Wednesday, February 5, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబ్రెజిల్ లో ఒంగోలు వైభవం

బ్రెజిల్ లో ఒంగోలు వైభవం

శివుడు ఎంత పాతవాడో చెప్పలేక అన్నీ తెలిసిన వేదాలే చేతులెత్తేశాయి. అలాగే ఆయన వాహనమయిన బసవడు ఎంత పాతవాడో చెప్పడం కూడా చాలా కష్టం. ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో ఆవు/ఎద్దు ధర్మదేవతకు ప్రతిరూపం. ధర్మం నాలుగుకాళ్లతో సవ్యంగా నడవడం అన్నమాట ఇందులోనుండే పుట్టింది. కొత్త ఇల్లు కట్టుకుని ఒక శుభ ముహూర్తాన తెల్లవారకముందే మనం ఇంట్లోకి శాస్త్రోక్తంగా అడుగుపెట్టడానికంటే ముందు ఆవు అడుగు పెట్టాలి. ఆవుతోక పట్టుకుని వెనుక మనం వెళ్లాలి. ఆవు లోపలికి వెళ్లిన మరుక్షణం అక్కడ ఏవైనా దుష్టశక్తులు, దృష్టి దోషాలు ఉంటే మటుమాయమవుతాయని ఈ ఆచారం చెబుతుంది. ఆవు పంచకం, నవధాన్యాలు ఇల్లంతా చల్లితే ఈ ఆచారం ప్రకారం ఆ ఇల్లు మనం ఉండడానికి యోగ్యమవుతోంది.

పురాణాల ప్రకారం దేవుళ్ల వాహనాలకు కూడా దైవత్వం ఉంటుంది.

శివుడు- బసవడు
విష్ణువు- గరుత్మంతుడు
గణపతి- ఎలుక
సుబ్రహ్మణ్యుడు- నెమలి
అమ్మవారు- పులి/సింహం

ఇలా ఒక్కో దేవుడు/దేవతకు ఒక్కో వాహనం మనకు తెలిసిందే. ఇప్పుడంటే మనకు బెంజులు, బెంట్లీలు, రోల్స్ రాయిస్ లు వచ్చాయి కానీ- అనాది కాలంలో పరమేశ్వరుడయినా కాస్త అక్కడిదాకా డ్రాప్ ఇవ్వు అని ఎద్దునో, గద్దనో అడగాల్సిందే. ఆ రోజుల్లో పశువులు కూడా మాట్లాడేవి. దాంతో పరమేశ్వరుడు బిజీగా ఉంటే ఆయన వాహనం నందితో మాట్లాడినా పని అయిపోయేది. పదితలల రావణాసురుడిని నంది అడ్డుకుంటేనే కదా నానా గొడవ జరిగింది!

వ్యాసాలన్నిటికి ఆవు వ్యాసమే మూలం. లేదా సకల వ్యాసాలు చివరికి ఆవునే చేరుకోవాలి. ఆవుపాలు, ఆవు నెయ్యి శ్రేష్ఠం. లేపాక్షి నంది ప్రపంచ ప్రసిద్ధం.

“లేపాక్షి బసవయ్య లేచిరావయ్య ;
కైలాస శిఖరిలా కదలిరావయ్య ;
హుంకరించిన దెసలు ఊగిపోయేను;
ఖురముతో దువ్వితే కులగిరులె వణికేను ;
ఆకాశగంగకై
అర్రెత్తిచూస్తేను…
పొంగేటి పాల్కడలి గంగడోలాడేను ;
నందిపర్వతజాత
నవపినాకినీ జలము ;
నీ స్నాన సంస్పర్శ నిలువునా పులకించె ;
ఒంగోలు భూమిలో పెనుకొండ సీమలో ;
నీ వంశమీనాడు నిలిచింది గర్వాన”
-అడవి బాపిరాజు

హరప్పా మొహంజదారో అతిపురాతన మానవనాగరికత చిహ్నాల్లో దొరికినవాటిలో పెద్ద కొమ్ములతో ఉన్న ఎద్దు ప్రధానమయినది. గొడ్డును కొట్టినట్లు మనం కొడుతున్నా ఎద్దు భరిస్తూనే ఉంది. గొడ్డు చాకిరి చేస్తూనే ఉంది. పొలాలన్నీ హలాలతో దున్నుతూనే ఉంది. ఫలసాయాన్ని వీపున మోసి ఇంటికి తెస్తూనే ఉంది. మెడమీద కాడిని కట్టుకుని యుగాలుగా మన నాగరికతను లాగుతూనే ఉంది.

“గొడ్డొచ్చిన వేళ…బిడ్డొచ్చిన వేళ…” అన్నారు. పాడి పంటలతో, ధన ధాన్యాలతో పల్లెలు ఒకప్పుడు కళకళలాడేవి. ఇప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడ్డ సాధారణ రైతులకు ఎడ్లు, ఎడ్ల బండి తప్పనిసరి. యుగయుగాలుగా భూగోళాన్ని దున్ని మనకు ఆహారాన్ని పండించిన, పండిస్తున్న ఎడ్ల చరిత్ర రాస్తే అంతులేని బసవపురాణమవుతుంది. ఎడ్లతో రైతు బంధం మాటలకందేది కాదు.

“ఇల్లు కట్టుకొనె ఇటుకకు రాయితో, సెలకల చల్లే ఎరువుకుళ్లుతో
ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది
టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో నా డొంక దారిని
మా ఎద్దు బండి గిల్లెగిరిపడ్డదమ్మో నా పల్లెల్లోన…”

అని ఆధునికతతో పల్లెల్లో జరిగిన విధ్వంసం గురించి గోరటి వెంకన్న “పల్లె కన్నీరు పెడుతోందో!” పాటలో ట్రాక్టర్ల దెబ్బకు ఎడ్లు, ఎడ్లబండ్లు ఎగిరి పడి ఎక్కెక్కి ఏడుస్తున్న దృశ్యాలను పదచిత్రంగా పటం కట్టి ఇచ్చాడు.

మన దగ్గరేమో ఎడ్లు- ఎడ్లబండ్లు; ఆవులు- ఆవుదూడలు నగరాల శిల్పాలరామాలకు చేరి ప్రదర్శనలో చూడదగ్గవి అయ్యాయి. సంక్రాంతి కోడిపందేల జూదాలకు వెళ్ళినప్పుడు కంట్లో పడేవి అయ్యాయి. అంతర్జాతీయ యవనికమీదేమో మన ఒంగోలు ఎడ్లకు; ఆవులకు సాటిరాగలవి లేనేలేవు. ఒంగోలు బ్రీడ్ ను రెండింతలు, మూడింతల సైజు పెంచుతూ అభివృద్ధి చేసిన జాతికి చెందినవి. జన్యుపరంగా ఒంగోలు జాతివే కాబట్టి అంతర్జాతీయంగా ఆ పేరుతోనే వెలుగుతున్నాయి. (దీనికే నెల్లూరు ఆవు అని కూడా పేరు. నెల్లూరు నుండి బ్రెజిల్ కు ఎగుమతి అయి వెళ్ళినవి కావడంతో ఆ పేరు కూడా ఉండడంతో మీడియాలో కొందరు నెల్లూరు ఆవు అన్నారు, కొందరు ఒంగోలు ఆవు అన్నారు)

ఈ ఒంగోలు ఆవులు 1800 ప్రాంతాల్లో బ్రెజిల్ కు ఎగుమతి అయ్యాయి. వెయ్యి కేజీలకు పైబడి బరువుతో, బలమైన కండరాలతో, ఏనుగంత ఎత్తుగా కనిపించే ఈ ఆవులకు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండు ఉండడంతో వీటి అండాలను అమ్ముకుని కూడా కోట్లకు కోట్లు సంపాదించే వ్యాపారమార్గాలున్నాయి. తాజాగా బ్రెజిల్లో ఈ జాతి ఒక అవు అమ్మకం కోసం అంతర్జాతీయస్థాయి వేలంపాట పెట్టారు. మన కరెన్సీలో 41 కోట్ల రికార్డు ధరకు అమ్ముడుబోయి…గిన్నిస్ బుక్ లో చోటు కూడా సంపాదించింది. జపాన్ కు చెందిన వాగ్యు జాతి ఆవు; భారత్ కు చెందిన బ్రాహ్మణ్ జాతి ఆవు గతంలో ప్రపంచంలో ఎక్కువ ధర పలికిన రికార్డు ఉండేది. ఒంగోలు ఆవు గత రికార్డులను చెరిపేసి కొత్త రికార్డును లిఖించుకుంది. సంతోషం.

అడవిబాపిరాజు 1935లో అన్నమాట. ఒంగోలు భూమిలో, పెనుగొండ సీమలో ఆ వంశమీనాడు ఎలా ఉన్నా…సప్తసముద్రాలు దాటి…ఖండాలు దాటి…బ్రెజిల్ నేలలో-

“కైలాస శిఖరిలా కదలివెళుతోంది;
హుంకరిస్తే- దిశలు ఊగిపోతున్నాయి;
ఖురముతో దువ్వితే- కులగిరులు వణుకుతున్నాయి;
ఆకాశగంగకై
అర్రెత్తి చూస్తే-
పొంగేటి పాల్కడలి గంగడోలాడుతోంది;
ఆ వంశమీనాడు నిలిచింది గర్వాన బ్రెజిల్లోన”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్