3.5 C
New York
Monday, December 11, 2023

Buy now

HomeTrending Newsముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన

ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన దాదాపు ఎనిమిది రోజులపాటు కొనసాగి విజయవంతంగా ముగిసింది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ నుండి బయలుదేరి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి , సెప్టెంబర్ 2న ఢిల్లీలోని వసంత్ విహార్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు సహా సీనియర్ కార్యకర్తలు ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఢిల్లీ పురవీధులన్నీ గులాబీ మయమయ్యాయి.

సెప్టెంబర్ 3న ప్రధాని నరేంద్ర మోడీతో సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు. రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని అధికారిక నివాసంలో 50 నిమిషాల పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రధానికి సిఎం వివరించారు. ఇందుకు సంబంధించి అంశాలపై ప్రధానికి లేఖలను అందజేశారు.

వీటిల్లో…

తెలంగాణ రాష్ట్రంలో ఐపిఎస్ క్యాడర్ పై కేంద్రం సమీక్షించాలని, రాష్ట్రంలో సమీకృత టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు, హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులు మంజూరు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచడం, అనే అంశాలున్నాయి. అంతేకాంకుండా.., కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు, హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు, రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు…తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను లేఖల్లో ప్రస్తావించారు.

ఈ భేటీ సందర్భంగా… యాదాద్రి పుణ్యక్షేత్ర ప్రారంభోత్సవానికి రావాలని సిఎం చేసిన ఆహ్వానానికి ప్రధాని వొప్పుకున్నారు. ఢిల్లీలో రాష్ట్ర అధికార భవన్ ‘తెలంగాణ భవన్’ నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని ప్రధానిని సీఎం కోరారు. అందుకు సానుకూలంగా స్పందించారు.

తెల్లారి, సెప్టెంబర్ 4న సీఎం కేసీఆర్ కేంద్ర హాంశాఖామంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలని కోరారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీజోన్లు ఏర్పడ్డాయని, దాంతో పోలీస్ శాఖలోనూ మార్పులు జరిగాయని వివరించారు. పోలీస్ శాఖలో జరిగిన మార్పుల వల్ల సీనియర్ డ్యూటీ పోస్టుల సంఖ్య 75 నుంచి 105కు పెరిగిందని, ఐపీఎస్ కేడర్ పోస్టుల సంఖ్య కూడా 139 నుంచి 195కు పెరిగిందని సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర హోం శాఖా మంత్రి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సెప్టెంబర్ 6న కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించడం, హైదరాబాద్‌-విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిని ఆరు లేన్లుగా అభివృద్ధి చేయడం, హైదరాబాద్‌-కల్వకుర్తి మధ్యలో 765 హైవేను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయడం, పెండింగ్‌ సీఆర్‌ఐఎఫ్‌ నిధులను మంజూరు చేయడం, హైదరాబాద్‌ దక్షిణ ప్రాంత ఎక్స్‌ప్రెస్‌ వేను మంజూరు చేయడంపై గడ్కరీతో చర్చించారు. ఈ ఐదు అంశాలకు సంబంధించి వినతిపత్రాలను సమర్పించారు. కేంద్రం మంత్రి సానుకూలంగా స్పందించారు. అదే రోజు , సోమవారం,కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.

గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 11 ప్రాజెక్టులు కొత్తవి కావని, వాటిని అనుమతులున్న ప్రాజెక్టులుగానే పరిగణించాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రికి వివరించారు. కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దాదాపు గంటా నలభై నిమిషాల పాటు సాగిన చర్చలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాగురించి వాటి చారిత్రక నేపథ్యం అవసరం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరాం తెలంగాణ నివాసి కావడం వలన ఆయనతో పాటు సమావేశంలో పాల్గొన్న జలశక్తి శాఖ కార్యదర్శికీ విషయాలు అర్థమయ్యేట్టు సిఎం కూలంకషంగా వివరించారు.

నిర్దిష్టమైన రుజువులు సమాచారం తో కేంద్ర మంత్రి బృందంతో చర్చించారు. తెలంగాణకు నదీ జలాల విషయంలో ప్రాజెక్టుల అనుమతుల విషయంలో కేంద్రం తీసుకోబోయే నిర్ణయాలు తెలంగాణ రైతన్నకు వ్యవసాయానికి ఎట్లా నష్టం చేస్తాయో సోదాహరణలతో వివరించారు. సిఎం కెసిఆర్ చర్చించిన అంశాలను వాదనలను సానుకూలంగా విన్న జలశక్తిశాఖ మంత్రితో సహా అతనివెంట వున్న అధికారులకు కృష్ణా గోదావరి జలాల వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదనే విషయం అర్థం చేసుకున్నారు.

తన నివాసానికి సిఎం కెసిఆర్ ను సాదరంగా ఆహ్వానించిన కేంద్ర మంత్రి తో గంటన్నరకు పైగా సాగిన చర్చ ఆసాంతం సహృద్భావ వాతావరణంలో సానుకూలంగా సాగింది.

ఈ విధంగా…, రాష్ట్రానికి సంబంధించిన పలు పాలనాపరమైన అంశాలను సమస్యలకు పరిష్కారం సాధించేందుకు ప్రధాని, కేంద్రమంత్రులతో సమావేశమైన సీఎం కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనను విజయవంతంగా పూర్తిచేసుకుని సెప్టెంబర్ 9న తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. సిఎం కెసిఆర్ వెంట ఢిల్లీ పర్యటనలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి వినోద్ కుమార్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ , టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరులున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్