Sunday, April 13, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకోర్ట్ సినిమా సమీక్ష

కోర్ట్ సినిమా సమీక్ష

ఎవరినన్నా చంపితే శిక్ష పడుతుందని తెలుసు. అయినా హత్యలు ఆగడం లేదు. అత్యాచారం, మోసం, దోపిడీ …. ఇలా అన్ని నేరాలకీ శిక్షలున్నాయి. అయినా నేరాలు అంతకంతకూ ఎక్కువ అవుతూనే ఉన్నాయి. కోర్టుల్లో లక్షలాది కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటికీ ఒకటే కారణం. అదే చట్టం గురించి సామాన్య ప్రజలకు అవగాహన లేకపోవడం. సరిగ్గా ఈ పాయింట్ చర్చించారు కోర్ట్ సినిమాలో.

తెలుగు సినిమాలపై విరక్తితో ఇతరభాషా చిత్రాలు చూస్తున్న వారికి కోర్ట్ సినిమా చూసి ప్రాణం లేచి వచ్చింది. అనుకున్న కథను సరిగ్గా చూపితే ఎంత బాగుంటుందో తెలిసింది. పైగా ఈ సినిమాలో నటులే తప్ప స్టార్స్ లేకపోవడం సినిమాకి అదనపు బలం.

టీనేజ్ పిల్లలు చేసే తప్పులు సాధారణంగా అవగాహనా లోపం వల్లనే. ఇంట్లో ఆంక్షలు అమ్మాయిలను ఒక రకంగా మారిస్తే, ఆంక్షలు లేకపోవడం అబ్బాయిలను మరో రకంగా చేస్తుంది. ఈ మార్పులు చక్కగా చూపించారు కోర్ట్ చిత్రంలో. అలాగే ఇంటింటిలో ఉండే మంగపతిల స్వభావం కూడా. అయితే అబ్బాయిలు, అమ్మాయిలు ఈ సినిమాలో చూపించినంత అమాయకంగా, మంచి విలువలతో ఉంటారా ఈ కాలంలో అనేది ఒక ప్రశ్న.

కానీ కథాకాలం పన్నెండేళ్ల ముందు కాబట్టి ఎక్కువ ఆలోచించకూడదు. తెలిసీ తెలియని వయసులో చేసే తప్పులు భవిష్యత్తును ఎలా నాశనం చేస్తాయో ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు కలసి చూడాల్సిన సినిమా. హీరో నాని అభిరుచికి, ధైర్యానికి అభినందనలు. మరిన్ని ఇటువంటి మంచి సినిమాలకు ప్రేరణగా నిలుస్తుంది ఈ కోర్టు చిత్రం. దర్శకుడు రామ్ జగదీష్ కి ప్రత్యేక అభినందనలు.

తొలిప్రయత్నమైనా చక్కగా తీసినందుకు. భారీ దర్శకుడిగా పేరు రావాలనే తపన లేకపోతే మరిన్ని మంచి చిత్రాలు ఇతనినుంచి ఆశించవచ్చు. నటీనటులు, ముఖ్యంగా ప్రియదర్శి, సాయికుమార్, శివాజీ, రోషన్, శ్రీదేవి ప్రశంసనీయులు. ఏది ఏమైనా ఇన్నాళ్ళకి ఇతరభాషా చిత్రాలతో పోటీపడగల తెలుగు సినిమా వచ్చినందుకు సంతోషం. ఈ సినిమాలో చెప్పినట్టు ప్రభుత్వమో,స్వచ్ఛంద సంస్థలో పూనుకుని అందరికీ చట్టాల పట్ల అవగాహన కలిగిస్తే ఎన్నో నేరాలు తగ్గుతాయి.

-కె.శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్