Thursday, December 12, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసామాన్యశాస్త్రం-1

సామాన్యశాస్త్రం-1

ఫలశ్రుతి:-
ఈ ధారావాహిక పూర్తయ్యేసరికి సగటు మనిషన్నవాడు లేనేలేడని మీరు గ్రహిస్తారు. సామాన్యుడిని చూడగలుగుతారు. అర్థం చేసుకోగలుగుతారు. ఇంకా లోతుకు వెళితే చుట్టూ ఉన్న సామాన్యతను, మీలో కూడా సామాన్యుడిని పొరలు పొరలుగా దర్శించగలుగుతారు.

ఉపోద్ఘాతం:-
“ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము,
నరుడు నరుడౌట యెంతో దుష్కరమ్ము సుమ్ము”
అన్నాడు దాశరథి.
మనిషి మనిషి కావడమే అన్నిటికంటే కష్టం. నిట్టనిలువుగా ఎదిగిన సెలెబ్రిటీలు కాకుండా మైదానాలుగా విస్తరించిన సామాన్యులు, వారిలో సామాన్యత గురించిన చర్చ ఇది.

సామాన్య కర్త- కర్మ-క్రియ:-
ఎలా రాయాలో, ఎక్కడ మొదలు పెట్టాలో, ఆ విషయానికి తగిన భాషను, పరిభాషను ఎలా ఎంచుకోవాలో తెలియని అయోమయస్థితిలోకి నెట్టేస్తుంటాడు కందుకూరి రమేష్ బాబు. అతను నాకు బాగా తెలుసు. తెలియడు. దశాబ్దాల సాన్నిహిత్యం. కానీ నిత్యం కొత్తవాడు. ప్రతిసారీ అతను ఎన్నెన్నో ప్రశ్నలుగా కనిపిస్తాడు. గంటలు గంటలు రమేష్ తో కూర్చున్నాను. మనకు అర్థంకాని మరో ప్రపంచాన్ని మనకర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టే రమేష్ మొదట ప్రశ్నగా కనబడతాడు. అతడితో కొంత ప్రయాణిస్తే అప్పుడు అతడే సమాధానమవుతాడు. ప్రపంచం పట్టనంత మనిషి సామాన్యతను మనముందు ఆవిష్కరిస్తాడు. మనిషి సామాన్య ప్రతిబింబాలను అలలు అలలుగా మనముందు పేర్చి వెళతాడు. ఆ సామాన్య సముద్రం చెంతకు మనల్ను చేయిపట్టి తీసుకెళతాడు. ప్రతి సామాన్యుడి చిత్రాన్ని కెమెరాలో బంధించి, పటం కట్టి ప్రదర్శన పెడతాడు. మనకు తెలిసినదంతా తెలియనిదేనని తేల్చేస్తాడు.

జర్నలిస్టు కందుకూరి రమేష్ బాబు మంచి వచన రచయిత. ప్రింట్, టీ వీ, డిజిటల్, ఫోటో జర్నలిజంలో మునిగితేలినవాడు. ఆంగ్ల సాహిత్యంలో పీ జీ చేసి, చాలా కాలంగా వివిధ పత్రికల్లో వ్యాసాలు, విమర్శలు, విశ్లేషణలు రాస్తున్నవాడు. టీ వీ ఛానెల్స్ లో సామాన్యుడికి పట్టం కట్టినవాడు. స్వతహాగా వైవిధ్యమయిన ఫోటోగ్రాఫర్. వెన్న కంటే మృదువయిన మనసు. అంతకంటే ఇంకా మెత్తని మనిషి . కఠోరమయిన కాలపరీక్షలను మనో బలంతో ఎదుర్కొని నిలబడి మీసం దువ్విన బలవంతుడు. కూతురికి “సెలవు” అని విన్న ప్రతివారు ఎందుకలా నామకరణం చేశారు అని అడిగించుకుంటున్న ఆధునికుడు. మనిషికి ఉండాల్సిన ఇంకా ఎన్నో మంచి లక్షణాలు ఉన్నవాడు.

లక్ష్యాన్ని ప్రేమించాలా ? లక్ష్యాన్ని చేరే దారిని, ప్రయత్నాన్ని, సంకల్పాన్ని అన్నిటినీ ప్రేమించాలా? లేక లక్ష్యాలక్ష్యాల గజిబిజి ఏవీ లేని “జీవించడమే దానికదిగా ఒక అద్భుతమైన కళ” అయిన అసాధనను (ఈ మాటకు అర్థం, ఉదాహరణలు తరువాతి కథనాల్లో ఉంటాయి) ప్రేమించాలా? అని తన దృష్టిని సామాన్యుల వైపు మళ్ళించాడు. ఆ దృష్టి కోణంలో నుండి వచ్చిన పుస్తకం-
“మీరు సామాన్యులు కావడం ఎలా?”.

చిన్న పుస్తకం. కానీ చాలా పెద్ద విషయం.
మనం సచిన్ కావాలనుకుంటాం.
సినిమా హీరోలా ఉండాలనుకుంటాం.
ఇంకా ఎవరెవరిలానో ఉండాలనుకుంటాం.
మనం మనలా ఉండాలని మాత్రం ఎప్పుడూ అనుకోము.
ఉండడానికి ప్రయతించము.
మన జీవితానికి మనమే కథానాయకులం.
మనదే స్క్రిప్ట్.
మనమే దర్శకులం.
మనమే నిర్మాతలం.
మనమే ప్రేక్షకులం.
మనకు మనమే విమర్శకులం.
ఇంకెవరినో అనుకరిస్తే , ఆరాధిస్తే – మహా అయితే మనం విలన్లు కాగలం కానీ…హీరోలం కాలేము.

అసలెందుకు సెలబ్రిటీ కావాలి?
పగలు-రాత్రి;
తిండి-నిద్ర;
ఆనందం-బాధ మనవి మనకే ఉన్నాయి కదా?
అమ్మానాన్న , భార్యాపిల్లలు, ఇల్లూవాకిలి…మన జీవనపోరాటం మనకే ఉంది కదా?
కోట్ల మంది సామాన్యంగా ఆలోచించ బట్టి, సామాన్యంగా ఉండబట్టి – కనీసం ఇప్పటికీ సూర్యుడు ఉదయమే ఉదయిస్తున్నాడు…అది కూడా తూర్పునే .
సామాన్యంగా ఉండడం అంత సామాన్యం కాదు. దానికి అసామాన్యమయిన సంకల్పం కావాలి.

పుస్తకం ఎందుకు రాయాల్సివచ్చిందో చెబుతూ కందుకూరి రమేష్ బాబు సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడు. అందులో నాలుగు మాటలు యథాతథంగా:-

“మీరు సామాన్యులు కావడం ఎలా? అన్న పుస్తకంలో నేను చర్చించిన అంశాలు రెండు, రెండున్నర దశాబ్దాల సన్నిహిత అధ్యయనం నుంచి, వందలాది సాధారణ వ్యక్తుల సామీప్యత నుంచి జనించినవే అని ఎంతో అభిమానంగా చెబుతూ వ్యాసం ప్రారంభిస్తున్నాను. ఆ క్రమంలో పుట్టిందే ‘వ్యక్తి వికాసం కన్నా జీవన వికాసం మిన్న’ అనే భావన. ‘శిఖరాలుగా ఎదగడం కాదు, మైదానాలుగా విస్తరించడం’ అన్న ధోరణి. ఆ అనుభవ సారం నుంచి రాసే ఈ వ్యాసం సైతం మిమ్మల్ని తిరిగి సాధారణం చేయడంలో ఒక చిరు ప్రయత్నం చేస్తుందని ఆశిస్తూ మరి ఆహ్వానం.

మనం లోతుగా ఆలోచించకుండా అలవోకగా ఉపయోగించే పదాల్లో ‘కామన్ మ్యాన్’ ఒకటి. అలాగే ‘సెలబ్రిటీ’ మరొకటి.

నిజానికి ఈ రెండు పదాల్లో ఇమడని తనమే నన్ను సామాన్యశాస్త్రం రచనా వ్యాసంగంలోకి నెట్టింది. పదమూడు పుస్తకాలు రచించేలా, తర్వాత సామాన్యమైన వ్యక్తుల ఛాయాచిత్రాలతో నేటి వరకు పదమూడు ప్రదర్శనలు పెట్టేలా ప్రేరేపించింది.

నిజానికి ‘కామన్ మ్యాన్’ లేడు. అలాగే, సెలెబ్రిటీ గా మీరు భావిస్తున్న వ్యక్తి నిజ అర్థంలో ‘సెలబ్రిటీ’ కూడా కాదు. ‘సెలబ్రేటింగ్ ది ఆర్డినరీ’ లేదా ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న దిశలో ఆ భావాన్ని అర్థం చేసే ప్రయత్నంలో మనం కొంచెం మాట్లాడుకోక తప్పదు”.

ఆ కొంచెం మనమనుకున్నంత కొంచెమైతే కాదు. రమేష్ బాబు కళ్ళతో చూస్తే అది అనంతం.

రేపు:-
సామాన్యశాస్త్రం-2
“అన్ లర్నింగ్”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్