Friday, September 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతుపాకి రాజ్యం

తుపాకి రాజ్యం

Taliban Announces New Afghanistan Govt :

కాంధహార్ కొండల్లో భయం భయంగా సూర్యుడు నిద్ర లేచి, ఒళ్లు విరుచుకోవాలా వద్దా అని ఎరుపెక్కిన మొహంతో ప్రశ్న కిరణాన్ని ఆకాశంలో విసిరేశాడు. అక్కడే గుహల్లో, గుహల బయట, వాగుల్లో, వంకల్లో ఉన్న తాలిబన్ వేగులు ఆ ప్రశ్నను తమ సుప్రీం కమాండర్ కు నివేదించారు. ఆయన సాలోచనగా గడ్డం దువ్వుకుని, తలపాగా సవరించుకుని, భుజం మీద దుప్పటిని దులుపుకుని- ఈ పూటకు సూర్యుడిని ఆకాశంలో వదిలేయండి. కానీ సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకంతా వెళ్లిపొమ్మని చెప్పండి. మధ్యాహ్నం మనకు ఒక చీకటి ఒప్పందం ఉంది- అన్నాడు. వేగులు సూర్యుడికి ఈ విషయం చేరవేశారు. సగం రోజుకు ప్రకాశించమని పర్మిషన్ ఇచ్చినందుకు సంతోషం సగం బలమయిన సూర్యుడు ఆ మేరకు ఆకాశానికి ఎగబాకుతూ…దినకరుడినయిన నాకే ఈ దిన దినగండం ఏమిటో అని దిగులు కిరణాలతో బాధపడుతూ మొహం మాడ్చుకున్నాడు. అయినా తప్పదు కాబట్టి డ్యూటీలోకి దిగాడు.

ఈలోపు మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ముందే విధించిన షరతు ప్రకారం ఆకాశంలో సూర్యుడు అదృశ్యం. చీకటి ఒప్పందానికి పొరుగు దేశాలనుండి విమానాల్లో వచ్చినవారందరూ తుపాకులు పేలుస్తూ, బాంబులు విసురుతూ కోలాహలంగా వస్తున్నారు.

కొండల్లో ఈగలు, దోమలు విసురుకుంటూ చీకటి మీటింగ్ ఎందుకని అప్పటికప్పుడు మీటింగ్ ప్లేస్ ను కాబుల్ ప్రధాని కార్యాలయానికి మార్చారు. అక్కడ ఉండాల్సిన ప్రధాని ఎప్పుడో పలాయనం చిత్తగించి ఉన్నాడు. వచ్చిన చీకటి మీటింగ్ పెద్దలందరికీ ఆఫ్ఘన్ దానిమ్మ రసాలు (ఆఫ్ఘన్ దానిమ్మ చిన్న సైజు గుమ్మడి కాయంత ఉండి, ఒక కాయ నుండి ఒక లీటర్ రసం వస్తుంది) బాదం పప్పులు, ఖర్జురాలు సరఫరా చేశారు. ఒక్కొక్కరు తుపాకులు ఒళ్లో పెట్టుకుని రెండు కిలోల బాదం పప్పు, మూడు కిలోల ఖర్జురం తిని, నాలుగు లీటర్ల దానిమ్మ రసం తాగి…ఒకసారి త్రేన్చి…తృప్తిగా గాలిలోకి అయిదు రౌండ్లు కాల్పులు జరిపి చర్చలు మొదలు పెట్టారు. ఎవరు ఏలాలి రాజ్యాన్ని అన్న విషయం మీద ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పేపర్ మీద కొన్ని పాయింట్లు రాసుకున్నారు. భారత్ ఐ ఐ టీ ప్రవేశ పరీక్ష అడ్వాన్స్ డ్ ఒక్కటే భూప్రపంచంలో కష్టతరమయినది అని తెలియడంతో అదే పద్ధతిలో ఎవరికి ఎక్కువ పర్సెంటేల్ వస్తే వారే ప్రధాని కావాలని స్థూలంగా ఒక చీకటి ఒప్పందానికి వచ్చారు.

ఆ పర్సెంటేల్ కు ప్రాతిపదికలు ఇవి:-

# అంతర్జాతీయ విమానాలను హైజాక్ చేసిన సాంకేతిక అనుభవం.

# ప్రతి వారం ఒక మానవబాంబును పేల్చిన సౌకుమార్యం.

# విదేశాల్లో విధ్వంసం చేసిన సహృదయత.

# అంతర్జాతీయ జర్నలిస్టుల మెడలు నరికిన ఔదార్యం.

# లక్షల ఎకరాల్లో ఓపియం, గంజాయి సాగుచేసిన వ్యావసాయిక నైపుణ్యం.

# నకిలీ నోట్ల ముద్రణ, హవాలా ఆర్థిక మెళకువలు.

# పిల్లా పాపా, ఆడా మగా తేడా చూడకుండా తూటాకొక ప్రాణాన్ని లేపిన దయార్ద్రత.

# మహిళలను మనుషులుగా గుర్తించని సమదృష్టి.

# పాతరాతి యుగం పాలనతో శిలాక్షరాలతో చరిత్రను తిరగరాయగల చారిత్రక దృక్కోణం.

# సంస్కారాన్ని భూమి లోపలి పొరల్లో అట్టడుగు శిలాజాల దాకా తీసుకు వెళ్లగలిగిన పురావస్తు విజ్ఞానం.

# స్పేస్ లో కాపురం ఉండదగ్గ ఈ ఆధునిక యుగంలో తరగతి గదుల్లో అడ్డుగోడల పరదాలు కట్టగల విశాల హృదయం.

# ప్రపంచం ఏమనుకుంటుందన్న స్పృహ లేని తోలుమందం చర్మం.

అందరూ ఈ పాయింట్లకు తగిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేలోపే పొరుగున పచ్చటి ఆకాశంలో వెలిగే సగం చంద్రుడు పాక్కుంటూ అక్కడికి విచ్చేశాడు. అందరి పేపర్లను పరిశీలనగా చూసి…అందరితో విడి విడిగా, కలివిడిగా చీకటి మీటింగులు పెట్టాడు.

ఇప్పటిదాకా చేసినవి డాక్యుమెంట్లుగా ఇచ్చారు. ఇకపై చేయబోయేవి డాక్యుమెంట్ గా ఇచ్చినవాడు ఒకడే ఉన్నాడు. నివార్య కారణాల వల్ల అతడినే ప్రధానిని చేయాల్సివస్తోంది అని ప్రకటించగానే మిగతావారందరూ పాక్ కుంటూ వెళ్లిపోయారు.

తుపాకి రాజ్యం కాబూల్ వీధుల్లో మాటకొక తూటాగా నర్తించింది. ప్రజాస్వామ్యం కాంధహార్ కొండల్లోకి పలాయనం చిత్తగించింది.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: ఆఫ్ఘన్ పాపంలో ఎవరి వాటా ఎంత?

Also Read: విమానాల మానం తీసిన తాలిబన్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్