Tuesday, January 7, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతిలకాష్ఠ మహిష బంధనం

తిలకాష్ఠ మహిష బంధనం

(చట్టబద్ధమైన హెచ్చరిక:– ఈ రచనలో కనిపించే పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం. జీవించి ఉన్న లేదా చనిపోయిన నిజమైన వ్యక్తులతో ఏదైనా సారూప్యత ఉంటే అది పూర్తిగా యాదృచ్ఛికం. ఈ రచనలో ఎక్కడా బతికి ఉన్న జంతువులను ప్రస్తావించలేదు మరియు వాటి మనోభావాలను గాయపరచలేదు. ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం)

విమర్శకుడు:-
కవిగారూ! మీరీమధ్య ఆధునికానంతర కవిత్వాన్ని దాటి సంక్లిష్టానంతర కవిత్వం రాస్తున్నారు. ఈ సాహిత్య పరిణామక్రమంలో మీ అనుభవాలను, ఈ రచనా ప్రక్రియలో మీ ప్రయోగాన్ని కొంచెం వివరిస్తారా?

కవి:-
(సిగరెట్టు పొగను సృజనాత్మకంగా రింగులు రింగులుగా గాల్లోకి వదులుతూ…)
ఇది క్రమానుగతం కాదు. కాలాన్ని దాటి నా రచనలు ముందు ఉండడం దానికదిగా జరిగిందేకానీ…నా ప్రయత్నంతో జరిగింది కాదు. అందరూ ఆధునిక వచన కవితలు రాసేప్పుడు నేను ఆధునికానంతర కవిత్వం రాశాను. అందరూ ఆధునికానంతర కవిత్వం రాసేప్పుడు నేను సంక్లిష్ట కవిత్వం రాశాను. అందరూ ఆధునికానంతర సంక్లిష్ట కవిత్వం రాసేప్పుడు నేను పరమోత్కృష్ట సంక్లిష్టానంతర ప్రతీకాత్మక కవిత్వం రాశాను.

వి:-
అంటే వీటిలో పదాలకు ఆ అర్థాలు కాకుండా వేరే అర్థాలుంటాయా?

క:-
(ఐస్ ముక్కలను సుతారంగా మద్యం గ్లాసులోకి వేసుకుంటూ…)
నా కవిత్వంలో ప్రతి పదానికి మొదట్లో వేరే అర్థాలుండేవి. ఇప్పుడు ప్రతి అక్షరానికి వేరే అర్థముంటుంది. కవిత పూర్తయ్యేసరికి నేననుకున్న భావం కాకుండా పూర్తిగా వేరే భావం కూడా వస్తోంది. రెండో సారి చదివితే మొదటిసారి చదివిన అర్థం కాకుండా మరేదో అర్థం వస్తుంది. ఎప్పుడు ఏ అర్థం వస్తుందో నాకే తెలియదు. చదివేవారి స్థితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతోందని నాకు నెమ్మదిగా అర్థమవుతోంది. క్రమంగా అదే నాదైన ప్రత్యేక రచనా శైలి అయ్యింది.

వి:-
అప్పుడది సంక్లిష్టానంతర పరమోత్కృష్ట ప్రమాద సంభవిత కవిత అవుతుంది కదా! సంక్లిష్టతే దానికదిగా పాఠకుడికి ఒక ప్రమాదమైనప్పుడు…మళ్ళీ ఉద్దేశపూర్వక-అనుద్దేశపూర్వక; సంకల్పిత- అసంకల్పిత; ప్రయత్నపూర్వక- అప్రయత్నపూర్వక ప్రమాదం విడిగా ఉండాలంటారా? అది సాహిత్య సునామీగా రూపాంతరం చెందదా? ఏమిటి మీ ధైర్యం?

క:-
(చికెన్ ముక్కలను మునిపంట బొమిక గుచ్చుకోకుండా నములుతూ…)
ఒక రూపంలో కవిత్వం రాయడానికి నేను మొదటినుండీ వ్యతిరేకం. అందుకే లోకం నన్ను రూపంలేని “విరూప కవి” అన్నా…దాన్ని నా నూతన రచనా శైలికి వచ్చిన గుర్తింపుగాను, పొగడ్తగాను స్వీకరించాను తప్ప లోకాన్ని తప్పు పట్టలేదు.

వి:-
అప్పుడు వ్యాకరణం ప్రకారం మీరు “నైరూప్య కవి” కావాలి కానీ “విరూప కవి” ఎలా అవుతారు?

క:-
ఆధునికానంతర సంక్లిష్టానంతర విరూప రచనలో నైరూప్యం అయినా వైరూప్యం అయినా చర్చించాల్సిన విషయం అది కానే కాదు. కాలగతిలో గతితార్కిక భౌతిక నయా వలసవాద రివిజనిస్టు సూత్రాలు వర్గస్పృహతో పరస్పరం సంఘర్షించుకునే సందర్భాల్లో కవి ఎక్కడున్నాడన్నదే ముఖ్యమవుతుంది?

వి:-
మీవరకు మీరెక్కడున్నారు?

క:-
నేనిప్పుడు విభాత సంధ్యల ప్రభాతగీతం పాడుకుంటూ సరిగ్గా రాష్ట్రాల సరిహద్దుగీతల దగ్గర, కోదాడ పక్కన, నాలుగు రోడ్ల కూడలిలో పంజాబీ డాబా నులకమంచం చెక్క మీద కూర్చుని ఉన్నాను.

వి:-
ఎందుకు?

క:-
నా కారు చెడిపోయి…

వి:-
మీ ప్రయాణం కూడా విరూప నైసర్గిక స్వరూపం సంతరించుకుందా?

క:-
జీవిత స్వభావమే విరూపం కదా? ఒక రూపంలోకి దాన్ని కుదించాలనుకుంటాం. దాంతోనే వస్తుంది సంఘర్షణ. ఆ సంఘర్షణను నేను అక్షరీకరిస్తుంటాను. అందువల్ల అందులో కొంత మార్మికత, కొంత ప్రతీక, కొంత అస్పష్టత, కొంత అసందిగ్ధత, కొంత ఏదీ కానిది ఉంటుంది.

వి:-
ఏదీకాని వస్తువుకోసం ఎందుకు మీకీ ఆరాటం? మీరెవరికోసం కవిత్వం రాస్తారు?

క:-
మొదట్లో లోకం కోసం రాసేవాడిని. ఇప్పుడు లోకం చూడలేనిదాన్ని అన్వేషిస్తూ…నాకోసం నేనే…నాలోకి నేనే ప్రయాణిస్తూ…రాసుకుంటున్నాను. 1990 వరకు తెలుగు కవిత్వం నన్ను నడిపింది. అక్కడినుండి నేనే కవిత్వాన్ని నడుపుతున్నాను. ఇప్పుడు తెలుగు కవిత్వాన్ని నా భుజస్కంధాలపైనుండి అందుకోగల భుజబలకవులకోసం అన్వేషిస్తున్నాను.

వి:-
అలాంటప్పుడు లోకానికి మీ కవితలు చదివితీరాల్సిన బాధ్యత ఎందుకుంటుందని అనుకుంటున్నారు?

క:-
చదవమని నేనడగలేదే? పైగా చదవగానే అర్థమయ్యేది కాదు నా కవిత. అందులో అర్ధభాగమైనా అర్థం కావాలంటే దాని మీద ఇంగ్లిష్ లో వచ్చిన సమీక్ష, విమర్శ గ్రంథాలు చదవాలి.

వి:-
తెలుగు కవిత తెలుగువారికి అర్థం కావడానికి ఇంగ్లిష్ విమర్శను దారిదీపంలా పెట్టుకోవాలంటారా?

క:-
“తెలుగునకున్న వ్యాకరణ దీపము చిన్నది” అన్నారు తిరుపతి వెంకటకవులు. నాదీ అదే అభిప్రాయం. తెలుగుకు ఉన్న విమర్శ దీపం ఇంకా చిన్నది అని దాని కొనసాగింపుగా నా అభిప్రాయం. కాబట్టి ఇంగ్లిష్ దారిదీపం పెట్టుకోవడంలో తప్పులేదు.

వి:-
మొన్న మీకు ప్రతిష్ఠాత్మక సాహిత్య అవార్డు కూడా వచ్చింది! ఇప్పుడు మీ మీద ఎలాంటి బాధ్యత ఉందనుకుంటున్నారు?

క:-
అది రూపంలేని, భావం లేని, అర్థం ఉండాల్సిన అవసరంలేని కవితకు దక్కిన అత్యున్నత గౌరవంగా భావిస్తాను. తెలుగు కవితలో నాదొక ప్రయోగ ధోరణి. నేను ప్రయాగలో పార్ట్ టైమ్ జాబ్ చేసేప్పుడు ఈ ప్రయోగ భావనకు లీలగా బీజం పడి ఉంటుందనుకుంటున్నాను. ఆ పార్ట్ టైమ్ జాబ్ పోయాక స్పష్టత సంతరించుకుని కవిత్వ రచన ఫుల్ టైమ్ జాబ్ గా గంగ ఒడ్డున పొంగి ఉంటుందనుకుంటున్నాను. ఇదొక అసంకల్పిత ప్రతీకార చర్య.

వి:-
తెలుగులో తొలిసారి ఏడాదిలో రెండు లక్షల కాపీలు అమ్ముడుబోయిన కవిత్వ పుస్తకం మీది. భారతదేశ సాహిత్య చరిత్రలోనే ఇదొక రికార్డు అంటున్నారు. బహుశా ప్రపంచ సాహిత్య చరిత్రలో కూడా ఇదే తొలి రికార్డు అయి ఉంటుంది. ఇదెలా సాధ్యమయ్యింది?

క:-
ఇదొక హఠాత్పరిణామం. నాకూ అర్థం కావడం లేదు. నేను చెప్పదలుచుకున్నది చెప్పకుండానే, రాయదలుచుకున్నది రాయకుండానే, చిత్తు ప్రతిని సరిచేయకుండానే ముద్రణకు వెళ్ళిపోయింది. బహుశా స్పష్టంగా చెప్పి ఉంటే ఇన్ని కాపీలు అమ్ముడుబోయి ఉండేది కాదని ఇప్పుడు స్పష్టత వచ్చింది! ప్రమాదంలో వచ్చిన ప్రమోదమిది. అన్నిటికీ మించి “యుద్ధాన్ని తిన్న సన్యాసి”; “శాంతిని వాంతి చేసుకున్న కాంతి”; “ఒక నువ్వు- రెండు నేనులు” అన్న నా మూడు కవితలను మొన్న ఐక్యరాజ్యసమితిలో సెక్రెటరీ జనరల్ సిరియా శాంతికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకసమావేశంలో అక్షరమక్షరం చదివి వినిపిస్తే…సభ మొత్తం లేచి నిలుచుని కరతాళధ్వనులతో తమ ఆనందాన్ని ఆమోదాన్ని, అభినందనను తెలియజేశారు.

వి:-
అయితే ఈసారి మీకు సాహిత్యంలో నోబుల్ బహుమతి గ్యారెంటీ అనుకోవచ్చా?

క:-
లోకం అలా అంటోంది. దానితో నాకు నిమిత్తం లేదు.

వి:-
ఆధునిక కవులకు, కవిత్వం రాయాలనుకునే యువకులకు, పాఠకులకు మీరిచ్చే సందేశం?

క:-
నిజానికి నా కవితే నా సందేశం. దాన్ని అర్థం చేసుకునే స్థాయి అందరికీ ఉండదు కాబట్టి విడిగా చెప్పాల్సి వస్తోంది. అందరికీ ఒకటే సందేశం ఇవ్వలేను. ఇవ్వకూడదు కూడా.
1. ఆధునిక కవులు మోడీ దగ్గరే ఆగిపోయారు. చైనా జింగ్ పింగ్, కొరియా కిమ్, రష్యా పుతిన్, కెనడా ట్రూడో దాకా వెళ్ళాలి.
2. కవిత్వం రాయాలనుకునే యువకులు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టూల్స్ ను బాగా అర్థం చేసుకోవాలి.
3. పాఠకులు ఇంకా ఎదగాలి. కవి సందర్భాలను, కవి సమయాలను, కవి హృదయ స్పందనను, కవి రక్తపోటును, కవి థైరాయిడ్ ను, కవి కంటి చూపును అర్థం చేసుకోవడానికి హృదయ వైశాల్యం బాగా పెంచుకోవాలి.

వి:-
కవిగారూ! మీరు సాధారణ పరీక్షల కోసం మొదట దగ్గర్లోని డయాగ్నస్టిక్ సెంటరుకు, ఆ పరీక్షల ఫలితాలతో తరువాత అటు నుండి అటే పెద్దాసుపత్రికి వెళ్లాల్సిన అత్యవసర సమయమిది. సందర్భమిది. విషయం సాహిత్య భాష ట్రాక్ దిగి…శరీర భాష, రోగభాష ట్రాక్ లోకి ఎప్పుడో వెళ్ళింది. ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. ఇంటర్వ్యూ ఇక్కడితో ఆపేద్దాం.

(ఎండిన నువ్వుల కట్టెను పట్టుబట్టలో చుట్టి…దానికి “తిలకాష్ఠ మహిష బంధనం” అని సంస్కృతంలో గంభీరమైన పేరు పెట్టాడు తెనాలి రామలింగడు. (తిల- నువ్వులు; కాష్ఠ- కట్టెలు; మహిషబంధనం- పశువులను కట్టే తాడుతో కట్టినది) దాన్నొక గ్రంథంగా చూపుతూ…సవాలు చేసిన ఒకానొక పండితుడిని భయపెట్టాడు. ఆ మహాగ్రంథం ఏమిటని అడిగాడు ఆ పండితుడు. “తిలకాష్ఠ మహిష బంధనం” అనగానే ఈ గ్రంథం నేనెప్పుడూ చదవలేదు; కనీసం పేరు కూడా వినలేదని వణుకుతూ…పలాయనం చిత్తగించాడు అంతటి పండితోత్తముడు. వంద స్తంభాల భువనవిజయ భవనంలో సాహితీసమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు, వికటకవి తెనాలి రామలింగడు పడీపడీ నవ్వుకున్నారు. ఇప్పుడు మనల్ను రక్షించే ప్రభువులేరీ? వికటకవులేరీ? లేరే? రారే?)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్