భూగోళం అరచేతిలో ఇమిడిపోయిన కాలంలో ఉన్నాం. అంతర్జాలానికి అనుసంధానమై ఉంటే చాలు వీధి మార్జాలం(పిల్లి)కూడా అడవిలో రారాజు సింహానికి క్లాసులు తీసుకోగలదు. ఆన్ లైన్ లో దొరకనిది లేదు. బతికి ఉండడానికి తినే తిండి నుండి…పోతే పెట్టే పిండం వరకు ఏదైనా ఆన్ లైన్లో ఆర్డర్ ఇవ్వచ్చు. ఒక్కో ఆర్డర్ కు వస్తువు తయారు చేసినవారి, అమ్మినవారి లాభంతో పాటు యాప్ వాడి లాభం, ఇతర ప్రభుత్వ పన్నులు కలిపి తడిసి మోపెడవుతున్న విషయం మనకు తెలియదు కాబట్టి…ఒక వాటర్ బాటిల్ మెదలు, ఒక కాడ కొత్తిమీర వరకు ఏదైనా ఆన్ లైన్లో ఆర్డర్ ఇచ్చి అయిదు నిముషాల్లో వచ్చేసిందని సంబరపడుతూ ఉంటాం!
“అద్దాల అంగడి మాయ!
దాని దెబ్బకు మనిషి బతుకు బొంగరమైపాయ!!” అని గోరటి వెంకన్న ఆన్ లైన్ షాపింగ్ వలలో చిక్కుకుని మన బతుకులు ఎలా గింజుకుంటున్నాయో తనదైన జానపద శైలిలో చెప్పాడు. నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్లు ఆన్ లైన్ షాపింగ్ లో మంచీ- చెడూ రెండూ ఉంటాయి. ఇది చెడుకు సంబంధించిన ఒకానొక కోణం.
అమెరికాలో తుపాకులు ఎవరైనా కొనుక్కోవచ్చు. బొమ్మల్లా షాపుల్లో దొరుకుతాయి. మన అవసరాన్ని బట్టి, స్థాయిని బట్టి మార్కెట్లో కిలోల్లెక్కన కూరలు కొన్నట్లు కొనుక్కోవచ్చు. అందువల్లే అక్కడ స్కూల్ పిల్లలు కూడా తుపాకులు కొనుక్కుని అవి సరిగ్గా పని చేస్తున్నాయో! లేదో! పరీక్షిస్తూ బళ్ళల్లో కాలుస్తూ ఏటా వందలమంది ప్రాణాలను తీస్తూ ఉంటారు. మాల్స్ లోకి చొరబడి కౌంటర్లో తుపాకులతో బెదిరించి డబ్బు లాక్కుని వెళుతుంటారు. గొడవ జరిగితే కాల్చి పరారవుతుంటారు. బయట రోడ్లమీద, ఫంక్షన్లలో, మ్యూజిక్ ప్రోగ్రాముల్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరిమీద అయినా తుపాకులు పేలవచ్చు. సాక్షాత్తు కాబోయే దేశాధ్యక్షుడి మీదే తుపాకి కాల్పులు మొన్ననే ప్రత్యక్ష ప్రసారంలో చూశాం. తుపాకీ గుండుకు బలైపోయిన అమెరికా అధ్యక్షుడి కథలు కూడా తెలిసినవే. అయినా బహిరంగ మార్కెట్లో తుపాకుల అమ్మకాన్ని అమెరికా నిషేధించలేదు. నిషేధించేంత సాహసం చేయలేదు. అమెరికా ఆయుధాల మార్కెట్ పెద్దలకు ఆ దేశం మీద అంతటి పట్టు ఉంటుందన్నది బహిరంగరహస్యం. ప్రపంచం నలుమూలలా దేశాల మధ్య తగువులు పెట్టి అటు ఇటూ రెండు వైపులా ఆయుధాలు అమ్ముకోవడంలో అమెరికా నేర్పు లోకానికి తెలిసిందే.
అమెరికాలో దొరికినట్లు భారత్ లో కూడా బహిరంగ మార్కెట్లో తుపాకులు దొరికితే ఎంత బాగుణ్ణు! అని ఎంతో కాలంగా సంఘ విద్రోహకశక్తులు ఎదురుచూస్తున్నాయి. వారి ఎదురుచూపులు ఫలించాయి. కాకపోతే అమెరికాలో మాదిరి బజార్లలో, షాపుల్లో ఓపెన్ గా పెట్టి అమ్మకపోయినా…ఆన్ లైన్ లో ఏ రకం తుపాకి కావాలంటే అది ఓపెన్ గా దొరుకుతోంది. దీనికోసం కొన్ని వందల, వేల వాట్సాప్ గ్రూపులు ప్రత్యేకంగా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి.
తుపాకి మేడ్, సైజ్, రేంజ్, కంట్రీ, స్పెసిఫికేషన్, ఎక్స్ట్రా బుల్లెట్స్, వెపన్ లెదర్ కవర్, బెల్ట్, పేమెంట్ మోడ్(బ్లాక్/వైట్/హవాలా) సెలెక్ట్ చేసుకుని వాట్సాప్ గ్రూపులో ఆర్డర్ పెడితే చాలు. స్విగ్గీలో పొగలుగక్కుతూ వేడి వేడి ఇడ్లీ సాంబార్ ఇంటికి నడిచి వచ్చినట్లు…గురి తప్పని గన్ విత్ అన్ లిమిటెడ్ బుల్లెట్స్ మీ చేతిలో ప్రత్యక్షం. ఇక గురి పెట్టి…పగలూ రాత్రీ విసుగూ విరామం లేకుండా ఎదుటివారి గుండెల్లోకి తూటాలు దించడమే తరువాయి!
తుపాకుల నాణ్యత, ప్రభావం, వేగం, కచ్చితత్వం, నిశ్శబ్దంగా పనిచేయడం లాంటి వస్తుగుణగణాలతో ప్రత్యేకంగా ప్రకటనలు కూడా ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఉంటున్నాయి. వచ్చాక ఇంట్లోనే అవసరంలేనివారి మీద కాల్చి…క్వాలిటీ అప్ టు ది మార్క్ కాకపొతే…మింత్రా, అమెజాన్ లా రిటర్న్ ఇచ్చి… తమకవసరమైనదే మళ్ళీ తెప్పించుకునే సౌకర్యం ఉందో! లేదో! ఉండే ఉంటుంది!
ఇదివరకు తుపాకులు కొనుక్కోవాలంటే ఉత్తర ప్రదేశ్, బీహార్ దాకా వెళ్లాల్సివచ్చేది. పైగా అవి కొంచెం నాటు తుపాకులు. కంట్రీ మేడ్. ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల పుణ్యమా అని ఆ మొరటు తుపాకుల బెడద తప్పిందట. మంచి జర్మన్ మేడ్, నాలుగు వేళ్ళమధ్య ఒదిగిపోయే చిట్టి తుపాకి మొదలు, ఏ కె 47 దాకా ఏది కావాలంటే అది ఆర్డర్ ఇచ్చుకోవచ్చట.
వాట్సాప్ యూనివర్సిటీలో అనంతమైన అజ్ఞానమే కాదు…
వాట్సాప్ మార్కెట్లో అంతులేని అరాచకం, విధ్వంసం, మనిషిని చంపే మారణాయుధం కూడా అమ్ముడుబోతోంది!
ఈ కథనానికి ఆధారం:-
ప్రముఖ సోషల్ మీడియా టూల్స్ పరిశోధక సంస్థ డిజిటల్ విట్నెస్ ల్యాబ్ వెల్లడించిన పరిశోధన వివరాలు. ఆ వివరాలతో వచ్చిన వార్తలు.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018