“నీ చేతను నా చేతను
వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్
ధర చేత భార్గవు చేత
నరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్”
కర్ణుడి చావు గురించి కృష్ణుడు అర్జునునికి చెప్పిన మాటలు ఇవి.
అర్జునుడు , కృష్ణుడు , కుంతి ,ఇంద్రుడు , భూదేవి , పరశురాముడు వీరు ఆరుగురు కర్ణుడి మరణానికి కారణమయ్యారు.
Youtube : https://www.youtube.com/@dhatritvtelugu
Facebook : https://www.facebook.com/dhatritelugutv
Instagram: https://www.instagram.com/dhatritelugutv/
Twitter :https://x.com/Dhatri_Tv
కర్ణుడి మరణానికి సవాలక్ష కారణాలన్నట్లు ఢిల్లీలో ఆప్ ఓటమికి ముఖ్యంగా కేజ్రీవాల్ పరాజయం, పరాభవానికి కారణం- ఏమంటారు! ఒక్క మాటలో తేల్చేద్దామంటే స్వయంకృతమే. స్వయంకృషితో ఎంతో ఎదిగిన కేజ్రీవాల్ ప్రజలకిచ్చిన మాటలను నీటి మూటలుగా చేయడమే ఇప్పుడాయన పరాజయానికి కారణమయ్యాయి.
పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్ఠ ఎంత పెరుగుతాయో వాటిని పదిలంగా కాపాడుకోవడం అంతే ముఖ్యం. ఏ రంగంలోని వ్యక్తి అయినా తన పరపతిని పెంచుకోవడానికి శత విధాలా ప్రయత్నించడమే కాదు, దానిని నిలుపుకోడానికీ అదే శతవిధాల ప్రయత్నించాలి. అందులోనే ఆప్ అధినేత ఎందులోనో కాలేశాడు. జీవితంలో కేజ్రీవాల్ ను ఓడించలేరంటూ తనే స్వయంగా బీజేపీకీ, అదే ప్రధాని మోదీకి విసిరిన సవాలు ఇప్పుడు తన చెవిలోనే గింగిర్లు తిరుగుతుంటే తట్టుకోలేని పరిస్థితి కేజ్రీది.
అవినీతిని అంతంచేసే ఉద్యమంలో తన గురువు అన్నాహజారే దగ్గర శిష్యడిగా చేరి, అధికారకాంక్ష లేదని, రాజకీయాలంటేనే చేదని తన ఉద్యమ తొలి దశలో ఎన్నో మాటలు చెప్పి, తన సివిల్ సర్వీసు బుర్రతో అందరినీ ఆకట్టుకున్నాడు. తానే పలికిన మాటలకు భిన్నంగా గురువుకే పంగనామాలు పెట్టి, రాజకీయాలు, అధికారంతోనే అన్నీ సాధించి చూపవచ్చని మాట మార్చి ఆప్ తో అవలీలగా ఎదిగిన ఘనత కేజ్రీవాల్ ది.
“మనిషన్నాక కాసింత కలాపోసన వుండాలి” …కాస్తోకూస్తేమిటి ఒకింత ఎక్కవే చదివానంటూ అధికారం చేపట్టాక రాజకీయ విద్యల దన్నుగానే ప్రదర్శించాడు కేజ్రీ.
ఢిల్లీలో పదేళ్లకు పైగా పాగావేసి, అధికారాన్ని పక్కనున్న పంజాబ్ కు పదిలంగా పాకించి, దేశం యావత్తును తనవైపు చూసేలా చేసుకోగలిగిన నేత కూడా కేజ్రీ నే.
అవినీతి మరక లేకుండా ఢిల్లీని తన చీపురుతో శుభ్రం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చి ఒకటి కాదు… వరుసగా అధికారం వెలగబెట్టి, ఇప్పుడు ఘోర పరాభవాన్ని మూటగట్టుకోడానికి కారణం, ఏ అవినీతి పై పోరంటూ తొలి అడుగులు వేశాడో, అదే రొంపిలోకి తానే దిగడమే. అదీ కేజ్రీకే సాధ్యమైంది.
అధికారంలోకి వచ్చిన కొత్త లో అవినీతి కాంగ్రెస్ తో అంటకాగేది లేదని ప్రకటించిందీ, ఆ తరువాత అదే కూటమిలో చేరింది.. మళ్లీ దూరంగా జరిగి ఫలితాలను తారుమారు చేసుకున్నదీ కేజ్రీ నే.
నిజాయితీపరుడినని, పారదర్శక రాజకీయాలు చేస్తానని చెప్పారు కానీ అది కూడా తప్పని తేలింది, అవినీతి కేసులో జైలుకు వెళ్లి ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు. మతం, కులం ఆధారంగా రాజకీయాలు చేయనని చెప్పి అదీ చేశారు. ఇదంతా కేజ్రీ ఖాతాలోవే.
తాను సామాన్యుడినేనని, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సామాన్యుడిలాగే ఉంటానని పలుమార్లు చెప్పి, దానిని అబద్ధం చేసింది, తనకోసం ఒక పెద్ద బంగళా కట్టుకుని, చిన్నకారు నుంచి ఖరీదైన కారు కు మారిందీ కేజ్రీ నే.
తాను ప్రజాస్వామ్య నాయకుడినని, స్వరాజ్యాన్ని నమ్ముతానని పదేపదే చెప్పారు. కాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీలోనే ప్రజాస్వామ్యం కరువైంది, పార్టీలో అన్నీ ఆయన ఆదేశాలే పాటించాలి. ఇది కూడా కేజ్రీ ఘనతే.
అవినీతి రహిత సమాజం పేరుతో తొలుత అధికారం లోకి వచ్చిన ఆప్, రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలను ఉచితాల భ్రమలోకి నెట్టి, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ అన్ని పార్టీలకు తానేమీ విభిన్నం కాదని చాటిచెప్పిందీ కేజ్రీనే.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, మొహల్లా క్లినిక్‌లు, పారదర్శక పాలన వంటి వాటికి పెద్ద పీట వేస్తామని చెప్పినా కుంటి సాకులతో వాటిని గాడిలో పెట్టలేని దుస్థితి.
కర్ణుడి చావుకు మహాభారతంలో ఎన్నికారణాలు చూపారో, ఈ భారతంలో కేజ్రీవాల్ ఓటమికీ ఎన్నో కారణాలు. ఢిల్లీలో ఓటమితో ఆప్ పని అయిపోయినట్లేనా, పంజాబ్ పై ఈ ప్రభావం తప్పక వుంటుంది. ఆప్ కు ఆయువు పట్టులాంటి హస్తిన చేజార్చుకున్నాక, కేజ్రీవాల్ కు అంతా అయోమయ మేనా! చుట్టుముట్టిన అవినీతి కేసులు, ఆయరాం..గయారాం రాజకీయాలతో ఆప్ లో ఎందరు మిగులుతారో తెలవని పరిస్థితి.
Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv
మొత్తానికి దేశానికే ఆదర్శంగా నిలుస్తాడని అందరూ భావించిన కేజ్రీవాల్ ఒక్క ఓటమితో తన క్రేజ్ నే పోగొట్టుకున్నారు. రాజకీయ అవినీతిలో తానూ భాగమై పోయారు. నాకు ఎదురులేదనే గర్వాన్ని మాత్రం ఢిల్లీ ప్రజలు తమ తీర్పుతో అణచివేశారు. తాను అవినీతిపరుణ్ణో కాదో ప్రజలే తేలుస్తారని, ఎన్నికల ముందు కేజ్రీవాల్ అన్నమాటలు ఎట్లున్నా…ఢిల్లీ ఫలితాలు అన్ని పార్టీలకు ఒక గుణపాఠం అంటే కాదనలేము. ఓటమి నుంచి నేర్చుకునే పాఠాలు ఆప్ పై కేజ్రీవాల్ పై ప్రభావం చూపి మళ్లీ పుంజుకోవాలని ఆశిద్దాం.
-వెలది కృష్ణకుమార్