Thursday, May 8, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమెడ్ రూమ్ ఇంటి ప్రకటన

మెడ్ రూమ్ ఇంటి ప్రకటన

మాట్లాడే భాషగా తెలుగు ఇప్పటికిప్పుడు అంతరించకపోవచ్చు కానీ, రాసే లిపిగా తెలుగు క్రమక్రమంగా అంతరించిపోయే ప్రమాదం మాత్రం పొంచి ఉంది. దానికి మనమే కారణం. కానీ మనం ఒప్పుకోము.

మాయాబజార్లో పింగళి మాట-
“పెళ్లి చేయమంటే కష్టం కానీ; చెడగొట్టమంటే చిటికెలో పని”-
అన్నట్లు భాషను ఉద్ధరించాలంటే కష్టంకానీ, నాశనం చేయాలంటే చిటికెలో పని.
రండి బాబు రండి!
రండి తల్లీ రండి!
తలా ఓ చెయ్ వేసి తెలుగు లిపిని నామరూపాల్లేకుండా చేద్దాం.
తిలాపాపం తలా కడివెడు పంచుకుందాం.

మన పొరుగున కర్ణాటక సముద్రతీరం మంగళూరు-ఉడిపి ప్రాంతాల్లో తుళు మాట్లాడతారు. తుళు ప్రత్యేక భాషే అయినా, కోటి మందికి పైగా తరతరాలుగా మాట్లాడుతున్నా ఇప్పుడు లిపి లేదు. కన్నడ లిపిలోనే తుళు భాషను రాయాలి. నిజానికి ఆరు వందల సంవత్సరాల క్రితం వరకు తుళుకు ప్రత్యేక లిపి ఉండేది. అనేక కారణాల వల్ల లిపి అంతరించిపోయింది. కృష్ణదేవరాయల మాతృభాష తుళు. తుళు తన సొంత లిపిని మరచిపోయి, కన్నడ లిపిలోకి కుచించుకుపోయినట్లు- మన తెలుగు లిపి కూడా ఇంగ్లీషులోకి కుచించుకుపోయి సొంత లిపిని పూర్తిగా మరచిపోయే రోజులు ఎంతో దూరంలో లేవు.Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv

ఒక లిపి ఏర్పడడానికి వేల ఏళ్ల సమయం పడుతుంది. మొనదేలిన రాయి ప్రవాహంలో ఒరుసుకుని, ఒరుసుకుని నున్నగా, గుండ్రంగా తయారయినట్లు తెలుగు లిపి కూడా గుండ్రంగా, అందంగా ఏర్పడింది. నవ్వుతున్నట్లు ‘అ’అక్షరం ఎంత అందంగా ఉంటుంది? పురి విప్పిన నెమలిలా ‘ఖ’ఉంటుంది. కీర్తికి పెట్టిన కిరీటంలా ‘గ’ ఉంటుంది. బుగ్గన సొట్టలా ‘ఠ’ ఉంటుంది. రాయంచలా ‘హ’ ఉంటుంది. తెలుగు వర్ణమాల అచ్చులు, హల్లుల అందం, అవి ఏర్పడ్డ పద్ధతి మనకు పట్టని పెద్ద గ్రంథం. భాషకు శాశ్వతత్వం ఇచ్చేది, తరతరాలకు భాషను అందజేసేది లిపి. మాట్లాడే మొత్తం భాషకు ఒక్కోసారి లిపి చాలకపోవచ్చు. తెలుగులో దాదాపుగా మాట్లాడే భాషకు తగిన, బాగా దగ్గరయిన వర్ణమాల ఉంది. అంత నిర్దుష్టమయిన, నిర్దిష్టమయిన లిపి తెలుగుకు ఉంది. ముత్యాల్లాంటి, రత్నాల్లాంటి తెలుగు అక్షరాలు మనకెందుకో వికారంగా కనిపిస్తాయి. అసహ్యించుకోవాల్సినవిగా అనిపిస్తున్నాయి. వాడకూడనివిగా అనిపిస్తాయి.

తెలుగు భాష అవసరాలకే అయినా తెలుగు లిపిలో రాయడం తక్కువతనంగా అనిపిస్తుంది. తెలుగుకు తెలుగు లిపే అంటరానిదిగా అవుతోంది. తెలుగును ఇప్పుడు ఇంగ్లీషులో రాయడం ఫ్యాషన్. మర్యాద. ట్రెండ్.

తెలుగు భాషను తెలుగు లిపిలోనే రాసే మైనారిటీ జాతి మీద భవిష్యత్తులో దాడులు జరగకుండా గట్టి భద్రత కల్పించాలేమో!

సందర్భం:-
24-04-25 గురువారం ప్రధాన పత్రికల్లో ఫస్ట్ పేజీ రంగుల ప్రకటన. పెద్ద రియలెస్టేట్ కంపెనీ ప్రకటన కాబట్టి పేరున్న యాడ్ ఏజెన్సీ ఆ ప్రకటనలను డిజైన్ చేసి, వారే పత్రికలకు విడుదల కూడా చేసి ఉంటారు.

“LUXURY MOVES UP A LEAGUE
IN CENTRAL HYDERABAD
5 minutes from Mehdipatnam
10 minutes from ORR”

-అని ఇంగ్లిష్ పత్రికలో ఉన్న యాడ్ తెలుగు పత్రికలో-

“లగ్జరీ మూవ్స్ అప్ ఎ లీగ్
సెంట్రల్ హైదరాబాద్ లో
మెహిదీపట్నం నుండి 5 నిమిషాలు
ORR నుండి 10 నిమిషాలు”

-అని తాటికాయంత అక్షరాల్లో ఉంది. ఈ అనువాద ప్రకటన మనముందు అనేక సందేహాలను లేవనెత్తుతోంది.

  • LUXURY MOVES UP A LEAGUE అన్నది తెలుగులోకి అనువదించడం కుదరలేదా? అనువదించకూడని విషయమా?
  • లగ్జరీ మూవ్స్ అప్ ఎ లీగ్ అన్న మాటను ఒట్టి తెలుగు మీడియం మాత్రమే తెలిసిన తెలుగువారు ఎలా అర్థం చేసుకోవాలి?
  • గ్రేట్ టెల్గూ పత్రికల్లో గ్రేట్ టెల్గూ పాఠకులకోసం ఇలా గ్రేట్ టెల్గూ లగ్జరి మూవ్స్ అప్ ఎ లీగ్ అయితే…పాఠకుడు మూవ్స్ అప్ అయి ఆ ఆకాశహర్మ్య లాంగ్వేజ్ లగ్జరీని ఎప్పటికి అందుకోగలడు?

కొస మెరుపు:-
“మన్ హట్టన్ స్టయిల్డ్ అపార్ట్ మెంట్స్”; “ఫ్లోర్ విల్లాస్”; “మెడ్ రూమ్”తో ఉన్న ఇళ్ళు కొనే సంపన్నులకు ఇలాంటి టార్గెట్టెడ్ తెలుగే ఉండాలని ఉద్దేశపూర్వకంగా సంకర నవనాగరిక తెంగ్లీష్ భాషను ఉపయోగించి ఉంటే…ఈ యాడ్ తయారుచేసినవాడిని వెతికి “ఉచితరీతిన” సన్మానించాల్సిందే!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్