అమెరికా బలగాలు ఆగస్ట్ 31వ తేదీలోగా ఆఫ్ఘన్ విడిచి వెళ్లాల్సిందేనని తాలిబన్లు హుకుం జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడేన్ మొదటగా ప్రకటించిన ప్రకారం ఈ నెలాఖరులోగా యుఎస్ మిలిటరీ ఆఫ్ఘన్ భూభాగం వీడాలని తాలిబాన్ల ప్రతినిధి జాబిహుల్లః ముజాహిద్ ఈ రోజు తెగేసి చెప్పాడు. ఆఫ్ఘన్ నుంచి బలగాల ఉపసంహరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని, ఈ విషయమై పెంటగాన్ ఉన్నత స్థాయి చర్చలు జరుపుతోందని అమెరికా అధ్యక్షడు జో బైడేన్ వెల్లడించారు.
తాలిబన్ల వశమయ్యాక వివిధ రంగాల్లో పేరొందిన ఆఫ్ఘన్లు దేశం విడిచి వెళ్ళేలా అమెరికా ప్రోత్సహిస్తోందని, ఇలాంటి చర్యలు మానుకొని కేవలం అమెరికన్ల తరలింపునకు పరిమితమైతే మంచిదని ముజాహిద్ హితవు పలికాడు. అయితే అమెరికా అధ్యక్షుడు బైడేన్ ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 31 వ తేదీ లోపు అమెరికా బలగాలు ఆఫ్ఘన్ నుంచి పూర్తి స్థాయిలో వచ్చేస్తాయని శ్వేత సౌధం వర్గాలు స్పష్టం చేశాయి. ఉపసంహరణకు మరిన్ని రోజులు గడువు తీసుకోవటం సమస్యలకు దారితీస్తుందని అమెరికా నిఘా సంస్థలు ఇప్పటికే హెచ్చరించినట్టు సమాచారం.
మరోవైపు వాషింగ్టన్ పోస్ట్ లో ఆసక్తికరమైన వార్తా ప్రచురణ అయింది. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (CIA) అధిపతి కాబూల్ లో తాలిబన్ల ఉపనాయకుడు ముల్లా అబ్దుల్ ఘని బరదర్ తో సమావేశమైనట్టు ప్రచురించింది. సమావేశం ఎప్పుడు, ఏ రోజు జరిగింది వెల్లడి కాలేదు. తాలిబన్లు ఆఫ్ఘన్ పెత్తనం చేపట్టాక బైడేన్ పాలనాయంత్రాంగం ఉగ్రవాద సంస్థతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారనే వార్త దుమారం రేపుతోంది. అమెరికా స్వప్ప్రయోజనాలు తప్పితే ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి, సుస్థిరత విషయంలో శ్రద్ద చూపటం లేదనే విమర్శలు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి.