ఐపీఎల్ లో నేడు జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి బంతికి కోల్ కతా నైట్ రైడర్స్ పై విజయం సాధించింది.
అబుదాబీ లోని జయేద్ క్రికెట్ స్టేడియంలో నేడు జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా కెప్టెన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 10 పరుగుల వద్ద ఓపెనర్ శుభమన్ గిల్ రూపంలో కోల్ కతా మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్, రాహూల్ త్రిపాఠి రెండో వికెట్ కు 40 పరుగులు జోడించారు. రాహూల్ 33 బంతుల్లో 4 ఫోర్లు,1 సిక్సర్ తో 45; నితీష్ రానా 27 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్సర్ తో 37; దినేష్ కార్తీక్ 11 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ తో 26 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, జోష్ హజెల్ వుడ్ చెరో రెండు వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.
చెన్నై తమ ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంభించింది. రుతురాజ్ గైక్వాడ్, డూప్లెసిస్ మొదటి వికెట్ కు 74 పరుగులు జోడించారు. గైక్వాడ్ 28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసి ఔటయ్యాడు. డూప్లెసిస్ 30 బంతుల్లో 7ఫోర్లతో 43 పరుగులు చేశాడు. మొయిన్ అలీ 28 బంతుల్లో 2ఫోర్లు 1సిక్సర్ తో 32 పరుగులు చేశాడు. అ తర్వాత అంబటి రాయుడు, ధోని, రైనా రాణించలేకపోయారు. వరుణ్ చక్రవర్తి వేసిన 18 ఓవర్లో ధోనీ, రైనా ఇద్దరూ అవుట్ కావడంతో చెన్నై పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన ఆల్ రౌండర్ జడేజా తన సత్తా చాటాడు. ప్రసిద్ కృష్ణ వేసిన 19వ ఓవర్లో జడేజా 2 ఫోర్లు, 2 సిక్సర్లతో మెరిపించి ఇన్నింగ్స్ ను ట్రాక్ లోకి తెచ్చాడు. చివరి ఓవర్లో విజయానికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా శామ్ కరణ్, జడేజా ఇద్దరూ ఔటయ్యారు. చివరి బంతికి దీపక్ చాహర్ ఒక పరుగు చేసి చెన్నైకు 2 వికెట్ల విజయాన్ని అందించాడు. కోల్ కతా బౌలర్లలో నరేన్ మూడు వికెట్లు సాధించాడు.
చెన్నై గెలుపులో కీలకపాత్ర పోషించిన జడేజాకు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.