Park denies entry to unmarried couples
ఏమన్నా అంటే ఎక్కడలేని పౌరుషం పొడుచుకొస్తుంది.
మన నలుపు మనం చూసుకోడానికి ఇష్టపడని గురివిందలం.
మన దగ్గర తుపాకులు తేకపోవచ్చు.
నడిరోడ్డు మీద కాల్చేయకపోవచ్చు.
ప్రభుత్వాలను కూల్చేయకపోవచ్చు.
అధికారం స్వాధీనం చేసుకోకపోవచ్చు.
కానీ, అధికారంలో వున్నవాళ్లు మనవాళ్ళే అనుకుంటే..
మనలో కూడా మారువేషంలోని తాలిబాన్ నిద్ర లేస్తాడు.
ఇది మన చరిత్రలో వుంది.
మన వర్తమానంలో వుంది.
మన భవిష్యత్తులో కూడా వుంటుంది.
పెళ్ళికాని జంటలకి పార్క్ లోకి ప్రవేశం లేదు.
హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ఒక పార్క్.
ఆ పార్క్ ముందు వెలిసిన హెచ్చరిక ఇది.
మెట్రోపాలిటన్ నగరం అని చెప్పుకుంటుంది ప్రభుత్వం.
నగరంలోకి ప్రపంచాన్ని రెండు చేతులా ఆహ్వానిస్తారు.. ప్రభుత్వ పెద్దలు.
కానీ ఇక్కడి పార్కుల బయట ఇనుపగేట్లే కాదు.
పార్కుకి నిర్వాహకుల మనసుల్లో ఇనుపకచ్చడాలు కూడా వున్నాయి.
పెళ్ళికాని జంటలకి అనుమతి లేదంటే,
దానర్థం ఏంటో అసలు ఆలోచించారా!
ఆడ, మగ అంటే అయితే భార్యాభర్తలుగా వుండాలి.
లేదా అక్రమసంబంధంలో అయినా వుండాలి.
ఒక స్త్రీ , మగాడితో కలిసి వస్తుందంటే, ఆయితే భార్య అయివుండాలి.
లేదా వాళ్లిద్దరూ ఏ అరాచకం చేయడానికో వస్తూ వుండాలి.
ఇదే జిహెచ్ ఎమ్ సి పెద్దల అవగాహన
అందుకే పెళ్ళయిన వాళ్ళనే అనుమతిస్తామని ఫత్వా జారీ చేసారు.
గేటు బయట మ్యారేజి సర్టిఫికేట్ చూపించి లోపలికి వెళ్లాలా అని ఈ బోర్డుచూసిన వాళ్ళకి సందేహం వచ్చింది.
సందేహం మాట అలా వుంచుదాం.
Ridiculous Restrictions For Park Entry :
ఈ నోటీసు ని చాలా మంది వ్యతిరేకించారు.
సాయంత్రానికి జి హెచ్ ఎమ్ సి కి బుద్ధొచ్చి దాన్ని తొలగించింది..
కానీ, బోర్డు తీసేసినంత తేలిక కాదు,
మన మనసుల్లో తాలిబానిజాన్ని తీసేయడం.
ఫేస్ బుక్కుల్లో ఈ బోర్డుని గట్టిగా సమర్ధించిన వాళ్లలో ..
పైకి ఏం అనకపోయినా, లోపల్లోపల తప్పేముందని అనుకుంటున్న వాళ్లలో.
పార్కులో అరాచకాలు మీరు చూస్తే తెలుస్తుంది.. అని ఎదురు ప్రశ్నించే వాళ్లలో
తుపాకి పట్టని తాలిబన్లని మనం స్పష్టంగా పోల్చుకోవచ్చు.
ఇప్పుడంటే ప్రభుత్వం కాస్త వేగంగా స్పందించింది.
కానీ, ఇలాంటి మారువేషం తాలిబాన్లని ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్టు వదిలేసే సందర్భాలు ఎన్నో.
పరోక్షంగా మద్దుతు ఇచ్చే సందర్భాలు ఇంకెన్నో.
ఫిబ్రవరి పద్నాలుగొస్తే చాలు..చేతిలో తాళిబొట్లతో చెలరేగిపోయేవాళ్లు.
గోరక్షణ పేరుతో ఢిల్లీ వీధుల్లో మనుషుల ప్రాణాలు తీసిన వాళ్లు..
మతం పేరుతో సినిమాల మీదా, సాహిత్యం మీదా దాడులు చేసేవాళ్లు..
కవులు, కళాకారుల లక్ష్యంగా వివిధ సోషల్ మీడియా వేదికలపై విషప్రచారానికి దిగే వాళ్లు..
పరమత ఆచారలన్నీ దేశద్రోహాలే అని ప్రచారం చేసేవాళ్ళు..
మతాంతర ప్రేమల్లో కూడా ఉగ్రవాదాన్ని చూసేవాళ్ళు..
ఈ దేశం ఒక మతానికే చెందిందని నమ్మేవాళ్లు.. నమ్మించే వాళ్లు,
అమ్మాయిల వస్త్రధారణే వాళ్ళపై అత్యాచారలకు కారణమని ప్రకటించేవాళ్లు,
వీళ్లంతా ఎవరు?
తుపాకీ పట్టని తాలిబాన్లు కాదా?
మతం మత్తు తలకెక్కి,
ప్రభుత్వాల మద్దతు మెదడుకెక్కి
చెలరేగిపోయే నయా ఉగ్రవాదులు కారా?
-కే.శివప్రసాద్
Also Read: లైఫ్ లో లైఫ్ ట్యాక్స్ కట్టం
Also Read: ఇమేజ్ చట్రంలో