బిజెపి అధికారంలోకి వచ్చాక దేశంలో మతపరమైన దాడులు పెరిగాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. దీంతో దేశంలో లౌకికవాదం బలహీన పడుతోందన్నారు. ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి నగరంలో జరిగిన మజ్లీస్ పార్టీ సమావేశానికి ఒవైసీ హాజరయ్యారు. బిజెపి అరాచాకాల్ని ప్రశ్నించాల్సిన సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు చోద్యం చూస్తున్నాయని మండిపడ్డారు.
కేంద్రంలో బిజెపి తీసుకోస్తున్న ప్రజావ్యతిరేక చట్టాల్ని అఖిలేష్, మాయావతి లు అడ్డుకోవటం లేదని ఒవైసీ ఆరోపించారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం(UAPA) తీసుకురావటం ద్వారా ఉత్తరప్రదేశ్లో అనేక మంది అమాయకులను వేధిస్తున్నా SP, BSP పార్టీలు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ చట్టం తో దళితులు, ముస్లింలను టార్గెట్ చేసుకొని కక్ష సాధింపుగా వాడుకుంటున్నారన్నారు.
బారాబంకిలో మజ్లీస్ బహిరంగ సభకు మొదట జిల్లా అధికార యంత్రాంగం అనుమతి ఇవ్వలేదు. కోవిడ్ నిభంధనల ప్రకారం కేవలం 50 మందితో సమావేశం పూర్తి చేయాలని, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం రెండు గంటల్లోగా పూర్తి చేయాలనే షరతుతో అనుమతి ఇచ్చారు. సమావేశానికి ఒవైసీ రాగానే 50 మంది సమావేశం కాస్తా వేలల్లోకి చేరుకొని బహిరంగ సభగా మారింది.
వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మజ్లీస్ సత్తా చూపెట్టాలనే పట్టుదలతో ఒవైసీ తరచుగా పర్యటన చేస్తున్నారు. ఈ దఫా మూడు రోజుల పాటు యుపీ లో మకాం వేసీ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని నిర్దేశించనున్న్నారు. ఉత్తరప్రదేశ్లో ఈ దఫా జరిగే శాసనసభ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ వంద మంది అభ్యర్థులను రంగంలోకి దించేందుకు ప్రణాలికలు సిద్దం చేసింది.