Tuesday, November 26, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపండిన గోపిరెడ్డి వ్యంగ్యం

పండిన గోపిరెడ్డి వ్యంగ్యం

గోపిరెడ్డిని నేనెప్పుడూ కలవలేదు. చూడలేదు. నా వ్యాసాలు చదివే పాఠకుడిగా తనను తాను పరిచయం చేసుకున్నారు ఫోన్లో చాలా ఏళ్ళ క్రితం. తనొక పోలీసు ఉద్యోగి అని, తెలంగాణ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడని తరువాత తెలిసింది. తెలుగు భాషకు సంబంధించిన నా రాతలమీద స్పందిస్తుంటారు కాబట్టి తెలుగు భాషాభిమాని అని తెలిసింది. మొన్న ఒకరోజు నా అడ్రస్ అడిగి తను రాసిన “జాతిరత్నాలు- వ్యంగ్య కథలు” పుస్తకం పంపారు. సమీక్షకోసం పంపారో, చదవమని పంపారో తెలియదు. అసలే పోలీసు. ఆపై వ్యంగ్యభాషలో రాసిన విషయాల సమాహారమది. కాబట్టి ఒళ్ళు దగ్గరపెట్టుకుని చదివాను. బాగున్న ఒకటి రెండు విషయాలు చెప్పి బాగాలేనివాటి జోలికి వెళ్ళకుండా నన్ను నేను కాపాడుకుందామనుకున్నాను. తీరా రెండు పేజీలు చదవగానే గోపిరెడ్డిలో పోలీసు మాయమై…పల్లెల్లో రావి చెట్టు కింద అరుగు మీద కూర్చుని ఊరందరి యోగక్షేమాలు కనుక్కునే పెద్ద మనిషి కనిపించాడు. చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద ఆనందాలు వెతుక్కునే సగటు మనిషి కనిపించాడు. తనమీద తనే హాయిగా జోకులేసుకునే హాస్యప్రియుడు కనిపించాడు. పుస్తకానికి ముందుమాటగా-

గోపిరెడ్డి వాక్యాల్లో బిగువు, పట్టు, జవం, జీవం ఉంటాయి. మెరుపుల్లాంటి మాటలు, హ్యూమన్ బిహేవియర్ లోని అలసత్వాన్ని, అల్పత్వాన్ని పట్టుకుంటాడు. అలంకారాలూ చిత్రణ అనే పెద్ద గొడవని అలవోకగా సాధిస్తాడు. చివర ఒక వ్యంగ్యాత్మక వ్యాఖ్యలతో పాఠకుడు పులకరించిపోయే ముగింపు ఇస్తాడు”
అని తాడి ప్రకాష్;

గోపిరెడ్డి ఎక్కడ కూడా సామాజిక స్పృహతో దాడిచేయడు. సంక్లిష్ట, సంవిధాన, సామాజిక సమతుల్య, మూల్యాంకన, ఆర్థిక సంఘర్షణ, సనాతన, ఛాందస ఈ రకమైన వేటకొడవళ్లు లేవు. హైదరాబాద్ ట్రాఫిక్ లో ఇరికించకుండా ప్రశాంతంగా వాళ్ళవూరు గూడేనికి, నేలమర్రికి తీసుకెళతాడు. పోలీస్ స్టేషన్లో మంచి టీ తాగిస్తాడు” అని జి.ఆర్.మహర్షి లాంటి చెయి తిరిగిన రచయితలు ప్రశంసించాక చెయి తిరగని రచయితగా నాకు చెప్పడానికి ఏమి మిగిలి ఉంటుంది?

పోలీసు దెబ్బలు పైకి కనిపించవని లోకంలో బాగా ప్రచారంలో ఉన్న సంగతి. గోపిరెడ్డికి అలాంటి మొహమాటలేమీ ఉన్నట్లు లేవు. వ్యంగ్యంతో పైకి వాతలు తేలేలా బాగా గట్టిగానే కొట్టారు. ఏమి రాస్తున్నామో తెలియక రాచి రంపాన పెట్టే రచయితల పద్దులో గోపిరెడ్డిని కలపడానికి వీల్లేకుండా తనను తాను జాగ్రత్తగా మలచుకున్నారు.

తెలుగువారు తెలుగు రాయడమే ఒక సాహసం. అలాంటిది తెలుగులో హాస్యం, వ్యంగ్యం రాయడం ఇంకా పెద్ద సాహసం. పోలీసు కాబట్టి గోపిరెడ్డి ధైర్యంకొద్దీ వ్యంగ్యం రాసినట్లున్నారు. తెలుగువారు తెలుగు పుస్తకాలు కొంటారనుకున్న భ్రమలతో పుస్తకాన్ని ముద్రించలేదని గోపిరెడ్డి నాతో స్పష్టంగా చెప్పారు. ఇరవై ఏళ్ళుగా తను రాసిన వ్యంగ్య రచనలన్నీ ఒక సంకలనంగా తీసుకురావాలని పుస్తకం ముద్రించి చేతులు కాల్చుకున్న గోపిరెడ్డి ఔదార్యం అభినందించదగ్గది.

తెలుగు భాషలో డిగ్రీలు చేసినవారు, జర్నలిజంలో శిక్షణ తీసుకుని ప్రామాణిక భాష నేర్చుకుని రాసేవారితోపాటు సమాజంలో వివిధ వృత్తుల్లో స్థిరపడ్డ గోపిరెడ్డిలాంటివారు ఇబ్బడిముబ్బడిగా తెలుగులో రచనలు చేయడం ఇప్పుడు తెలుగు భాషకే పెద్ద అవసరం. మాట్లాడేంత సహజంగా, అందంగా రాయడం అందరికీ చేతకాదు. రాసే భాషకున్న పరిమితులు ఒక సమస్య. రాసేప్పుడు మరీ ఫార్మల్ శైలిలోకి వెళ్ళి అసహజం కావడం మరో సమస్య. జనం వాడుకలో లేని పదాలు, పదబంధాలు, కవిత్వ సర్కస్ విన్యాస పద్మవ్యూహ ప్రాసల్లో ఇరుక్కుని బయటికి రాలేకపోవడం కవి జన్యులోప సమస్య.

రచయితగా గోపిరెడ్డికి ఇలాంటి సమస్యలేమీ లేవు కాబట్టి…ఎదుటి మనిషితో మాట్లాడుతున్నంత హాయిగా చెప్పగలిగారు. సంభాషణాత్మక శైలిలో ఆయా పాత్రలను స్వభావాలతోపాటు మనముందు ఆవిష్కరించగలిగారు. మచ్చుకు కొన్ని “జాతి రత్నాలు”:-

“ప్రతి వందేళ్లకోసారి మనుషులు విభజింపబడతారు. మొదట యజమానులూ, కార్మికులుగా విభజింపబడ్డారు. అయితే ఇప్పటికీ ఎవరు యజమానులో ఎవరు కార్మికులో తెలియక తికమక పడుతున్నారు. దేన్నైనా సులభంగా అర్థం చేసుకోవడానికే మనం విభజనని ఆశ్రయిస్తాం. మరి విభజన తరువాత కూడా అర్థం చేసుకోవడం క్లిష్టం అయితే మనం ఇంకో విభజనకు పోవడంలో తప్పు లేదు. ఈ తాత్విక సందర్భంలో ముందుకు వచ్చిన విభజన “వక్తలు-శ్రోతలు” అని.

నిజంగానే ఈ రెండు రకాల మనుషులను తప్ప వేరే రకం మనుషులను మన రమేష్ చూడలేదు. పుట్టుకతోనే ఆయా వర్గాల్లో పుడతారు తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదని రమేష్ అంటాడు. ప్రతీ సందర్భంలోనూ తానే వక్త కావడం యాదృచ్ఛికం అని తను అనుకుంటాడు. కానీ, శ్రోతల పట్ల రమేష్ కు ఎనలేని సానుభూతి ఉంది. అది కార్మికుల పట్ల యజమానులకుండే సానుభూతిలాంటిది మాత్రం కాదు. రమేష్ కు ఎవరినైనా శ్రోత గా మార్చే ప్రతిభ ఉంది. రాజకీయులు ప్రజలను ఓటర్లుగా మార్చడానికి చేసే కార్యక్రమాల కంటే ఎక్కువే చేస్తాడు జనాన్ని శ్రోతలుగా మార్చడానికి. వక్తగా తనకు తెలియని విషయం ఉందని రమేష్ ఎన్నటికీ నమ్మడు. కానీ, శ్రోతలకు చాలా విషయాలు తెలియవు అని ఆయన ప్రగాఢ నమ్మకం”
-వక్తలు, శ్రోతలు కథలో ముందు మాట.

కొంతమంది కొన్ని విషయాలను సరదాగా తీసుకుంటారు. వీరికి ఏ విషయాన్ని సరదాగా తీసుకోవాలో మాత్రం తెలియదు అంటే నమ్మండి. సంసారం, పెళ్లి అనే విషయాలు ఎంత సరదా అయినవో అంత ప్రమాదకరమైనవి కూడా. ఈ ప్రమాదాల వల్ల అయ్యే గాయాలు పైకి కనపడవు. కనపడకపోయినా అంతర్గత రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. అందువల్ల కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. అది మన రోగనిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది”
-జాతి వైరం కథ ప్రారంభం.

“సినిమా చూసిన రెండు రోజులకు కోలుకున్న పోలీసులు డైరెక్టర్, నిర్మాతల మీద కేసు ఫైల్ చేశారు. కోర్టు అత్యవసర కేసుకింద విచారించి “డైరెక్టర్ అరివీర భయంకర్ కు, నిర్మాత ప్రతీకారం పాపారావుకి, కథారచయిత శాడిస్ట్ శ్యాం కు హెల్మెట్ లేకుండా ఈ సినిమా చూపించాలి” అని ఉత్తర్వులు ఇచ్చి, వాళ్ళ కళ్ళల్లో భయం తాండవిస్తుండగా జడ్జి బెంచ్ దిగిపోయాడు”
-సినీ మాలోకం కథలో ముగింపు.

“భవిష్యత్తులో నా జీవిత చరిత్ర రాసుకోవడానికి రిహార్సల్ గా నా మిత్రుని జీవిత చరిత్ర రాస్తున్నాను.

ప్రతి జీవికీ ఒక జీవిత చరిత్ర ఉంటుంది. ఎవరి జీవిత చరిత్ర వారే రాసుకుంటారు. కాబట్టి, జీవిత చరిత్రలన్నీ మంచిగానే ఉంటాయి. అలాగని ఒకని జీవిత చరిత్ర వేరే వారు రాస్తే బాగుండదనికాదు. కానీ, ఇలాంటి జీవిత చరిత్ర మీరు ఇంతవరకు చదివి ఉండరని నా నమ్మకం”
-జీవిత చరిత్ర కథకు ఎత్తుగడ.

మనిషికి ఏదైనా ఆపరేషన్ కావడం మంచిది కాదు. అందునా మోకాలుకు అసలే కాకూడదు. నా మోకాలు అరిగిందని ఎక్సరే చూసిన డాక్టర్లు చెప్పారు. దాన్ని రీప్లేస్ చేయాలి అని కూడా నొక్కి చెప్పారు. ‘ఎందుకు అరిగింది?’ అంటే మటుకు ఎవరూ సరైన కారణం చెప్పలేదు. డాక్టర్లు సరైన కారణం చెప్పలేదు అంటే మా ఆవిడ ఊరుకోదు. నా మెదడు మోకాల్లో ఉంది అని మా ఆవిడకు ఏనాడో తెలుసు. అందుకని, నేనే ఓ కారణం చెప్పా. “మెదడు ఎక్కువగా వాడడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు” అని.

“నీ మెదడు మోకాల్లో ఉన్నమాట నిజం అయినప్పటికీ, దాన్ని వాడడం వల్ల అనే కారణాన్ని నేను ఒప్పుకోను” అని కొట్టిపారేసింది.

ఏ విధంగా అరిగినప్పటికీ ఉన్న ఆ కాస్త మెదడును కూడా తీసేస్తున్నందుకు మా ఆవిడ సంతోషించింది”
-ఆత్మీయ పరామర్శ కథలో రచయిత తనమీద తనే రాసుకున్న విషయాలు!

గోపిరెడ్డి సృష్టించినవి పాత్రలు కావు. సూర్యాపేటలో తనకు ఎదురుపడ్డ మనుషులు. అందుకే అవి మనతో మాట్లాడతాయి. ఆ మనుషులమధ్య మనల్ను మనం వెతుక్కోవచ్చు.

గోపిరెడ్డి ఫోన్ నంబర్- 95157 87388. పుస్తక ముద్రణతో చేతులు కాల్చుకున్న గోపిరెడ్డి ఇంకా రాస్తారట. కొందరంతే. ఎప్పటికీ మారరు. ఈ సమాజం మీద వారికేదో ఇది!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్