Tuesday, April 29, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోగలడా?

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోగలడా?

గాంధీ పుట్టిన గుజరాత్ గడ్డలో గాంధీల కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి ముప్పయ్యేళ్లయ్యిందా? ఒక తరం దాటిందా? మరో ముప్పయ్యేళ్లపాటు వరుసగా గెలుస్తూనే ఉండడానికి వీలుగా మోడీ బీ జె పి పునాదులు వేసుకుందా? అన్నది కేవలం అకెడెమిక్ ప్రశ్న. బయటనుండి చూసేవారికే ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుని కాలికి బలపం కట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి ఎలా ఉండాలి చెప్పండి! గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి కాయకల్ప చికిత్స చేద్దామని రాహుల్ కు ఉన్నట్లుంది. కానీ ఎక్కడినుండి మొదలుపెట్టాలో మొదట్లో క్లారిటీ ఉన్నట్లు లేదు. ఇప్పుడు క్లారిటీ వచ్చినట్లుంది.

రెండ్రోజులపాటు గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీని సమీక్షిస్తూ ఆయన ఒక ఆసక్తికరమైన మాట అన్నారు. ఇక్కడ నాముందు కూర్చున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల్లో రెండు రకాల వాళ్ళున్నారు.

1. నిత్యం జనంలో ఉంటూ, జనం సమస్యలమీద పోరాడుతూ కాంగ్రెస్ జెండాను మోసే నిజమైన కార్యకర్తలు.
2. జనంతో సంబంధం లేకుండా కాంగ్రెస్ లో ఉంటూ బి జె పి కి కోవర్టులుగా పనిచేసేవారు.రెండో రకం వారిని నిర్దయగా ఏరిపారేయండి అన్నారు. అలా అనగానే సభ కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. కార్యకర్తల మొహంలా ఏదో తెలియని కాంతి తళతళలాడింది. అంటే రెండో రకం వారున్నారని, వారిని ఏరిపారేయడం అవసరమని సభ హర్షధ్వానాలతో ఆమోదించినట్లుగానే భావించాలి.

అదే బీ జె పి లో ఉంటూ ఇలాగే కాంగ్రెస్ కు పనిచేసే కోవర్టులు ఉంటే చిటికెలో ఏరిపారేయరా? బి జె పి కి పనిచేసే కాంగ్రెస్ గుజరాత్ కోవర్టులెవరో రాహుల్ కు తెలుసు. కానీ తీసిపారేయలేకపోయారు. అదే కాంగ్రెస్ బలహీనత. అదే ఒక్కోసారి దాని బలం కూడా. అంతర్గత, బహిర్గత, అంతర్బహిర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ లో ఉండాల్సిందానికంటే ఎప్పుడూ కొన్ని మెట్రిక్ టన్నులు ఎక్కువే ఉంటూ ఉంటూ ఉంటుంది. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ లో రెడ్ల ఆధిపత్యంలో బీ సీ లు నలిగిపోతున్నారంటూ పేరున్న కాంగ్రెస్ లీడర్లే బహిరంగంగా విమర్శించారు. చెడు చెవిలో చెప్పండి- మంచి పబ్లిగ్గా చెప్పండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగుల్లో చెబుతున్నప్పుడే కాంగ్రెస్ అగ్రనాయకులు చెడును పబ్లిగ్గా మైకులో చెప్పి…మంచిని అక్కడే ఆయన చెవిలో బాధ్యతగా చెబుతూ ఉంటారు. ఆ స్వేచ్ఛను పార్టీ ఇస్తుందో! లేక నాయకులే తీసుకుంటారో! తెలియదు కానీ ఆ నిర్నిరోధమైన స్వేచ్ఛ ఎంత ఉంటుందంటే…కోవర్టులున్నారని పార్టీ అధినాయకుడే పబ్లిగ్గా గుండెలు బాదుకోవాల్సినంత.

పనిలో పనిగా గుజరాత్ తో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ చెడు కోరి; ప్రత్యర్థి బాగు కోరి శక్తివంచన లేకుండా పనిచేసిన, చేస్తున్న, చేసే అవకాశమున్న కోవర్టుల గుర్తింపుకు; ఏరివేతకు “కాంగ్రెస్ చోడో” కార్యక్రమం ఒకటి ఆసేతుహిమాచలం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అన్నట్లు-
గుజరాత్ నేల మీద మోడీని మృత్యు బేహారి అని;
మహాకుంభ మేళా ప్రయాగ్ రాజ్ గంగలో మునిగితే పాపాలు పోతాయా? అని రాజకీయంగా వేసుకున్న అధినేతల అతిపెద్ద సెల్ఫ్ గోల్స్ ముందు ఈ కోవర్టులు చేయగలిగిన డ్యామేజ్ శత సహస్రాంశం కూడా కాకపోవచ్చు!

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడని సామెత. గుజరాత్ సౌరాష్ట్ర తీరంలో సోమనాథేశ్వరుడేమైనా పట్టుకోగలడేమో!

  1. హిందువులు కాంగ్రెస్ ను ఎందుకు దూరం పెట్టారో కాంగ్రెస్ కు తెలుసు. కానీ ఏమీ చేయలేదు. వీలైనంత ఇంకా ఎక్కువ దూరం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది.
  2. దేశ యువత కాంగ్రెస్ కు ఎందుకు దూరమయ్యిందో కాంగ్రెస్ కు తెలుసు. అయినా ఏమీ చేయలేదు.
  3. ఇరవై, ముప్పయ్ ఏళ్లు రాష్ట్రాల్లో తిరుగులేని బలమయిన నాయకులుగా, పార్టీకి స్తంభాలుగా ఉండాల్సినవారు…సొంత పార్టీలు పెట్టుకుని అధికారంలోకి రావడానికి కాంగ్రెస్సే కారణమని కాంగ్రెస్ కు తెలియక కాదు. తెలిసినా…ఏమీ చేయలేదు.
  4. కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగతంగా దేశం పట్టనంత సంపన్నులై…కాంగ్రెస్ పార్టీ దేశం పట్టుకుని వీధి వీధి తిరగాల్సిన నిరుపేద ఎందుకయ్యిందో కాంగ్రెస్ కు తెలుసు. అయినా ఏమీ చేయలేదు.
  5. దేశానికి కాంగ్రెస్ అవసరం ఉందని దేశ ప్రజలకు తెలుసు. కానీ కాంగ్రెస్ కే దేశంతో అవసరం ఉన్నట్లు తెలియడం లేదు. అంతే!

అన్నట్లు-
“కోవర్ట్” అన్న ఇంగ్లిష్ మాటకు తెలుగు అనువాదమేమిటబ్బా? “ఇంటిదొంగ” కొంచెం దగ్గరి మాట అవుతుందేమో అని ఎవరో అన్నారు కానీ…పాపం…స్వభావరీత్యా దొంగలను అవమానించినట్లవుతుంది. మాట లేదనుకుని తెలుగులో కోవర్టులు లేరనుకునేరు పొరపాటున! కొంప కొల్లేరవుతుంది- జాగ్రత్త!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్