Sunday, February 23, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకుంభమేళా ఖర్చు రూ. 2లక్షల కోట్ల పైమాటే

కుంభమేళా ఖర్చు రూ. 2లక్షల కోట్ల పైమాటే

కుంభమేళా ఎప్పటినుండో జరుగుతూ ఉండచ్చుగాక. కానీ ఈసారి కుంభమేళా ఎంత పెద్దదో దానికే తెలియడం లేదు. ఆధ్యాత్మిక విషయాలను కాసేపు పక్కన పెడదాం. కేవలం హోర్డింగ్స్, ఎల్ ఈ డి స్క్రీన్లు, టీ వీ , రేడియో, పత్రికలు, డిజిటల్ ప్రకటన సంస్థలకు వ్యాపార అవకాశాల అంచనా యాభై వేల కోట్లకు పైమాటే. మొత్తం 45రోజుల్లో దాదాపు 45 కోట్లమంది వస్తారని అంచనా. ఒక్కో మనిషికి హీనపక్షం అయిదువేల రూపాయల ఖర్చవుతుందనుకున్నా ఇదో రెండు లక్షల కోట్ల అంచనా. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన, పెడుతున్న ఖర్చు కూడా వేల కోట్లలోనే ఉంది.

భూగోళం మీదే అతిపెద్ద ఆధ్యాత్మిక జనజాతరగా కుంభమేళా ప్రత్యేకతలు లెక్కలేనన్ని. మన చర్చ ఆధ్యాత్మిక విషయాలగురించి కాదు కాబట్టి వసతులు ఇతర విషయాల్లో ఈసారి వచ్చిన మార్పులేమిటో చూద్దాం.

లక్షల, కోట్ల మంది పోగయ్యే చోట తమ వస్తువుల ప్రకటనలు ఉండాలని కార్పొరేట్ కంపెనీలు కోరుకోవడం సహజం. కాకపోతే ఇదివరకు ఆధ్యాత్మిక కార్యక్రమాల దగ్గర వాణిజ్య ప్రకటనల హోరు ఉండేది కాదు. క్రమంగా పెరుగుతోంది. కుంభమేళా దగ్గర అది హిమాలయాలను తాకింది.

ఉచితంగా దొరికే తాత్కాలిక డేరాల మొదలు రోజుకు 50 వేల రూపాయలకు దొరికే అత్యాధునిక సకల సదుపాయాల తాత్కాలిక గుడారాల దాకా అన్నీ అందుబాటులో ఉన్నాయి. పిండి కొద్దీ రొట్టె- భక్తి కొద్దీ దైవం- ఖర్చు కొద్దీ స్నానం అనుకోవాలి.

తాత్కాలిక స్తంభాలమీద హోర్డింగ్స్; రోడ్ల మధ్యలో లాలీ పాప్స్; పక్కన బిల్ బోర్డ్స్; పబ్లిక్ సౌండ్ సిస్టమ్ లో ప్రకటనలు; ఎల్ ఈ డి తెరలమీద ప్రకటనలు; సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇవన్నీ తెలిసినవే.

పడవల చుట్టూ; మంచి నీళ్ళ బాటిళ్ళమీద; గుడారాల టార్పాలిన్ బట్ట మీద; విచారణ కౌంటర్ల దగ్గర; బాత్ రూమ్ గోడలమీద; పోలీస్ పోస్టుల చుట్టూ…ఇలా అది ఇది అని లేదు. కుంభమేళాలో ప్రకటనలు కనపడని చోటు లేదు. స్థానిక ఉత్పత్తులు మొదలు కోకోకోలా లాంటి బహుళజాతి కంపెనీల దాకా అన్ని ఉత్పత్తుల ప్రకటనలు కనిపిస్తున్నాయి.

ఎక్కడెక్కడ ప్రకటనలకు ఎంతెంత ధరో నిర్ణయించి గంపగుత్తగా వివిధ ఏజెన్సీలకు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు ప్రభుత్వమే అమ్మినట్లుంది. దానిమీద లాభం కలుపుకుని ఆయా సంస్థలు కంపెనీలకు స్పేస్ ఇచ్చినట్లున్నాయి.

ప్రధానమైన కూడళ్ళలో ఒక పెద్ద ప్రకటన హోర్డింగ్ పెట్టుకోవడానికి 45 రోజులకు కోటి రూపాయలు వసూలు చేసేవి కూడా ఉన్నాయి. కంపెనీలు కూడా తెలివిగా స్నానాల దగ్గర సోపులు, షాంపూలు; టీ కాఫీల దగ్గర టీ కాఫీ పొడుల ప్రకటనలను పెట్టాయి.

కొస మెరుపు:-
ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా తెలుగువారి ప్రమేయం ఉండే రోజులివి. సినిమా కార్యక్రమాలను నిర్వహించే హైదరాబాద్ ఈవెంట్ మేనేజ్మెంట్ మీడియా సంస్థ కుంభమేళా ప్రకటన హక్కులను గంపగుత్తగా దక్కించుకున్నట్లు వార్త.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్