వ్యతిరేకార్థంలో అప్రమత్తుడు, అప్రమత్తం అని వాడుతున్నాం. జాగరూకుడు, జాగరూకత అని అర్ధం.
ప్రమోదం అంటే ఎక్కువ సంతోషం. ప్రయత్నం అంటే మిక్కిలి యత్నం. ప్రలోభం అంటే మిక్కిలి లోభం. ప్రోషితుడు అంటే దేశాంతరానికి పోయినవాడు. శృంగార నాయికల్లో ప్రోషిత భర్తృక అని ఒక నాయిక ఉంది. భర్త దేశాంతరంలో ఉంటే బాధపడే నాయిక ఈమె. ప్రవాదం అంటే ఎక్కువగా వ్యాపించినమాట. ప్రభువు అంటే స్వామి. ప్రభవం అంటే పుట్టుక, ప్రభూతం అంటే పుట్టినది. ప్రసన్నం అంటే నిర్మలం, తేట అయినది, సంతుష్టి కలిగింది. ప్రసన్నం చేసుకోవడం అంటే సుముఖత కలిగేట్లు చేసుకోవడం, సంతోషింపజేయడం. ప్రకృష్టం అంటే గొప్పది. ప్రజననం అంటే పుట్టుక. ప్రకర్ష అంటే అతిశయం. ప్రకారం అంటే పోలిక. ప్రకిరణం అంటే చెదరినది. ప్రజ్వలనం అంటే మండడం. ప్రగతి అంటే ముందుకు పోవడం, అభివృద్ధి
(ఇందులో వాడిన కొన్ని ఫోటోలు “Learn Sanskrit Online : vyoma-samskrta-pathasala” యూట్యూబ్ వి. వారికి కృతఙ్ఞతలు)
-డి. చంద్రశేఖర రెడ్డి
98661 95673
(దీనితో “మన భాష” ధారావాహిక సమాప్తం. మనభాష పుస్తకంలో ఉన్నవి మొత్తం వంద వ్యాసాలు. ఐ ధాత్రి ప్రచురించినవి కేవలం 18. మిగతా వ్యాసాల్లో ఎక్కువ వ్యాకరణ విషయాలుంటాయి. ఆసక్తి ఉన్నవారు పుస్తకం సంపాదించి చదువుకోగలరు. అడగ్గానే వ్యాసాలను వాడుకోవడానికి అనుమతించిన రచయిత డి. చంద్రశేఖర రెడ్డి గారికి, ఈ పుస్తకం హక్కుదారు మీడియా హౌస్ పబ్లికేషన్స్ సంస్థ అధిపతి గోవిందరాజు చక్రధర్ గారికి ధన్యవాదాలు)