ఒక భాషలో పదజాలం ఆ భాష మాట్లాడే సమాజం అవసరాల దృష్ట్యా ఉంటుంది. ప్రపంచంలోని భాషలన్నింటిలోనూ పదాలు సమాన సంఖ్యలో ఉండవు. కొన్ని భాషల్లో చాలా ఎక్కువ పదాలు ఉండవచ్చు. కొన్ని భాషల్లో చాలా పరిమితమయిన సంఖ్యలో పదాలు ఉండవచ్చు. అభివృద్ధి చెందిన సమాజాల భాషలలో పదాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఒక సమాజ సంస్కృతిలో వచ్చే మార్పులు, వారికి పరిమితమయిన వస్తువులలో వచ్చిన మార్పులు ఆ సమాజ భాషలో ప్రతిఫలిస్తాయి. పూర్వం వాడుకలో ఉండిన కొన్ని మాటలు నేడు వాడుకలో లేవు. అట్లాగే పూర్వం వాడుకలో లేని మాటలెన్నో భాషలో కొత్తగా ఏర్పడ్డాయి. అంటే భాషలో నిరంతరంగా కొన్ని పాత మాటలుపోయి కొత్త మాటలు వచ్చి చేరుతూ ఉంటాయి.
కొత్త మాటలు ఎలా ఏర్పడతాయి? అరువు తెచ్చుకున్న పదాలను పక్కన పెడితే ఒకే భాషలోని పదాలు కూడా ఒకదానికొకటి సంబంధం లేనివిగా ఉండవు. సాధారణంగా ఉన్న పదాల నుండే కొత్త పదాలు పుడుతుంటాయి. ఉన్న పదాలనే వాక్యంలో భిన్న భాషా భాగాలుగా ఉపయోగించవచ్చు. పదాన్ని కొంచెం మార్చడం ద్వారా కొత్త పదాన్ని నిర్మించవచ్చు. రెండు మూడు పదాలను కలపడం వల్ల కూడా కొత్త పదం ఏర్పడవచ్చు. అనేక పదాలను కలిపి పదాన్ని నిర్మించవచ్చు. ఇట్లా ఏర్పడిన పదాలను విశ్లేషించడానికి వాటికి వ్యాకరణ పరిభాషలో వేరువేరు పేర్లు పెట్టుకున్నాం.
వాక్యంలో కర్త, కర్మ, క్రియలుంటాయి. కర్త కర్మలు నామవాచకాలు, అంటే పేర్లు. క్రియ పనిని తెలియజేసే మాట. ఈ నామవాచకాలకు క్రియలకూ విశేషణాలూ ఉంటాయి. నామ వాచకాలు, విశేషణాలు, సర్వనామాలు, క్రియలు, క్రియావిశేషణాలు మొదలయిన విధంగా పదాలను భాషాభాగాలుగా విభాగం చేస్తూ ఉంటారు. ఇట్లా విభాగం చేసినప్పుడు కొన్ని మాటలు నామవాచకాలూ కావచ్చు, విశేషణాలూ కావచ్చు, క్రియలూ కావచ్చు. అటువంటి సందర్భంలో వాక్యంలో ఆ మాట నిర్వహించిన పాత్రను బట్టి అది నామవాచకమో, విశేషణమో, క్రియో నిర్ణ యించాలి. ‘అది పెద్ద ఊరు’ అన్నప్పుడు ‘పెద్ద’ విశేషణం. ‘ఆయన ఊరికి పెద్ద’ అన్నప్పుడు ‘పెద్ద’ నామవాచకం. ‘దీపం వెలిగింది’ అన్నప్పుడు, ‘వెలిగింది’లోని వెలుగు క్రియ. ‘దీపం వెలుగు ఇస్తుంది’ అన్నప్పుడు ‘వెలుగు’ నామవాచకం. ఉన్న మాటలనుండి కొత్త మాటలను కల్పించుకున్నట్లుగానే అవే మాటలను భిన్న భాషా భాగాలుగా కూడా ఉపయోగించుకోవచ్చునన్నమాట.
పదంలోని మౌలిక భాగాన్ని ధాతువు అంటాం. ఈ ధాతువుకు వివిధ ప్రత్యయాలు చేర్చి ఎన్నో మాటలను తయారు చేసుకోవచ్చు. కర్త, కర్మ, క్రియ అన్న మూడు మాటలకూ ధాతువు ఒక్కటే. భార్య, భర్త అన్న రెండు మాటలకూ ధాతువు ఒక్కటే. రెండు, మూడు అన్నది ఇక్కడ ఉదాహరణ కోసమే. ఒక్కొక్క ధాతువునుండి పదులు వందల సంఖ్యలో పదాలు ఉత్పన్నం అవుతాయి. కొన్ని భాషల్లో ఈ ప్రక్రియ చాలా విస్తృతంగా ఉంటుంది. కొన్ని భాషల్లో అంత విస్తృతంగా ఉండదు. నిఘంటువులలో ఇటువంటి పదాలన్నీ ఇస్తారు. అట్లాగే పైకి మాట ఒక్కలాగే ఉండి ధాతువు వేరుగా ఉన్నా ఆ మాటలను వేరుగా ఇస్తారు. ఒకదానికొకటి సంబంధంలేని అర్థాలున్నా వాటిని విడిగా ఇస్తారు. అయితే భాషలో ఏర్పడే సమాసాలన్నిటినీ పట్టికలో కూర్చడం కాని నిఘంటువులో ఇవ్వడంకాని సాధ్యంకాదు. అందువల్ల వాటి కూర్పుకు సంబంధించిన సూత్రాలు వ్యాకరణాలలో ఉంటాయి. మన కల్పనా సామర్థ్యాన్ని బట్టి, అవసరాన్ని బట్టి పదాలను ఎన్నో రకాలుగా కలిపి కొత్త పదాలను నిర్మించుకోవచ్చు.
తెలుగులో కొన్ని మాటలను క్రియలుగాను, నామవాచకాలుగాను కూడా ఉపయోగించ వచ్చు. ఉతుకు, ఉరుము, వెలుగు, చదువు, పొంగు మొదలయినవి ఇటువంటివి. అయితే వీటిలో క్రియా పదంగా వాడినప్పుడు, నామవాచకంగా వాడినప్పుడు అర్థంలో కొంత భేదం కూడా ఏర్పడవచ్చు.
క్రియాపదం మీద ప్రత్యయాన్ని చేర్చి నామవాచకంగా మార్చుకోవచ్చు. అలుగు-అలక, ఆడు-ఆట, ఎన్ను-ఎన్నిక, ఓపు-ఓపిక మొదలయినవి ఇటువంటివి. ఈ మాటల్లో చేరిన ప్రత్యయాలను వ్యాకరణ పరిభాషలో కృత్ప్రత్యయాలు అంటారు. కృత్ప్రత్యయం చేరిన పదం కృదంతం. ఈ కృదంతం నామవాచకం కాబట్టి ఈ విధంగా ఏర్పడిన నామవాచకాలను కృదంత నామాలంటారు.
నామవాచకం మీద కూడా ప్రత్యయాలు చేరి కొత్త నామవాచకాలు ఏర్పడవచ్చు. గొప్ప- గొప్పతనం, జూదం – జూదగాడు, చెలి-చెలికత్తె, కల్ల-కల్లరి మొదలయినవి ఇటువంటివి. ఇక్కడ చేరిన ప్రత్యయాలను తద్ధిత ప్రత్యయాలంటారు. ఏర్పడిన నామవాచకం తద్ధిత నామం.
రెండుకాని, అంతకంటే ఎక్కువ నామవాచకాలు కాని కలిసి ఏర్పడిన పదాన్ని సమాసం అంటారు. అన్నదమ్ములు, ముక్కంటి, తీపిమాట, ముల్లోకాలు మొదలయినవి సమాసాలు. వీటిని సమస్తనామాలు అని కూడా అనవచ్చు. రెండు కాని అంతకంటే ఎక్కువ క్రియాపదాలు కలిసి కొత్త పదమేర్పడితే దాన్ని క్రియాసమాసం అంటారు. చేసికొను, తీసివేయు, పగులగొట్టు, చెల్లబెట్టు మొదలయినవి క్రియా సమాసాలు. వీటికి విలక్షణమయిన అర్థం వచ్చినట్లయితే శబ్ద పల్లవాలు అంటారు.
నామవాచకం మీద క్రియాపదం చేరి కూడా సమాసం ఏర్పడుతుంది. విజయం చేయు వంటివి.
రెండుకాని అంతకంటే ఎక్కువకాని పదాలు కలవడం అని అంటున్నా, తెలుగులో రెండు పదాలో మూడు పదాలో కలవడం ఉందికాని సంస్కృతంలో లాగా బహుపదాలు కలిసి సమాసం ఏర్పడదు. ఒకవేళ కష్టపడి మనం అటువంటి సమాసాన్ని తయారుచేసినా కృతకంగా ఉండి వినేవారికి ఎబ్బెట్టుగా ఉంటుంది.
(ఇందులో వాడిన ఫోటోలు “Janakiram Class” యూట్యూబ్ వి. వారికి కృతఙ్ఞతలు)
-డి. చంద్రశేఖర రెడ్డి
98661 95673
రేపు:-
మన భాష-18
చివరి భాగం
“ఉపసర్గలు”