మహారాష్ట్ర ఏక్ నాథ్ షిండే ఎవరికైనా ఒక పాఠం. విస్మరిస్తే గుణపాఠం. ఈమధ్య రాజకీయ ప్రస్తావనల్లో షిండే నామజపం తగ్గింది కానీ...మొన్న మొన్నటివరకు “ఇక్కడా షిండేలు ఉన్నారు…సమయమొచ్చినప్పుడు బయటపడతారు”- అని మీసం మెలేసి చెప్పే సందర్భాలు ఉండేవి. ఏ గుంపులో ఎవరు షిండేనో తెలియక అన్ని గుంపుల్లో అందరూ షిండేలనే వెతుక్కునేవారు.
రాజకీయాల్లో బండ్లు ఓడలవుతాయి; ఓడలు బండ్లవుతాయి. బయటి లెక్కలు వేరు- రాజకీయాల లెక్కలు వేరు. బయట రెండూ ప్లస్ రెండు నాలుగే; రెండూ ఇంటూ నాలుగు ఎనిమిదే. రాజకీయాల్లో రెండూ ప్లస్ రెండు అయిదేళ్ళ అప్రతిహత అధికారం కావచ్చు. సున్నా కావచ్చు. ఇంకేమైనా కావచ్చు. రాజకీయ హత్యలు ఎన్నయినా జరగచ్చు. కానీ రాజకీయాల్లో ఎప్పుడూ హత్యలుండవు- ఆత్మహత్యలే ఉంటుంటాయి.
Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv
శివసేనను చీల్చి, ముఖ్యమంత్రి అయి, అసలైన శివసేన తనదేనని సుప్రీంలో కూడా నిరూపించుకున్న ఏక్ నాథ్ షిండే ఆధునిక రాజకీయాల్లో ఎందరికో ఆదర్శం. ప్రజాస్వామ్యంలో అంకెలదే అంతిమ విజయం. ధర్మం- అధర్మం; నైతికత- అనైతికత; విశ్వాసం- అవిశ్వాసం లాంటివన్నీ కొలువుదీరిన నిండు సభ బలపరీక్ష ముందు బలాదూర్. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికార పీఠాన్ని దక్కించుకున్న అంతటి ఎన్ టీ ఆర్ కూడా బలపరీక్ష దాకా అయినా వెళ్ళకుండానే అధికారబలం కోల్పోవాల్సి వచ్చింది. ప్రజస్వామ్యంలో అదే బ్యూటీ. అదే దాని బలం. అదే బలహీనత కూడా.
ముఖ్యమంత్రిగా చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ ఏకనాథ్ షిండేకు జూనియర్ గా ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే ముఖ్యమంత్రిగా పనిచేసిన షిండే అదే ఫడ్నవిస్ కు జూనియర్ గా ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.
సంస్కృతంలో భాషాపరంగా మాటకు ముందు చేరే ఉపసర్గలు చాలా కీలకమైనవి. ప్ర, వి, అవ, ప్రతి, పరి లాంటివి. అందులో “ఉప” కూడా ఒకటి. శిష్ట- విశిష్ట
మోదం- ప్రమోదం
స్పందన- ప్రతిస్పందన
పాలన- పరిపాలన
శేషం- అవశేషం
ఆహారం- ఉపాహారం
ఉప సమీపే అని వ్యుత్పత్తి అర్థం ఉన్నంతమాత్రాన ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండేవాడు ఉప ముఖ్యమంత్రి అనుకోవడానికి వీల్లేదు. రాజకీయంగా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోదగ్గ అర్హత ఉన్నా పొలిటికల్ కంపల్షన్స్ వల్ల కూర్చోలేకపోయినవాడు; ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి ఉన్నవాడు ఉప ముఖ్యమంత్రి అనుకుంటారు. ఉప ముఖ్యమంత్రి ఎక్కడ తన స్థానాన్ని లాగేసుకుంటాడో అని ముఖ్యమంత్రి ఎప్పుడూ భయపడుతూ తగిన జాగ్రత్తలో ఉండడం కూడా పొలిటికల్ కంపల్షనే. మంత్రివర్గంలో మిగతా మంత్రుల్లాగే ఉప ముఖ్యమంత్రి కూడా. రాజ్యాంగపరంగా ఉప ముఖ్యమంత్రికి మంత్రికి మించిన అధికారాలేమీ ఉండవు.
మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉండి…ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి అయిన ఏక్ నాథ్ షిండేకు వేడి సెగలు తగులుతున్నట్లున్నాయి. అంతటి శివసేనను నిలువుగా, అడ్డంగా చీల్చిన తనకు ఇంకా ఎక్కువ గుర్తింపు, గౌరవం, మర్యాదలు దక్కాలని ఆయన కోరుకోవడంలో తప్పులేదు. శివసేన లేకపోయినా సొంత కాళ్ళమీద నిలబడగలడం ఎలాగో తెలిసిన ప్రస్తుత మోడీ- అమిత్ షాల బి జె పి కాలంలో తను ఏమీ చేయలేడు. అలాగని చేయకుండా ఉండిపోతే తనను ఈమాత్రం కూడా గుర్తించరేమోనని లోపల ఒకటే దిగులు. బయటపడితే ఒక బాధ. పడకుంటే ఒక బాధ. దాంతో “నన్ను తక్కువగా అంచనా వేయకండి- గతంలో అలా తక్కువగా అంచనా వేస్తే…ఒక ప్రభుత్వాన్నే కూలదోసి…ముఖ్యమంత్రి అయ్యాను…తెలుసు కదా?” అని బహిరంగంగానే హెచ్చరించారు. ఈమధ్య ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో ఆయనకు దూరం పెరిగినట్లు వినికిడి. ఆ నేపథ్యంలో ఈ తాజా హెచ్చరిక ముఖ్యమంత్రికో! లేక మోడీ- అమిత్ షాలకో! అయి ఉండాలి.
Youtube : https://www.youtube.com/@dhatritvtelugu
Facebook : https://www.facebook.com/dhatritelugutv
Instagram: https://www.instagram.com/dhatritelugutv/
Twitter :https://x.com/Dhatri_Tv
ముఖ్యమంత్రి సీటులోనుండి షిండేను ఉప ముఖ్యమంత్రిగా స్థాయి తగ్గిస్తే ఆయనేమి చేస్తారో! దానికి విరుగుడుగా ఏమి చేయాలో! తెలియనంత అమాయకులు కాదు మోడీ- అమిత్ షాలు. ఎవరి వ్యూహాలు వారికుంటాయి.
నిజమే.
రాజకీయాల్లో హత్యలుండవు!
కేవలం ఆత్మహత్యలే ఉంటాయి!