(ప్రేమను నిర్వచించే మాటలుంటే ఆ మాటలకు పూర్తిగా ప్రేమగురించి తెలిసి ఉంటుందా? అయినా ప్రేమను నిర్వచించకుండా లోకం ఊరుకుంటుందా? అలా మాటలకు అందీ అందని ప్రేమను తన మాటల్లో కవితాత్మకంగా బంధించారు కిలపర్తి త్రినాథ్. ఆయన ఒకప్పుడు వైమానికదళంలో సైనికుడు. ప్రస్తుతం విశాఖలో బ్యాంక్ ఉద్యోగి. రచన ప్రవృత్తి)
ప్రేమ.
ఎంత చిన్న పదం!
ఎంత పెద్ద భావం!
ఎంత మంది ఎన్ని యుగాల నుండి ఆ జాజిపూల వానలో తడిసి ముద్దయిపోయుంటారు?
ఎంత మంది ఆ రంగు కలల్లో మెరిసి ముగ్గయిపోయుంటారు?
ఎంత మంది ప్రేమను పొందక బతుకు పొరల్లో బుగ్గయిపోయుంటారు?
అంతా ప్రేమే. ఈ సృష్టికి మూలం ప్రేమే. మనిషికి అందం ప్రేమే. ఎన్నిరకాల ప్రేమలో ఈ లోకంలో!
Youtube : https://www.youtube.com/@dhatritvtelugu
Facebook : https://www.facebook.com/dhatritelugutv
Instagram: https://www.instagram.com/dhatritelugutv/
Twitter :https://x.com/Dhatri_Tv
తొలి పొద్దు సూరీడు మెల్లగా లోకాన్ని నిద్ర లేపడం ప్రేమ.
తొలకరిన చిరుజల్లు చిరునవ్వు నవ్వడం ప్రేమ.
హేమంత కాలాన చేమంతి వెన్నెలలు ప్రేమ.
సంక్రాంతి సమయాన నునువెచ్చటి నవ్వులు ప్రేమ.
అసలు ఈ పదానికి అర్థం చెప్పటానికి ఎంత మంది కవులు ఎన్ని రకాలుగా ప్రయత్నించి ఉంటారు!
ఎన్ని భాషల్లో ఎన్ని భావాల్లో వర్ణించి ఉంటారు!
అయినా అది అసంపూర్ణమై, ఇంకా ఎంతైనా ఎలా అయినా చెప్పగలిగేంత గొప్పతనం ఉన్న ఓ బ్రహ్మ పదార్థం ప్రేమ.
అంతవరకూ ఎవరో తెలియని మనిషి ఇకపై మనదనుకుంటూ ఇష్టం పెంచుకోవడం ప్రేమ.
గుండెలపై వేలాడే ఓ పసుపు కొమ్ము ప్రేమ.
పదినెలల తరువాత ఓ వెచ్చని తొలి కేక ప్రేమ.
పొత్తిలిలో ఓ మెత్తని స్పర్శ ప్రేమ.
అక్క చేయి అపురూపంగా పట్టుకొని వేసే అడుగులు ప్రేమ.
తమ్ముడి తప్పులను తిడుతూ దిద్దడం ప్రేమ.
అలిసి వచ్చిన నాన్నకు అందించిన చల్లటి మంచినీటి గ్లాసు ప్రేమ.
సరదా సమయంలో స్నేహితుడి చిరునవ్వు ప్రేమ.
కష్టకాలంలో ఇష్టంగా భుజాన వేసిన చేయి ప్రేమ.
ఓ అసహాయ కొమ్మకు ఆసరా ఇచ్చిన సాయం ప్రేమ.
మలివయసులో బతుకు జ్ఞాపకాల దొంతర ప్రేమ.
ఈ జగమంతా ప్రేమే.
కాకపోతే కాస్త స్పందించే హృదయం ఉండాలి. అందుకే
ఓ బాలసుబ్రహ్మణ్యం గళం ప్రేమ.
ఓ వేటూరి కలం ప్రేమ.
ఓ ఇళయరాజా స్వరం ప్రేమ.
ఓ బాపు కుంచె దిద్దిన రంగుల చిత్రం ప్రేమ.
కలిసున్నా లేకపోయినా
చిరుగాలిలాంటి చిరునవ్వునూ…
తెరచాపలాంటి పరువాన్నీ…
ఈ జన్మకే కాదు, వచ్చే జన్మకూ కలిసే కోరుకున్న ఇద్దరి మూగమనసుల నావ-
గోదారి గుండె సుడిగుండంలో మునగడం ప్రేమ.
తన నుదుటి పసుపు, కలల కుంకుమ మాయమైపోయినా అప్పదాసు తనకంటే ముందే పోవాలి…లేదంటే తను ఈ లోకంలో హాయిగా బతకలేడని బుచ్చమ్మ అనుకోవడం ప్రేమ.
పున్నమినాటికి స్వర్గపు ద్వారాలు మూసుకుపోనీ…ఇంద్రుడి ఇంట అన్ని సుఖాలూ దూరమైపోనీ…ఈ జగదేక వీరుడి చెంత ఏ చింతా లేదు అనుకుంటూ మహిమాంగుళీయకాన్ని సంద్రంలోకి ఇంద్రజ విసిరేయడం ప్రేమ.
వయసుతో సంబంధం లేకుండా ఇష్టమైన వారిని ప్రేమగా టుమ్రీ! బుడ్డీ! కన్నా! అని పిలుచుకోవడం ప్రేమ.
ఎక్కడో ఏ యుద్ధంలోనో చనిపోయిన ఓ చిన్నారి మరణానికై రాలిన మన కన్నీటి బొట్టు ప్రేమ.
ఇష్టమైన వారు కాస్త దూరమైతే ఎంత తీయని ఇళయరాజా పాటయినా ఆనందం ఇవ్వకపోవడం ప్రేమ.
Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv
– కిలపర్తి త్రినాథ్, 9440886844