Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసంక్రాంతి స్పెషల్ మూడు వేల కోట్ల జూదం

సంక్రాంతి స్పెషల్ మూడు వేల కోట్ల జూదం

సంక్రాంతికి నెమ్మదిగా అర్థం మారి…కోళ్ళ పందేలకు మాత్రమే ఎలా పరిమితమవుతోందో మిత్రుడు విన్నకోట రవికుమార్ చాలా లోతుగా విశ్లేషించారు. ఆయన పాయింట్లు ముందుగా అనుకుని తరువాత చర్చలోకి వెళదాం.

  • ముప్పయ్యేళ్ళుగా కృష్ణా, గోదావరి జిల్లాలు సంక్రాంతికి అర్థాన్ని మార్చాయి. నెమ్మదిగా అదిప్పుడు రెండు రాష్ట్రాలకు అలవాటయ్యింది.
  • సంక్రాంతికి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం; ఉత్తరాయణ పుణ్యకాలం ఇదంతా ఇప్పుడెవరికీ పట్టని విషయం.

  • కోళ్ళ పందేలకు ఏర్పాట్లు, శిక్షణ, పందేలకు భారీ గుడారాలు; సెట్టింగులు; రెండు రాష్ట్రాల ప్రజలు పొలోమని వెళ్ళడం; బెట్టింగులు; గెలిచిన వారికి థార్ జీపుల బహుమానాలు; విందు; మందు; ముక్క; వినోదాలు పండగపూట లోకం తెలుసుకోదగ్గ పవిత్రమైన విషయాలు.
  • ఈసారి (2025) సంక్రాంతి కోళ్ళ పందేలమీద బెట్టింగుల విలువ అక్షరాల మూడు వేల కోట్ల రూపాయలు. ప్రయాణాలు, ఇతర చిల్లర ఖర్చులు కలుపుకుంటే ఇది ఎన్ని వేలకోట్లకు తేలుతుందో గెలిచి ఓడి కడుపులో జీర్ణమైన కోడికి తప్ప నరమానవుడికి తెలియదు.
  • ఈ ఖర్చుతో సమాజానికి ఉపయోగపడే ఎన్ని ఆసుపత్రులు కట్టచ్చు? ఎన్ని బళ్ళకు భవనాలు కట్టచ్చు? ఎందరిని చదించవచ్చు? ఇలా ఎన్ని లెక్కలైనా వేసుకోవచ్చు.

ఇంకా ఎన్నో సహేతుకమైన అంశాలను ఆయన ప్రస్తావించారు.

సంక్రాంతి ఆచారంలోకి కోళ్ళ పందేలు ఎప్పటినుండి వచ్చాయో? ఏ పురాణంలో ఏ శాస్త్రంలో ఉందో? పెరుమాళ్లకే ఎరుక. ఇప్పుడు కోళ్ళ పందేలను వ్యతిరేకిస్తే సనాతన ధర్మ ద్రోహులయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది.

తాగుడు, జూదానికి పవిత్రతను ఆపాదించడంలో మనకు మనమే సాటి. ఒకప్పుడు వేట వినోదం. ఇప్పుడు వేటాడితే జైల్లో పెడతారు. ఒక కోడికి కత్తి కట్టి…ఉసిగొలిపి…మరో కోడి మెడను కోసేలా చేసి…వాటిమీద పందేలు కాసే మనది త్రిబులెక్స్ సంస్కారయుత నాగరికత అయ్యింది. పాతరాతి యుగపు గుహలు దాటి…రోదసీలోకి ప్రయాణిస్తున్నా ఇంకా కోళ్ళుగా, గొర్రెలుగా మారడంలో మనకేదో తెలియని తృప్తి ఉంది. బహుశా మన మూలాలను మరచిపోకుండా పొదివి పట్టుకుంటున్నామేమో!

“బలి కావాలి అంటూ అడిగే దేవతలైనా
పులినో కాలనాగునో తింటారా ఏమైనా!
ఎపుడూ సాధు జీవులే ఎర అవుతారు నాయనా!
బతికే చేవ పోయెనా…కాయడు దేవుడైనా…
బలమే గుణము…అడగకెపుడూ ఎవరినైనా సాయము…న్యాయము…”

అన్న సిరివెన్నెల హితబోధ సంక్రాంతి కోళ్ళకు వినపడుతుందా?
సంక్రాంతులకు వాటికి కత్తులు కట్టే మన చెవిన పడుతుందా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్