విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ)లో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్ గురువారం నుంచి తన సేవలు ప్రారంభించనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్‌మెన్, యూఎస్ ఎయిడ్ ఇండియా డైరెక్టర్ వీణా రెడ్డి, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి పాల్గొంటారు. కార్యక్రమ ఏర్పాట్లను ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద రెడ్డి అమెరికన్ కాన్సులేట్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు.