Friday, January 24, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆ (ఆర్)జీవి మారాడా!

ఆ (ఆర్)జీవి మారాడా!

ప్రతి మనిషిలోనూ మార్పు అవసరం. కాలానుగుణంగా ఊసరవెల్లిలా రంగులు మార్చడం కాదుకాని, మంచి ప్రవర్తనలో మార్పు వచ్చి మళ్లీ మారాలనే తపన వారిలో రావడం జరిగితే స్వాగతించాల్సిందే. నన్ను మించిన తోపులేడు.. నేనే పెద్ద తోపుగాణ్ణి అనే మూర్ఘత్వ భావన అతని లోంచీ తీసేస్తానంటే… అందరికీ తన మంచి భావన పంచుతానంటే.. ఇంకేం కావాలి గుడ్ మూవ్ అంటూ కొంచెం ఇంగ్లీష్ లోనూ వెల్కమ్ చెప్పాల్సిందే.

అవును ఇదంతా నేనెందుకు చెబుతున్నాను. కొద్దిగా వేదాంతం తలకెక్కిందా అనుకునేరు. ఇదంతా చెబుతున్నది.. స్వీయమార్పు కోరుకుంటున్న..కోరుకున్న ఒక జీవి గురించే ఇదంతా.. మనందరికీ తెలిసిన ఆ జీవే ఆర్జీవీ.. అదేనండి మనందరం ప్రముఖ దర్శకుడిగా గుర్తించి,ఆ తరువాత ఎవడ్రా వీడు! అనుకునేంత వరకూ వెళ్ళిన మన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. పేరుకు తగిన రీతిలో గుణగణాలు అందిపుచ్చుకున్న ఇతడు మొదట్లో రాముడే ఆ తరువాత కృష్ణునిలా ఒక కోణంలో ఆలోచన చేశారు. కృష్ణుడిలా మారాడంటూ ఆ పరమాత్మను అవమానపరచలేం కదా!

అసలు విషయానికి వస్తే… మన ఆర్జీవీ చెంపలేసుకున్నాడు. తనకెక్కిన అహంకార కిక్కును ఇన్నాళ్లకు గుర్తించానన్నాడు. తనకు తాను తెలుసుకోవడమే కాదు అందరికీ చెబుతున్నా నేను మారానని అంటూ ట్వీట్ చేసి తన సహజ స్టైల్ లో హీట్ పుట్టించాడు. నేను మారతా… లేకుంటే చెప్పుతో కొట్టండని తన అభిమానులకు భరోసా కూడా ఇచ్చాడు. ఎప్పుడో ఇరవై ఏడేళ్ళ క్రితం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గ్రేటెస్ట్ హిట్ మూవీ ‘సత్య’ ఈనెల17 న రీరిలీజ్ చేశారు. రీరిలీజ్ సందర్భంగా తన సినిమాను మరోమారు చూసిన మన ఆర్జీవీ జ్ఞానోదయం పొందానని సెలవిచ్చారు. ఆనాడు గౌతముడు భోధి వృక్షం కింద కూర్చుని జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడు అయినట్లు, నేడు తానే తీసిన సత్య మరోమారు చూసిన మన ఆర్జీవీ తనలో తాను సత్యాన్వేషణ చేసుకోవడం మొదలెట్టారు. ఇంతటి గొప్ప డైరెక్షన్ నేనే చేశానా అనుకుంటూ తనలోతాను ఆత్మపరిశీలన చేసుకున్నానని చెప్పుకొచ్చారు.“కాలంలో వెనక్కి వెళ్లి ఓ విషయం మాత్రం అనుకోవాలని వుంది. ఏ సినిమా తీసేముందు అయినా సత్య సినిమా మళ్లీ చూడాలని,ఒకవేళ నేను ఆ రూల్ ఫాలో అయివుంటే ..అప్పటి నుంచి నేను తీసిన సినిమాల్లో 90 శాతం తీయకపోయేవాడిని” అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. “మిగిలిన నా కొద్దిపాటి జీవితంలో నిజాయితీగా వుంటూ సత్యలాంటి సినిమా ను మళ్లీ తీయాలని అనుకుంటున్నాను సత్య మీద ఒట్టేసి ఈ మాట చెబుతున్నాను” అంటూ సత్య కన్ఫెషన్ పేరుతో ఆర్జీవీ ఓ సుదీర్ఘ పోస్ట్ చేశాడు. తాను ఆల్కహాల్ వల్ల తాగుబోతును కాలేదు. సక్సెస్, అహంకారం తో అలా అయ్యానంటూ ఎవరూ ఊహించని రీతిలో కొత్త ఆర్జీవీ దర్శనమిచ్చారు.

సాంకేతికంగా పరిణితి చెందిన, మాఫియా, హార్రర్ చిత్రాలను తీయడంలో ఆర్జీవీ సిద్ధహస్తుడు. శివ , క్షణ క్షణం , రంగీలా , సత్య , కంపెనీ , భూత్ వంటి గొప్ప చిత్రాలు తెలుగు, హిందీ లలో తీసిన ఆర్జీవీకి మూడుసార్లు నంది అవార్డు , సత్య’ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ ఉత్తమ దర్శకుడి అవార్డులు కూడా లభించాయి.అయితే ఆ జీవే ,అసాధారణ చిత్రాలే కాదు అసభ్య చిత్రాలు కూడా చూపించగలనంటూ కాంట్రవర్శీకి కేరాఫ్ అడ్రస్ గా కూడా మారిపోయాడు. అంతా నాయిష్టం, ఎవరైతే నాకేంటి, నేనే సుప్రీం అన్న రీతిలో మారిపోయి నేను తీసిన సినిమాలు చూస్తే చూడండి.. లేకుంటే లేదు అంటూ ప్రేక్షకులకే సవాల్ విసిరిన ఆర్జీవీ ఇప్పుడు మారానంటున్నారు.

రాత్రి చెప్పిన మాట ఉదయమే మార్చేస్తాడు, ఆ మాట నమ్మితే నట్టేట మునిగినట్లే అన్నది ఇండ్రస్ట్రీ పరంగా నేడు ఆర్జీవీ పైన అందరిలో వున్న అభిప్రాయం. అయితే అదంతా అప్పుడు ఇప్పటినుంచి మారిపోయా మీ మీద కాదు నా మీదే ఒట్టు అంటున్న ఆ జీవి ఆర్జీవీ ని నమ్మొచ్చా…. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మారకపోతే ఆయనకే నష్టం… జస్ట్ ఛేంజ్ అంటున్న ఈ జీవి మారారనే మనందరం అనుకుందా… ఆర్జీవీ న్యూ మార్క్ సినిమా లు వస్తాయని తలుద్దాం.. ఏదైనా ఆర్జీవీ ఓ స్పెషలే మరి ఒప్పుకుందామా!

-వెలది కృష్ణకుమార్

RELATED ARTICLES

Most Popular

న్యూస్