ఉగ్రవాద నిర్మూలన, సైబర్ క్రైం కట్టడి చేసేందుకు రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని అమెరికా, ఇండియా నిర్ణయించాయి. ఇండో – పసిఫిక్ ప్రాంతంలో రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని రెండు దేశాలు అవగాహనకు వచ్చాయి. అమెరికా పర్యటనలో భాగంగా ఈ రోజు వాషింగ్టన్ లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హర్రిస్ – ప్రధానమంత్రి నరేంద్రమోడి భేటి అయ్యారు. ఈ సందర్భంగా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవటంలో ఇండియా తెగువ అభినందనీయమని కమల హర్రిస్ ప్రశంసించారు.
కరోనా బాధితులను ఆదుకునేందుకు టీకా ఎగుమతి చేయటం, అనతి కాలంలోనే భారతదేశ జనాభాలో ఎక్కువమందికి వ్యాక్సిన్ ఇవ్వటం గొప్ప విషయమని కమల హర్రిస్ అభినందించారు. దౌత్య సంబంధాలు బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతు, అంతర్గత భద్రతకు పరస్పర సహకారం, టెర్రరిజం సవాళ్ళను ఎదుర్కునేందుకు కలిసి ముందుకు వెళ్లాలని నేతలు తీర్మానించారని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి.
భారతీయ మూలాలు ఉన్న మహిళ అగ్ర దేశ ఉపాధ్యక్షురాలు కావటం సంతోషకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కమల హర్రిస్ కు శుభాకాంక్షలు తెలిపారని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్ల వెల్లడించారు. అంతరిక్ష రంగంలో రెండు దేశాలు కలసికట్టుగా ముందుకు వెళ్లాలని, ఇండో – పసిఫిక్ ప్రాంతంలో సహకరించుకోవాలని అవగాహనకు వచ్చినట్టు శ్రింగ్ల చెప్పారు.