Wednesday, April 16, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనిత్యానంద భూ కైలాసం

నిత్యానంద భూ కైలాసం

ఆనందం ఎన్ని రకాలు? వాటి స్వరూప, స్వభావాలు ఎలా ఉంటాయి? ఆనందం భౌతికమయినదా? మానసికమైనదా? ఆనందం కిలోల్లెక్కన బయట ఎక్కడన్నా సూపర్ మార్కెట్లలో దొరుకుతుందా? ఆనందం, అమితానందం, పరమానందం, బ్రహ్మానందం అన్న ఆనంద పరిభాషల స్థాయుల్లో ఏమేమి తేడాలు ఉంటాయి? ఈ ఆనందాలన్నీ కలగలిపి నిత్యం అలౌకిక ఆధి భౌతిక అతులిత అమేయ మహానంద సంద్రంలో మునిగితేలాలంటే ఏమి చేయాలి? అని కృత యుగంలో మెదలుపెట్టిన ఆనందశోధన త్రేతాయుగంలో అందినట్లే అంది అందకుండా పోయింది. ద్వాపరయుగంలో అందేదే కానీ- కృష్ణుడితో ఆనందరసపిపాసులందరూ ముందే ఒప్పందాలు చేసుకుని ఉండడంవల్ల సామాన్యులకు పిసరంత కూడా ఆనందం అందలేదు.

కలియుగంలో ఆనందానికి నిర్వచనం మారిపోవడంతో ఏది ఆనందమో? ఏది ఆనందం కాదో? తెలియక సామాన్యులు ఆనందం అనుకుని అనుభవిస్తున్నదాన్ని విజ్ఞులు కాదన్నారు. విజ్ఞులు ఆనందం అని చెప్పినది సామాన్యులు అందుకోలేకపోయారు. దీనితో ఆనందం అందని ద్రాక్ష పండు అయ్యింది.

ఇలాంటి అగమ్యగోచర, అస్పష్ట, సందిగ్ధ, ఆనందాన్వేషణ అయోమయ వేళ…
కారు చీకట్లో బస్సు రేఖలా
రైలు చీకట్లో విమానరేఖలా
నిత్యానంద పుట్టుకొచ్చారు.

తమిళ మాతృకతో, కన్నడ స్పర్శతో ఆయన మాట్లాడే ఇంగ్లీషు భాష దానికదిగా ఒక ఆనందసింధువు. ప్రతి మాటా ఒక అమృత బిందువు. కొన్నిచోట్ల ఉచ్చారణకు విలువలేదు. భావ ప్రసారం ప్రధానం. నిత్యానంద ప్రసారం చేసిన ఆనందాన్ని కొలవడానికి కొలమానాలు చాలవు.

అద్వైత పరిభాషలో జీవుడు- దేవుడు ఒకటికావడమే ప్రధానం. అదే బ్రహ్మానందానుభవం. దీని కోసం వసిష్ఠుడు, విశ్వామిత్రుడులాంటివారు వేల ఏళ్లు తపస్సు చేశారు. యుగయుగాలు నిరీక్షించారు. ఇప్పుడు నిత్యానంద ఉదార హృదయంవల్ల, ఆయన ఘోర తపస్సు, మేధో మథనంవల్ల మనందరికీ రెడీ మేడ్ గా నిత్యానందం అందుతోంది. ఆయన ఏర్పాటు చేసిన కైలాసంలోకి మనం బొందితోనే వెళ్ళవచ్చు. నిజానికి ఆయనదొక దేశం కాదు- అదొక లోకం. ఆ లోకం చుట్టూ సూర్యుడు, భూమి మిగతా గ్రహాలు తిరుగుతాయి. మొత్తం ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని రీ రైట్ చేసే పనిలో నిత్యానంద బిజీగా ఉన్నారు. ఆయన కైలాస లోకానికి ప్రత్యేక కరెన్సీ, పాస్ పోర్ట్, వీసాలాంటి సదుపాయాలున్నాయి.

అనుకుంటాం కానీ- లోకంలో పిచ్చి ముదిరి…మెంటల్ డాక్టర్ సర్టిఫికేట్ ఉన్నవారే మెంటల్ హాస్పిటల్లో ఉంటారన్నది సాధారణ సూత్రం. లోకంలో ఎందరో మెంటల్ సర్టిఫికేట్ లేకపోవడంవల్ల బయట ఉండిపోతారు. మెంటల్ అన్నది ఒక స్టేట్. ఒక్కోసారి మెంటల్ ఒక దేశం కూడా కావచ్చు. మెంటల్ వాళ్ళను కలిసినప్పుడు మీకు మెంటల్ అని ఎవరూ అనరు. అనకూడదు. మెంటల్ కు అదొక మర్యాద. గుర్తింపు. హోదా.

నిత్యానంద కైలాసం నుండి నేరుగా…అప్పుచేసి పప్పుకూడు సినిమాలో తెలుగువారు గర్వించదగ్గ అసాధారణ గీత రచయిత పింగళి నాగేంద్రరావు రాయగా, ప్రఖ్యాత హాస్యనటుడు రేలంగి బాబాగా- గిరిజ ఆయన శిష్యురాలుగా నటించి జీవం పోసిన ఈ మరపురాని పాటదగ్గరికి రండి. అక్షరమక్షరం, పదం పదం వినండి. మళ్లీ మళ్లీ వినండి.
విన్నది అర్థమయితే నిత్యానంద కైలాసానికి నిర్వచనం నిచ్చెన దొరికినట్లే!!!

అతడు:-
కాశీకి పోయాను రామా హరి
గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరి
గంగ తీర్థాము తెచ్చాను రామా హరి

ఆమె:-
కాశీకి పోలేదు రామా హరి
ఊరి కాల్వలో నీళ్లండి రామా హరి
మురుగుకాల్వలో నీళ్లండి రామా హరి

అతడు :
శ్రీశైలం వెళ్లాను రామా హరి
శివుని వీభూతి తెచ్చాను రామా హరి
శివుని వీభూతి తెచ్చాను రామా హరి

ఆమె :
శ్రీశైలం పోలేదు రామా హరి
శివుని వీభూతి తేలేదు రామా హరి
ఇది కాష్ఠంలో బూడిద రామా హరి

అతడు :
అన్నమక్కరలేదు రామా హరి
నేను గాలి భోంచేస్తాను రామా హరి
ఉత్త గాలి భోంచేస్తాను రామా హరి

ఆమె :
గాలితో పాటుగా రామా హరి
వీరు గారెలే తింటారు రామా హరి
నేతి గారెలే తింటారు రామా హరి

అతడు :
కైలాసమెళ్లాను రామా హరి
శివుని కళ్లార చూశాను రామా హరి
రెండు కళ్లార చూశాను రామా హరి

ఆమె :
కైలాసమెళితేను రామా హరి
నంది తన్ని పంపించాడు రామా హరి
బాగా తన్ని పంపించాడు రామా హరి

అతడు :
ఆలుబిడ్డలు లేరు రామా హరి
నేను ఆత్మయోగీనండి రామా హరి
గొప్ప ఆత్మయోగీనండి రామా హరి

ఆమె :
ఆ మాట నిజమండి రామా హరి
నేను అందుకే వచ్చాను రామా హరి
నేను అందుకే వచ్చాను రామా హరి”

సందర్భం:-
దక్షిణ అమెరికాలో బొలీవియాలో నిత్యానంద కైలాస దేశం పాతికేళ్ళ లీజుకని భూములు తీసుకుని…అమెజాన్ కార్చిచ్చును ఆపుతామని నమ్మబలికి…తీరా పత్రాల్లో వెయ్యేళ్ళ లీజు అని ఉండేసరికి…కథ అడ్డం తిరిగింది. నిత్యానంద నిత్యచిచ్చు కంటే అమెజాన్ కార్చిచ్చును భరించడమే కోటిరెట్లు నయమన్న క్లారిటీ వచ్చి…లీజును రద్దు చేసుకుని…నిత్యానంద దేశం ప్రతినిధులను మెడపట్టి గెంటేశారు.

ఫలశ్రుతి:-
నిత్యమూ నిత్యానంద అంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నాడో తెలుసుకోవడానికి బొలీవియా ఉదంతం అన్నమంతా ఉడికిందో లేదో పరీక్షించడానికి పట్టుకున్న ఒక మెతుకు ఉదాహరణ- అంతే! జ్ఞానులు ఏదీ నోటితో చెప్పరు. చేసి చూపిస్తారు. మనం అనుసరించాలి- అంతే!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్