Saturday, February 8, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంప్రొద్దుటూరులో కుక్కలు చింపిన రాతిరి

ప్రొద్దుటూరులో కుక్కలు చింపిన రాతిరి

ఏనుగులకు కలలో సింహం కనిపించినా అంతే సంగతులు. కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటే…ఆ కలలో సింహం వస్తే…ఎందుకొచ్చిన గొడవ అనుకుని యుగయుగాలుగా కొండంత ఏనుగు రెప్పవేయడం మానేసి…బతికి ఉండి బలుసాకు తిని రోజులు వెళ్లదీస్తోంది. ఈ భయం సింహస్వప్నంగా లోకంలో అందరికీ తెలిసిందే.

సింహ స్వప్నం ఉన్నప్పుడు శునక స్వప్నం ఎందుకు ఉండకూడదనుకున్నాయేమో మొన్న ఒక రాత్రి కడప జిల్లా ప్రొద్దుటూరులో నాకు శునకాలు ఈ భయం కలిగించాయి. మా తమ్ముడు మా సుఖ నిద్రకోసం చేయని ఏర్పాటు లేదు. తీరా పడుకున్నాక ఎక్కడినుండి వచ్చాయోకానీ…దాదాపు ఇరవై కుక్కలు సామూహికంగా అరవడం మొదలుపెట్టాయి. ఒక నిముషం అరచి వెళతాయిలే అనుకుని ఆ శునకరాగంలో శ్రద్ధగా స్వరాలు వెతుక్కున్నా. అది శునకాల అనురాగ రాగం కాదని… సరిహద్దు తగాదాల్లో భాగంగా రెండుగా చీలిపోయి కుక్కలు పరస్పరం తీవ్రస్థాయిలో తిట్టుకుంటున్నాయని అర్థమయ్యింది. అరగంటకు, గంటకు ఈ భౌ భౌ యుద్ధం విడతలవారీగా జరిగింది. అది ఆగే యుద్ధం కాదని క్లారిటీ వచ్చాక…మేమే నిద్రను ఆపుకున్నాము.

ఉదయం లేచాక శునక పీడిత తాడిత రాత్రి సందర్భాలమీద సమగ్రంగా సమీక్ష కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఇక్కడింతే అని పరమయోగిలా మా తమ్ముడు నవ్వాడు. మా తమ్ముడి భార్య మౌనంగా అంతే అంతే అంది.

టూ వీలర్లో వేగంగా వెళితే కుక్కలు మన వెంటపడి కాళ్ళను కరుస్తాయన్న ఎరుకతో ప్రొద్దుటూరులో నడుపుతూ ఉంటానని మా తమ్ముడు గర్వంగా చెప్పుకున్నాడు. అదొక విద్యగా వాడు సాధించినట్లు, నాకు చేతకానట్లు వాడు నిజంగానే గర్వంగా చెప్పుకుంటున్నాడో! లేక నాకు హెచ్చరిక చెబుతున్నాడో! అర్థం కాలేదు.

ఇంత పెద్ద కాలనీ. ఇన్నిన్ని ఇళ్ళు కిక్కిరిసి ఉన్నాయి. ఈ కుక్కలు రాత్రిళ్ళు ఇలా అరుస్తూ ఉంటే…పగలు దారిన వెళ్ళేవారి కాలి కండరాలు ఒలిచి చేతిలో పెడుతూ ఉంటే…ఎవరూ పట్టించుకోరా! అని అడిగాను. ప్రొద్దుటూరుకు ఎన్నెన్నో స్థూల జాతీయ, అంతర్జాతీయ, అంతరిక్ష సమస్యలుండగా ఆఫ్టరాల్ ఈ కుక్కలగురించి పట్టించుకోవాలనుకోవడం అత్యాశ అవుతుందేమో అన్నట్లు వాడు గంభీరంగా ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు.

అయినా…దశాబ్దాలుగా ప్రొద్దుటూరులో ఇల్లు కట్టుకుని ఉన్నవాడు వాడు. చుట్టపుచూపుగా ఎప్పుడో వచ్చి వెళ్ళేవాడిని నేను. స్థానికుల మనోభావాలను దెబ్బతీసే అధికారం నాకు ఎలా ఉంటుంది? పుష్పకవిమానం సినిమాలో రణగొణ ధ్వనులు వినపడకపోతే కమల్ హాసన్ కు నిద్రపట్టదు. అలా ఇంకో నాలుగు రోజులు ఉండి ఉంటే నాక్కూడా కుక్కల భీకరారావాలు అలవాటై వీనులవిందుగానే ఉండేవేమో! ఏమో!

ఫలశ్రుతి:-

ఈ కుక్కల గొడవ వదిలి…గతంలో ప్రొద్దుటూరు బంగారం, దోసెల గురించి రాసిన కథనం చదువుకోండి- నోరూరేలా!

దోసెలు బేత్సావా బీ!

-పమిడికాల్వ మధుసూదన్
998990018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్