ఇరుకు భవనాల్లో, గాలీ వెలుతురూ లేని గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టే కార్పొరేట్ చదువుల పిల్లలకు, వారి భవిత గురించి చింతించే తల్లిదండ్రులకు నచికేత తపోవన్ సందర్శన చక్కటి ఆటవిడుపు. పిల్లలు, పెద్దలు కూడా రీఛార్జ్ అవుతారు. ఒత్తిడి లేని విద్యా విధానం గురించి తెలుసుకోవచ్చు.
హైద్రాబాద్ నుంచి జడ్చర్ల వెళ్ళేదారిలో బాలానగర్ నుంచి లోపలికి వెళ్తే మట్టి రోడ్డు వస్తుంది. అది దాటి ముందుకెళ్లాక కొడ్గల్ గ్రామం వస్తుంది. అక్కడ కనిపిస్తుంది నచికేత విద్యామందిర్. వెనక బడిన వర్గాల వారికి విద్య అందించి వారిని అభివృద్ధి బాటలో నడిపించాలని వసుంధర మా అక్కడ 40 ఎకరాల బంజరు భూమి కొన్నారు.
మొదటినుంచీ వసుంధర మా అవసరమైన వారికి చేతనైన సాయం చేస్తూనే ఉన్నారు. మరోపక్క స్వామిజీ పేదపిల్లలకు మంచి భవిత ఉండాలని కోరుకున్నారు. కావూరి హిల్స్ లోని నచికేత విద్యామందిర్ ఒక స్థాయికి రాగానే మరో చోటు కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. అనేక స్థలాలు పరిశీలించి చివరికి జడ్చర్ల దగ్గర కొడ్గల్ అనే ప్రాంతంలో స్వామి స్థలం ఎంపిక చేశారు. చుట్టూ తాండాలు. అక్కడే స్కూల్, దేవాలయం, స్టాఫ్ క్వార్టర్స్ , డార్మెటరీ … ఇలా అన్ని సౌకర్యాలతో భవనాలు కట్టారు. అంతా దాతల సహాయంతోనే. ఈ రోజు ఆ బంజరు భూమి చిక్కటి పచ్చదనంతో అడవిని తలపిస్తోంది. అటవీ శాఖ సాయంతో కొన్ని వేల మొక్కలు నాటారు. మొదట్లో ఎవరూ లేకున్నా స్వామిజీ ఒక్కరే పాక వేసుకుని ఉన్నారు. ప్రస్తుతం అక్కడ 380 మంది విద్యార్థులు ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల పిల్లలకు, పేదవారికి, ఒంటరి, పేద మహిళల పిల్లలకు ప్రవేశం. అదికూడా అనేక అంచెల వడపోత తర్వాతే. మూడేళ్ళ పిల్లల కోసం వారానికోరోజు నర్సరీ క్లాసులు ఉంటాయి. 2017 లో ప్రారంభమైన ప్రాంగణంలో విద్యతో పాటు అవసరమైన వైద్య సేవలు అందిస్తారు. చిన్నారుల్లో ఆధ్యాత్మికత, ఆటలు, పాటలు, పర్యావరణ స్పృహ అలవడేలా కృషి చేస్తారు.
ఆ ఆలయం అందరిదీ
కొడ్గల్ విద్యామందిర్ ప్రాంగణంలో స్వామిజీ ఆధ్వర్యంలో మా యోగ శక్తి పీఠం పేరిట చక్కటి ఆలయం నిర్మించారు. శ్రీ రామకృష్ణ పరమహంస స్ఫూర్తితో నిర్మించిన ఈ గుడిలో శంకరుడు, దక్షిణకాళి, సీతారాములు, కైవల్య వెంకటేశ్వర స్వామి, సిద్ధి వినాయకుడు , కృష్ణుడు కొలువై ఉన్నారు. ఇక్కడ పూజారులు ఉండరు. ఎవరైనా రావచ్చు. భక్తితో పూజలు చేసుకోవచ్చు. చుట్టుపక్కల గ్రామాలనుంచి ప్రజలు వచ్చి పూజలు చేసుకుని తృప్తిగా వెళుతుంటారని పర్యవేక్షకులు మూర్తి చెప్పారు. ఈయన రిటైరయ్యాక ఇక్కడికి వచ్చారు. భార్య సుబ్బులక్ష్మి విద్యామందిర్లో ప్రిన్సిపాల్. గుడికి సంబంధించిన వ్యవహారాలు మూర్తి చూసుకుంటారు. ఈ గుడికి వచ్చిన వారికి దివ్యమైన అనుభవాలు కలిగాయని వసుంధర మా చెప్పారు. కాస్త దూరంలో గోశాల ఉంది. అక్కడ గిర్ ఆవులు ఉన్నాయి. వాటి నెయ్యి అమ్మడం ద్వారా కొంత ఆదాయం వస్తుందని మా చెప్పారు. కొన్ని కూరగాయలు కూడా పండిస్తున్నారు. ఇక్కడి టీచర్లు అందరూ పర్మనెంట్ గా నియమితులైనవారే. కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బందులెదురైనా దైవానుగ్రహంతో దాటామన్నారు స్వామిజీ. దూరం కావడం వల్ల వాలంటీర్లు ఎక్కువ రావడం లేదు. నిజానికి వాలంటీర్స్ ఉండటానికీ వసతి ఉంది. ఎవరైనా వచ్చి ఉండచ్చు ఇక్కడ. కాలుష్యం అంటని ప్రకృతిలో గడిపే అవకాశం ఉంది. కదంబ వృక్షం మొదలుకొని ఉసిరి, సీతాఫలం, మామిడి … ఇలా అనేక వృక్షాలు కనువిందు చేస్తూ ఉంటాయి. ఏ మొక్కనూ కత్తిరించరు. పిచ్చుకలు, ఇతర పక్షులు హాయిగా విహరిస్తూ ఉంటాయి. పాములు కూడా అప్పుడప్పుడు పలకరిస్తాయంటారు స్వామిజీ. పిక్నిక్ లా అయినా సరే, చూడదగ్గ ప్రదేశం.
బుడి బుడి అడుగులు
దాతలెవరైనా కొన్ని సందర్భాల్లో పిల్లలకు భోజనానికి విరాళం ఇస్తుంటారు. అప్పుడు ఎల్కేజీ నుంచి పదవ తరగతి వరకు పిల్లలు వరుసల్లో ప్లేట్లతో సహా వచ్చి కూర్చుంటారు. పెద్ద పిల్లలు వడ్డిస్తారు . వడ్డన పూర్తయ్యే లోపు పిల్లలంతా శ్లోకాలు చదువుతారు. అంతమంది పిల్లలు ఒక్కచోట ఉన్నా శబ్దం వినిపించదు. వారికేమన్నా మారు కావాలంటే వేళ్ళతో చెప్పాలి. తినడం పూర్తయ్యాక అందరూ లైన్లో వెళ్లి సబ్బుతో శుభ్రంగా పళ్లెం కడిగి షెల్ఫ్ లో పెడతారు. బయటకి వచ్చి కాసేపు వజ్రాసనంలో కూర్చుని చిన్ముద్ర పాటిస్తారు. చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటుందో! ఇవన్నీ స్వామిజీ పిల్లలకు నేర్పిన పద్ధతులు. వారి దుస్తుల రంగు, డిజైన్ అన్నీ ప్రత్యేకమే. అంతమంది విద్యార్థులున్నా రణగొణ ధ్వనులు లేవు. స్వామిజీ ని చూడగానే ఆత్మబంధువుని చూసినట్టు పరుగెత్తుకు వస్తారు. వసుంధర మా కూ ఇదే కుటుంబం. ఎంతో అదృష్టం ఉంటేనే ఇంత చక్కటి కుటుంబం లభిస్తుందంటారు మా.
అన్ని సౌకర్యాలతో క్లాస్ రూములు ఉన్నాయి. మరో రెండంతస్తుల భవన నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ సైన్స్ ,మాథ్స్ లాబ్స్ నెలకొల్పి పిల్లల్ని పరిశోధన దిశగా ప్రోత్సహించాలని ఆశయం. చదువులు కూడా ఆంగ్లం, తెలుగు భాషల్లో బోధిస్తున్నారు. పిల్లలందరికీ ఇంగ్లిష్ అర్థమవుతుంది. మాతృ భాష బంజారాతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. పాఠాలు కూడా పిల్లలందరికీ అర్థమయ్యేలా కొన్ని పద్ధతులు రూపొందించారు. పిల్లల తల్లిదండ్రుల వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు పిల్లల గురించి వివరిస్తారు. ప్రస్తుతం పదవతరగతి పూర్తిచేసిన వారికి పై చదువులకు దూరం వెళ్లాల్సి వస్తోందని, 12 వ తరగతి వరకు అనుమతి ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు వసుంధర. దాతలు ముందుకొస్తే మరింతగా సేవలు అందించవచ్చని అన్నారామె. ఇక్కడ పిల్లలకోసం అంఫి థియేటర్ కట్టాలనీ ప్రయత్నిస్తున్నారు.
ఒక చిన్న ఆలోచన మహా వృక్షంగా విస్తరించింది. ఇటువంటి మంచి పనులను ప్రోత్సహించే బాధ్యత సమాజానిదే. నచికేత విద్యామందిర్ కృషికి మరింతమంది దాతలు, వాలంటీర్స్ ముందుకురావాలి. ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అని నమ్మిన ఇద్దరు నవ భారత నిర్మాతలు, వారి హితులు నిర్మించిన ఈ ప్రపంచానికి వెళ్తేనే ఆ విలువ తెలుస్తుంది. పరోపకారం పట్ల మక్కువ పెంచుతుంది.
-కె. శోభ