Friday, May 2, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమైక్రోసాఫ్ట్ టు పొటాటో బిజినెస్

మైక్రోసాఫ్ట్ టు పొటాటో బిజినెస్

మనకో పదెకరాలు సారవంతమైన భూమి ఉండి, పట్నంలో ఉద్యోగం ఉంటే ఏం చేస్తాం? మంచి రేటుకు భూమి అమ్మేసి సిటీలో పక్షి గూడు లాంటి అపార్ట్మెంట్ కొనుక్కుంటాం. ఆపైన పిట్టలు వాలని ఆకాశ హర్మ్యాలు చూస్తూ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ చిన్నప్పుడు చెరువులో కొట్టిన మజా లేదే అనుకుంటాం. బియ్యం కొనుక్కున్న ప్రతిసారీ అమ్మేసిన పొలం కళ్ళ ముందు మెదులుతుంది. మరికొన్ని చోట్ల అభివృద్ధి పేరిట పొలాలు తీసుకుని పరిశ్రమలు పెడుతున్నారు. మరి అలా పరిశ్రమలు పెట్టిన మారాజులు బాగా సంపాదించాక ఏం చేస్తారు? ఆ సంపదను వందరెట్లు చేసే వ్యాపారం కోసం చూస్తారు. కానీ బిల్ గేట్స్ అలా కాదు. ప్రపంచాన్ని మైక్రోసాఫ్ట్ ద్వారా సాఫ్ట్వేర్ గుప్పెట్లోకి తెచ్చిన ఈ మేధావి తన పెట్టుబడులు వ్యవసాయంలో పెట్టాడు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

అమెరికా వ్యాప్తంగా అక్షరాలా 2,75,000 ఎకరాల్లో జరిగే వ్యవసాయంలో బిల్ గేట్స్ పెట్టుబడి పెట్టాడు. వాటిలో వాషింగ్టన్ స్టేట్ లో ఉన్న గేట్స్ వ్యవసాయభూముల్లో బంగాళాదుంపలు పండిస్తారు. వీటిని మెక్ డొనాల్డ్స్ కి సరఫరా చేస్తారు. అక్కడ కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్ తయారవుతాయన్నమాట.
ఇలా బంగాళాదుంపలు సప్లై చేసినందుకు బిల్ గేట్స్ కి మెక్ డొనాల్డ్స్ వాళ్ళు గోల్డ్ కార్డు ఇచ్చారు. దాంతో ప్రపంచం లోని ఏ మెక్ డొనాల్డ్స్ బ్రాంచ్ లో అయినా గేట్స్ కి మీల్స్ ఉచితం. వారెన్ బఫెట్,నటుడు రాబ్ లోవె వంటి ఎంపిక చేసిన కొద్దిమంది ప్రముఖులకు ఈ గోల్డ్ కార్డ్ ప్రత్యేకం సుమా!

ఏదేమైనా వ్యవసాయం, ఆతిథ్యం వంటి రంగాలకు టెక్నాలజీని జోడిస్తూ భిన్నరంగాల్లో వ్యాపారాన్ని విస్తరిస్తున్న గేట్స్ దూరదృష్టిని అభినందించాల్సిందే. ఎన్ని కోట్లు ఉన్నా కడుపుకు తినేది అన్నమే( వారి వారి అలవాట్లని బట్టి). అటువంటి ఆహారం దొరకనప్పుడు ఎంత సంపద ఉండి ఏం లాభం? ఈ విషయం అర్థమైతే అడ్డగోలుగా పంటలు పండే భూముల అమ్మకం తగ్గుతుందేమో!

-కె . శోభ

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్