మనకు దయ్యాలతో బాగా పరిచయమే. దయ్యాలతో మాట్లాడేవారు; దయ్యాలతో పనులు చేయించుకునేవారు; దయ్యమై పట్టి పీడించేవారు; పట్టిన దయ్యాలను విడిపించేవారు; అంతటి దయ్యాలు కూడా నిలువెల్లా వణికి చావాల్సినవారు…ఇలా వీళ్ళందరూ మనకు బాగా తెలుసు. ఎటొచ్చీ గ్రహాంతరవాసులతోనే మనకు బొత్తిగా పరిచయం లేని వెలితి ఉండేది. ఆ వెలితిని కూడా అమెరికాలో కొందరు ఉన్నతాధికారులు ఇన్నాళ్ళకు భర్తీ చేశారు.
అధునాతన మానవ మేధస్సుతో అంతరిక్షంలో ఏళ్ళకు ఏళ్ళు కాపురాలు పెట్టి…అవసరమైనప్పుడు భూమ్మీదికి వచ్చి …మళ్ళీ వెళ్ళే ఈరోజుల్లో ఏమిటి ఈ చాదస్తమంతా! అని కొట్టిపారేయడానికి వీల్లేకుండా అమెరికాలో మిలటరీ, నిఘా అధికారులు కూడా ఇలాంటి విషయాలే చెబుతున్నారు. వారు తాజాగా విడుదల చేసిన ఒక డాక్యుమెంట్ ప్రకారం:-
- 1940 నుండి గ్రహాంతరవాసులు భూమ్మీదికి అంతరిక్ష నౌకల్లో రహస్యంగా వచ్చి…వెళుతున్నారు.
- భూమ్మీద మన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు గ్రహాంతరవాసులు తెలుసుకుని…వెళుతున్నారు.
- గ్రహాంతరవాసుల అంతరిక్ష నౌక వేగం గంటకు 50 వేల కిలోమీటర్లకు మించి ఉంది.
- అమెరికా ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో స్పష్టత ఉంది. కానీ…భయంకొద్దీ బయటపెట్టలేకపోతోంది.
ఈ విషయాలన్నీ చెప్పినవారు దారినపోయే దానయ్యలు కాదు. అమెరికా మిలటరీలో, ప్రభుత్వ నిఘా విభాగంలో కీలకమైన స్థానాల్లో పనిచేసినవారు. పైగా చెప్పినవారు ఒకరు, ఇద్దరూ కాదు. ముప్పయ్ మంది. శాస్త్రవేత్తలు మాత్రం ఇందులో దేన్నీ ధ్రువీకరించడం లేదు.
“ఏ గ్రహం నుండి ఊడిపడ్డావ్?” అని తెలుగులో తిట్టులాంటి ఆశ్చర్యం అనాదిగా ఉంది. గ్రహాంతరవాసుల(ఏలియన్స్) ఉనికిమీద ఇంగ్లిష్ లో లెక్కలేనన్ని కథలు, నవలలు, సినిమాలు.
ఈసారి తేడాగా ఉన్నవారెవరైనా ఎదురుపడినప్పుడు…
“ఏ గ్రహంనుండి ఊడిపడ్డావ్?” అని విసుగ్గా, ఏవగింపుగా, తిట్టుగా, ఆశ్చర్యంగా కాకుండా సాధారణ ఉభయకుశలోపరి పలకరింపుగా, ఆత్మీయంగా, కనీస విహిత ధర్మంగానే “ఏ జిల్లా? ఏ జిల్లా?” అన్నట్లు
“ఏ గ్రహం? ఏ గ్రహం?” అని నోరారా అడగండి! మనం తరువాత ఏ గ్రహంలో పుడతామో ఎవరికెరుక! కనీసం పరిచయాలైనా ఉంటే…రేప్పొద్దున ఏదో ఒక గ్రహంలో మనకు సింగిల్ బెడ్ రూమ్ గృహమైనా తలదాచుకోవడానికి దొరికే అవకాశం ఉంటుంది! మొత్తం మన సనాతన ధర్మ మహాసౌధం నిలుచున్నదే పునర్జన్మ సిద్ధాంతం మీద కనుక!
అమెరికాలో అంతే. ప్రతిదానికీ వణికిపోతారు. అదే మనదగ్గర అయితే ఒక్కొక్కరు ఒక్కో గ్రహంనుండి అప్పుడే ఊడిపడ్డట్టు ఎవరికివారు గ్రహాంతరవాసుల్లాగే విచిత్రంగానే ఉంటారు. మరీ అంత ఇదిగా ఉంటే…గ్రహశాంతులు చేయిస్తారు. ఇంకా ఆ ఇది ఇదిగానే ఉంటే యూ ట్యూబులో గ్రహానుగ్రహ మంత్రాలకు అర్థం తెలియనివారు చెప్పిన అనుగ్రహభాషణలు వింటారు!
గమనిక:-
విషయం దయ్యంతో మొదలయ్యింది కాబట్టి దయ్యాలు, గ్రహాంతరవాసులు ఒకటే అనుకునేరు. మనకు దయ్యాలతో అనాదిగా నెయ్యమో, వియ్యమో ఉంది కాబట్టి పరిచయానికి ఆ ఎత్తుగడ- అంతే! ఉన్న దయ్యాలతోనే వేగలేక చస్తుంటే…ఈ గ్రహాంతరవాసుల గొడవేమిటి? అని విసుక్కోకండి. ఏ పుట్టలో ఏ పాముందో? ఎవరి పక్కన ఏ గ్రహాంతరవాసి ఉన్నాడో? ఎవరికెరుక!
ఏమి! మీకేనా! లేటెస్ట్ టెక్నాలజీ కావాలి?
గ్రహాంతరవాసులకు వద్దా!
అడిగేవారే లేరా! హమ్మా!!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు