Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశిథిలాలనుండి శిఖరాలకు- 3

శిథిలాలనుండి శిఖరాలకు- 3

సినిమాల్లో కల్పితగాథలకు నిజజీవితంలో మనం కన్నీళ్ళు కారుస్తాం. పూటగడవని పెంటపాలెం పక్కన వేటపాలెం పిల్లాడు అమెరికా వెళ్ళి వేలకోట్లు సంపాదించి సొంత విమానం రెక్కలు కట్టుకుని శ్రీమంతుడిగా తిరిగొచ్చి సొంతూళ్ళో సినిమా తెరమీద బురదలో దిగి…అలవాటులేని వ్యవసాయం చేస్తుంటే చెమట మనకు పడుతుంది. మన జేబుకు చిల్లు పడుతుంది. నటించిన హీరోకు డబ్బు పండుతుంది.

మనల్ను మనం ప్రేమించుకోలేని వైరాగ్యం మనది. మనల్ను మనం బాగుచేసుకోలేని నిర్లక్ష్యం మనది.

సమస్త ప్రపంచభారాన్ని భుజాన మోసి…మనల్ను కని…పెంచి…పెద్ద చేసిన తల్లిదండ్రులకంటే మనకు ఎలాంటి సంబంధంలేనివారు ఆరాధ్య దైవాలు. బడిలో పాఠాలు, బతుకు పాఠాలు చెప్పిన గురువులకంటే కాటికి కాళ్ళు చాచిన వయసులో మునిమనవరాలి వయసు హీరో ఇన్ తో కుప్పిగంతులు వేసే అతివృద్ధ హీరోలు ఆదర్శవ్యక్తులు.

మన యుద్ధం వేరెవరో చేయాలన్నట్లు మనల్ను మట్టి బొమ్మలుగా చేసిందెవరో, ఎందుకు చేశారో, వినోద ఉన్మత్త క్రీడకు, రాజకీయాలకు తోడు…కూడు పెట్టని సామాజిక మాధ్యమాల వేలం వెర్రి యుద్ధాల్లో మన చేత్తో మన తలను మనమే నరుక్కుంటున్న సైకో ఫ్యాన్స్ ఉప్పెనలో ఒకానొక సదాశివపేటలో ఒకానొక నిరుపేద నాగరాజు విజయగాథ మనకెందుకు?

పట్టెడన్నం దొరకని పేదరికపు బాల్యం. ఉద్యోగం చేయలేని తండ్రి. పొలాల్లో రోజు కూలీ చేసే తల్లి. నలుగురు పిల్లలు. ఇక ఆ ఇల్లెలా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. ఇరవై రూపాయలు పోగొట్టినందుకు శిక్షగా కళ్ళల్లో కారం చల్లి…కర్ర తీసుకుని తల్లి కొట్టిన దెబ్బలకు వెక్కి వెక్కి ఏడ్చి...ఆ ఏడుపులోనే తల్లి కోపానికి పేదరికం తప్ప ప్రేమ లేకపోవడం కారణం కాదని కనుక్కున్నాడు చిన్నపిల్లాడు నాగరాజు. ఇంట్లో ఏ మాత్రం భారం కాకుండా చేతనైన పని చేసి…వందో, రెండొందలో సంపాదించాలనుకున్నాడు స్కూల్ విద్యార్థి నాగరాజు. కార్పెంటర్ దగ్గర కూలీ పని చేశాడు. ఉదయం నాలుగింటికే లేచి సైకిల్ మీద న్యూస్ పేపర్లు వేశాడు కాలేజీ విద్యార్థి నాగరాజు. బట్టల షాపులో సేల్స్ మ్యాన్ జాబ్ చేశాడు. లారీ క్లీనర్ గా పని చేశాడు.

ఇన్ని కష్టాలమధ్య పట్టుదలగా డిగ్రీ పూర్తి చేశాడు. జీవితాశయమైన ఎం బి ఏ చేయడానికి కుదరలేదు. బీ కామ్ లో గోల్డ్ మెడల్ వచ్చినా…ఐ సెట్ ప్రవేశ పరీక్షలో పాస్ అయి ఉస్మానియాలో అడ్మిషన్ వచ్చినా ఫీజు కట్టేంత స్థోమత లేక...ఎం బి ఏ కలలు కల్లలై…నల్గొండలో ఎం కామ్ లో చేరాడు. సీనియర్ల ర్యాగింగ్ భరించలేక ఒక రోజు క్రికెట్ బ్యాట్ తీసుకుని ఎదురుతిరిగాడు. దెబ్బతిన్న సీనియర్లు ప్రతీకారంగా చావగొడతారని మిత్రుడు రాత్రికి రాత్రి హాస్టల్ నుండి వెళ్లిపొమ్మని సలహా ఇచ్చాడు సదుద్దేశంతో. ఆరోజు అర్ధరాత్రి లారీ ఎక్కి వచ్చేసిన నాగరాజుకు ఇక ప్రపంచమే పాఠశాల అయ్యింది. బతుకు నేర్పని చదువులెందుకు అనుకుని చదువుకు స్వస్తి చెప్పాడు.

మిత్రులందరూ ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకుంటూ ఉంటే సదాశివపేటలో తనొక్కడే నిరుద్యోగిగా ఇంట్లో కూర్చుని గోళ్ళుగిల్లుకుంటున్న అపరాధభావమేదో వెంటాడింది. “మీ దోస్తులాగ నువ్ కూడా ఎక్కడైనా పని చెయ్…లేదంటే ఎందులో అయినా దూకి సావు…” అన్న తల్లి మాటలు నాగరాజుకు గుండెల్లో గుచ్చుకున్నాయి. అంతే. మిత్రుడి దగ్గర వెయ్యి రూపాయలు చేబదులు తీసుకుని…“డబ్బులు సంపాదించాకే తిరిగొస్తాను” అని అమ్మకు చెప్పి సదాశివపేటలో వికారాబాద్ బస్సెక్కాడు. వికారాబాద్ రైల్వే స్టేషన్లో కర్ణాటక హుబ్లీ రైలెక్కాడు. జనరల్ కంపార్ట్మెంట్ లో నిద్రలేని రాత్రి తరువాత హుబ్లీలో కాలు పెట్టాడు నాగరాజు. అక్కడేమి జరిగిందో తరువాత భాగంలో.

రేపు:-
శిథిలాలనుండి శిఖరాలకు- 4
“ఏటికి ఎదురీది…”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

Previous article
RELATED ARTICLES

Most Popular

న్యూస్