మన దేశంలో వైద్యం అంటే కేవలం స్టెతస్కోప్ గుండె మీద పెట్టడం కాదు, రోగి గుండె చప్పుడును పట్టుకోవడం. కానీ దురదృష్టం ఏంటంటే… ఈ రోజుల్లో చాలా మంది డాక్టర్లకు రోగి చెప్పే ‘బాధ’ కంటే, ఆ రోగి వాడే ‘భాష’ అర్థం కాక తెల్లముఖం వేయాల్సి వస్తోంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (IJMR) బయటపెట్టిన తాజా వాస్తవాలు వింటే.. వైద్య రంగంలో మనం ఇంకా ఎంత వెనుకబడి ఉన్నామో అర్థమవుతుంది.
అది మందు కాదు.. మృత్యుపాశం కావొచ్చు!
కర్ణాటకలోని మెడికల్ కాలేజీల్లో జరిగిన సర్వేలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 26 శాతం మంది వైద్య విద్యార్థులకు తాము పనిచేసే ప్రాంతపు స్థానిక భాష రాదు. ఇది వినడానికి చిన్న సమస్యలా అనిపించవచ్చు కానీ, ప్రాణాల మీదకు వస్తే ఇది ఎంత ప్రమాదకరమో ఊహించండి.

“రోగి తన కడుపులో నొప్పిని ‘నలతగా ఉందనో’, ‘మంటగా ఉందనో’ తన యాసలో చెబితే.. అది అర్థం చేసుకోలేని డాక్టర్ రాసే మందు ‘సంజీవని’ ఎలా అవుతుంది?”
భాషా సమస్యవల్ల పొంచి ఉన్న మూడు ప్రమాదాలు:-
- నమ్మకం పునాది లేదు: 90 శాతం మంది విద్యార్థులు ఒప్పుకున్న చేదు నిజం ఏంటంటే.. రోగి మాతృభాషలో మాట్లాడకపోతే, ఆ రోగికి డాక్టరుపై నమ్మకం కలగడం లేదు.
- వ్యాధి నిర్ధారణలో వైఫల్యం: రోగి తన బాధను పూర్తిగా వెళ్లగక్కలేకపోవడం వల్ల, డాక్టర్లు రోగ మూలాలను పట్టుకోలేక తడబడుతున్నారు.
- డాక్టర్లకూ టెన్షనే: భాష రాక 75 శాతం మంది మెడికోలు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

‘గూగుల్’ పదాలను ఇస్తుంది…ప్రాణాలను కాదు!
ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో ‘ట్రాన్స్లేటర్’ యాప్స్ ఉన్నాయి కదా అని కొందరు వాదించవచ్చు. కానీ సాంకేతికత అక్షరాలను మారుస్తుంది కానీ, ఆ మాట వెనుక ఉన్న ఆవేదనను కాదు. రోగి కళ్లలోని భయం, వణుకుతున్న గొంతులోని ఆందోళన ఏ యాప్కూ అర్థం కావు. అనువాదకుల ద్వారా మాట్లాడిస్తే ఆత్మీయత ఆవిరైపోతుంది.. కేవలం ‘బిజినెస్’ మిగులుతుంది.
నిపుణుల సూచన-శిక్షణ తప్పనిసరి
అందుకే మెడికల్ కౌన్సిల్ కళ్లు తెరవాలి. ఎంబీబీఎస్ చదువుతున్న ఐదేళ్లూ స్థానిక భాషపై శిక్షణ ఇవ్వడం ఒక ఆప్షన్ కాదు.. అది ఒక తప్పనిసరి అవసరం కావాలి.

