తెలుగు సినిమా అంటే- ఎనభైకి దగ్గరున్న ముత్తాత హీరో…ఇంటర్ సెకండియర్ వయసు హీరో ఇన్ తో ఘాటు ప్రేమలో నాటు పాటలు పాడుకోవాల్సిన ముతక కథలే ఉంటాయి. హీరో నంద్యాల పట్టణం పట్టాలమీద తొడగొడితే…ఆ శబ్ద ప్రకంపనకు భూమి కంపించి…రైలు నాగర్ కోయిల్ దాకా వెనక్కు దానంతటదే వెళ్ళే హీరోచిత సందర్భాలే ఉంటాయి. హీరో కత్తి పడితే సొరకాయలు తరిగినట్లు విలన్ల తలలు పరపరా తెగుతూనే ఉంటాయి. కత్తితో చంపడమే చూడలేని ప్రేక్షకుల కళ్ళకు హీరో కంటిచూపుతో చంపే దృశ్యాలు కూడా తోడవుతాయి. హీరో తాతలు తాగిన నేతుల మూతుల వాసనల డైలాగులే ఉంటాయి. పాటల్లో హీరోను ఆకాశానికెత్తలేక రచయితలు పాతాళం లోతుల్లో పదాలకోసం గునపాలతో తవ్వుతూ ఉంటారు. సకల శాస్త్రాలు చదివిన దర్శకులు వాటిని హీరోలో మనకు చూపించడానికి పడే కష్టం పగవాడికి కూడా వద్దు. హీరోయిన్ పాటలప్పుడు ఐటెంగా అసందర్భంగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. విదేశం నుండి సొంత విమానం వేసుకుని మేఘాల్లో వచ్చి…వాలి…పెంటపాలెం పెంట ఎత్తేసి తారు రోడ్డు వేసే అభ్యుదయభావాల హీరో కథలే ఉంటాయి. కథ హీరో చుట్టూ తిరగలేక తనను తాను రద్దు చేసుకుంటూ ఉంటుంది. హీరోయే కథ. హీరోయే కథనం. హీరోయే దర్శకుడు. హీరోయే రచయిత. హీరోయే సంగీత దర్శకుడు. హీరోయే సకలం. అలాంటప్పుడు మంచి కథలు రావాలి; సమకాలీన సామాజిక సమస్యలమీద సినిమాలు రావాలి అనుకోవడమే పెద్ద సాహసం.
ఇలాంటి నేపథ్యంలో తెలుగులో కోర్ట్ సినిమా కథ రాసుకుని, తొలిసారి దర్శకత్వం వహించిన రామ్ జగదీష్ ను, ఇలాంటి కథమీద డబ్బులు పెట్టిన నిర్మాత నానీ(నటుడు)ని అభినందించాలి. కథలో పాత్రగా ఒదిగిపోయి…ప్రియదర్శి, శివాజీ పోటీపడి నటించారు. హర్షవర్ధన్, సాయికుమార్ లు కూడా మెప్పించారు.
మలయాళంలో ఇలాంటి కథ ప్రధానమైన సినిమాలు చాలా వస్తుంటాయి. తమిళంలో ఎంత సైకో ఫ్యాన్స్ వ్యవహారాలున్నా…సామాజిక సమస్యల ఇతివృత్తాలుగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. తెలుగులో ఒకప్పుడు ఉండేవి. తరువాత లేకుండా పోయాయి. శేఖర్ కమ్ముల, క్రిష్ కథాబలంతో నిరూపించుకున్నారు.
పోక్సో చట్టం దుర్వినియోగం కావడంమీద కోర్ట్ సినిమా కథను అల్లుకున్నాడు దర్శకుడు. కథ రాసుకుని ఎంతమందికి వినిపించాడో కానీ…చివరికి ప్రియదర్శి చొరవ తీసుకుని నానీని ఒప్పించడంతో సినిమా తయారయ్యింది.
ఇది సినిమా సమీక్ష కాదు. ప్రశంస, అభినందన. కొత్త నటులు రోషన్- శ్రీదేవిలను హీరో- హీరో ఇన్ అని అనుకుంటే అనుకోవచ్చు. ప్రియదర్శి హీరో అనుకున్నా పరవాలేదు. నిజానికి సగటు హీరో- హీరో ఇన్, విలన్ కొలమానాల్లో చూడకూడని కథ ఇది. కథే హీరో. కథే హీరో ఇన్. కథే విలన్.
ఎవరి పాత్ర ఎంతో అంతలోనే ఉండడం ఇందులో ప్రత్యేకత. పోక్సో పేరిట అక్రమ కేసు, కోర్టు విచారణ, బెయిల్ తిరస్కరణ, లాయర్ల లాలూచి, కృత్రిమ సాక్ష్యాలు సృష్టించడం, తీర్పు అనుకూలంగా రాదేమోనని వాయిదాలు కోరడం…ఇలా సామాన్యులకు అంత సులభంగా అర్థం కాని పోలీసు, న్యాయ పరిభాషను; విచారణ ప్రక్రియను; విచారణలో జరిగే మోసాలను, కుట్రలను కథలో పాత్రలద్వారా, పట్టుసడలని బిగువైన కథనంద్వారా దర్శకుడు చక్కగా చెప్పగలిగాడు. పోక్సోతో పాటు పోలీసు, కోర్టు వ్యవహారాలను ఈ కథకోసం దర్శకుడు బాగా అధ్యయనం చేసినట్లున్నాడు.
చదువుకున్నా…చదువుకోకపోయినా చట్టాలగురించి మాత్రం అందరూ తెలుసుకుని తీరాలి- అన్న ముగింపు వాక్యమే ఈ కథకు మూలాధారం. తెలుసుకోకపోతే జరిగే అనర్థమే మిగతా కథంతా. చిన్న చిన్న పాత్రలు కూడా అత్యంత ముఖ్యంగా కనిపిస్తాయి.
మైనర్ల ప్రేమను, వారు లేచిపోవడాన్ని కోర్ట్ సినిమా కోర్టులో గెలిపించిందని, ఇది ఏ మాత్రం అంగీకారం కాదని కొందరు పెదవి విరుస్తున్నారు. అయితే దర్శకుడి ఉద్దేశం అది కాదు. పోక్సో చట్టం దుర్వినియోగం కావడాన్ని చూపించడానికి ఆ సన్నివేశాలు తప్పలేదు- అనుకోవాలి.
ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తే మన సమస్యలకు పరిష్కారాలు చూపే మరిన్ని సినిమాలు వస్తాయి. లేకపోతే మనలో సైకోలను వెలికితీసే సైకోఫ్యాన్స్ సినిమాలు మాత్రమే వస్తాయి.
స్టేట్ వర్సెస్ నోబడీలో నోబడీని విడిపించి…గెలిపించిన నిర్మాత నానీ, రచయిత- దర్శకుడు రామ్ జగదీష్, నటులు ప్రియదర్శి, శివాజీ, హర్షవర్ధన్, సాయికుమార్ లకు వెయ్యాలి రెండు వీరతాళ్ళు.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు