Tuesday, February 25, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంలేక లేక...లేకుండా ఉండిన శాఖ

లేక లేక…లేకుండా ఉండిన శాఖ

శంకరాచార్యుల సంస్కృతంలో శబ్ద సౌందర్యం, అర్థ గాంభీర్యం వర్ణించడానికి మాటలు చాలవు. కవిత్వం, ప్రాసలు, తూగు, చమత్కారం, భావం, సాంద్రత, ఎత్తుగడ, ముగింపు, మకుటం, పునరుక్తి లేకుండా ఒకే విషయాన్ని రకరకాలుగా చెప్పడం, అత్యంత సంక్లిష్టమైన అద్వైత వేదాంత రహస్యాలను అరటిపండు ఒలిచిపెట్టినట్లు అత్యంత తేలికగా చెప్పడం…ఇలా తోడుకున్నవారికి తోడుకున్నన్ని అందాలు, ఆనందాలు, అర్థాలు, పరమార్థాలు. శంకరుడు పుట్టకపోయి ఉంటే దేవుళ్ళకు ఇన్నిన్ని స్తోత్రాలే ఉండేవి కావు.

శంకరుడు మనకిచ్చిన అనేకానేక స్తోత్రాల్లో దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి. అందులో మొదటి శ్లోకం-

“విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం…”.

ఇది ఆధ్యాత్మిక వ్యాసం కాదు కాబట్టి… ఈ శ్లోకం లోతైన అర్థం జోలికి వెళ్ళకుండా పైపైన మన అవసరానికి అన్వయించుకుందాం.

“కంటి ముందు కనిపించే ఈ ప్రపంచం మనం కల్పించుకున్నదే. మన మనసనే అద్దంలో అది ప్రతిబింబిస్తుంది. నిజానికది లేదు. అంతా మాయ”.

Youtube : https://www.youtube.com/@dhatritvtelugu
Facebook : https://www.facebook.com/dhatritelugutv
Instagram: https://www.instagram.com/dhatritelugutv/
Twitter :https://x.com/Dhatri_Tv

ఇదే భావనను అచ్చ తెలుగులో-

“కనుతెరిచినంతనే కలుగునీ జగము;
కనుమూసినంతనే కడు శూన్యము;
కనురెప్ప మరుగుననే కలిమియును, లేమియును;
తన మనోభావనల తగిలి తోచీని…”

అని పదకవితాపితామహుడు అన్నమయ్య తనదైన శైలిలో చెప్పాడు.

మనసు మూడు స్థితులను దాటాలంటుంది వేదాంత పరిభాష.
1. మల- అద్దం మీద దుమ్ము పడితే దృశ్యం ఎలా కనిపించదో అలాగే మలినమైన మనసు దృశ్యాన్ని స్పష్టంగా చూడలేదు.
2. ఆవరణ- మనసును ఏవేవో పొరలు ఆవరించి ఉంటే దృశ్యం సరిగా కనపడదు.
3. విక్షేపం- మధ్యలో ఏవేవో ఆటంకాలు ఉంటే దృశ్యం కనపడదు. లేదా ఒకదాన్ని మరొకటి అనుకున్నా అసలు దృశ్యాన్ని పట్టుకోలేము.

ఇవన్నీ మహాయోగులు, సిద్ధులు, సర్వసంగ పరిత్యాగులు ఎప్పుడో కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో అనుభవించినవి. రాసినవి. చెప్పినవి. ఈ కలియుగంలో వీటి రిలవెన్స్ ఏముంటుంది? అని కొట్టిపారేయడానికి వీల్లేదు. శంకరాచార్యులు, అన్నమయ్య కంటే ఇంకా సులభంగా అర్థం కావడానికి ఆప్ పార్టీ పాలనలోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక మాయా వేదాంత పాఠాలకోసం ఒక మంత్రిత్వ శాఖనే దాదాపు ఇరవై నెలలపాటు నడిపింది!

పంజాబ్ లో పాలనా సంస్కరణల శాఖ మంత్రిగా కుల్ దీప్ సింగ్ ధలివాల్ ఇరవై నెలలపాటు పనిచేశారు. తన శాఖకు కార్యదర్శి లేకపోవడంతో కుల్ దీప్ కు లైట్ ఆలస్యంగా వెలిగింది. ఆయన కదిలిస్తే ప్రభుత్వం నాలుక కరుచుకుని…లేని శాఖకు ఆయన ఉన్న మంత్రిగా ఇరవై నెలలు ఉన్నారని గ్రహించి…రాత్రికి రాత్రి…తూచ్ అలాంటి శాఖ ఏదీ లేదని గెజిట్ విడుదల చేసింది. ఎన్ ఆర్ ఐ వ్యవహారాల శాఖ కూడా ఉండబట్టి లేని శాఖ బోర్డు మాయమైనా ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. లేకపోతే మంత్రి పదవే మాయమయ్యేది.

అసలే ఢిల్లీలో ఆప్ ను ఓడించిన ఊపుమీద ఉన్న బి జె పి ఈ అవకాశాన్ని వదులుకుంటుందా?
“ఉనికిలో లేని శాఖకు మంత్రి;
ఆ విషయం తెలియని ముఖ్యమంత్రి; ప్రజాపాలన అంటే ఆప్ కు పరిహాసంలా ఉంది” అని ఒక ఆట ఆడుకుంటోంది.

సిద్ధాంతం ఆగినచోటే వేదాంతం మొదలుకావాలి!

ఏది ఉన్నది?
ఏది లేనిది?
ఏది ఉండీ…లేనట్లున్నది?
ఏది లేకపోయినా…ఉన్నట్లున్నది?

Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv

మంత్రులకు ఉన్న శాఖలు ఉన్నట్లు కాదు.
లేని శాఖలు లేనట్లు కాదు. ఉందనుకుంటే ఉంది. లేదనుకుంటే లేదు. అంతా మాయ!

లేని శాఖకు మంత్రిగా ఇరవై నెలలు కుల దీపమై వెలిగిన దీపశిఖలాంటి నిలువెత్తు ధగధగ వెలిగే మనిషి నిక్షేపంగా ఉన్నప్పుడు…
ఏది మల?
ఏది ఆవరణ?
ఏది విక్షేపం?
అన్న వేదాంత చర్చ ఎందుకు? దండగ!

శంకరుడు స్తుతించిన దక్షిణామూర్తే దిగివచ్చినా…
సువిశాల భారతావనిలో, అనేక రాష్ట్రాల్లో లేని శాఖలకు ఎందరు మంత్రులుగా పనిచేశారో! చేస్తున్నారో! చేస్తారో! చెప్పగలడా?

ఆధునిక పాలనా సంస్కరణ పాఠాలకు ఇదొక చుక్కాని!

రాజకీయ మలిన వాతావరణంలో, పార్టీల ఆవరణల్లో మనసుకు అన్నీ విక్షేపాలే. బాధ్యతగల పౌరులు కళ్ళు తెరిచి చూస్తే అన్నీ కనిపిస్తాయి కాబట్టి…బాధ్యతాయుతంగా కళ్ళు గట్టిగా మూసుకోవడమే తెలివైనవారి తక్షణ కర్తవ్యం!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్