Saturday, April 20, 2024
HomeTrending Newsనోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం: నాని

నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం: నాని

పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, తాట తీస్తామని రాష్ట్ర రవాణా, సమాచార-పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. తమ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న ఏపీ ప్రభుత్వంపై, తనపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై నాని తీవ్రంగా స్పందించారు.  ‘మా’ ఎన్నికల్లో ఓట్ల కోసమే పవన్‌ తాపత్రయపడుతున్నారని ధ్వజమెత్తారు. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కేవలం సిఎం జగన్ పై విషం కక్కడమేనని అయన దుయ్యబట్టారు. పవన్-తాను ఇద్దరం కాపులమేనని, తాను సన్నాసి అయితే పవన్ సన్నాసిన్నర సన్నాసి అవుతాడని తీవ్రంగా మండిపడ్డారు.

తనపై కక్షతో ఏపీ ప్రభుత్వం థియేటర్లను మూసివేయించిందని పవన్‌ చెప్పారని, ప్రస్తుతం ఏపీలో 1050 నుంచి 1100  థియేటర్లు మనుగడలో ఉంటే వాటిలో 800 థియేటర్లలో ఇప్పుడు సినిమాలు ఆడుతున్నాయని, తెలంగాణలో 519కి గానూ 413 థియేటర్లలో మాత్రమే సినిమాలు ప్రదర్శించబడుతున్నాయని నాని వివరించారు.

రాష్ట్రంలో మూడ్రోజుల నుంచి ‘లవ్ స్టొరీ’ సినిమా 510 థియేటర్లలో ఆడుతుందని, మొదటిరోజు అన్ని ఖర్చులు పోను నిర్మాతకు మూడు కోట్ల 88 లక్షల షేర్ వస్తే, అన్ని పరిమితులు ఉన్న తెలంగాణలో మూడు కోట్ల షేర్ వచ్చిందని,  రెండోరోజు నిన్న 2.67 కోట్లు, తెలంగాణాలో 2.49  కోట్లు వచ్చిందని గణాంకాలతో సహా వివరించారు. వకీల్‌సాబ్‌ సినిమాకు ఏపీలో వచ్చిన నిర్మాతల షేర్‌ రూ.50 కోట్లపైనే ఉంటుందని తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ షేర్‌ వచ్చిందని తెలిపారు.

కోడికత్తి కేసును ఎన్ఐఏ, వివేకానంద హత్యకేసును సిబిఐ విచారిస్తున్నాయని వాటికి సంబంధించిన వివరాలు కావాలంటే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను అడిగి తెలుసుకోవాలని సూచించారు.  పవన్‌కు కేంద్రంలో అంత సినిమా లేదని.. అంతా సొల్లు చెబుతారని విమర్శించారు. తాము కష్టపడి వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వానికి డబ్బెందుకు కట్టాలంటూ అయన మాట్లాడుతున్నారని,  ఇదే విషయాన్ని కేంద్రంలో మోడీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్ లను ప్రశ్నించాలని సూచించారు. టాక్స్‌లు, జిఎస్టీ ఎందుకు కట్టాలని దమ్ముంటే కేంద్రాన్ని నిలదీయాలని ఛాలెంజ్ విసిరారు.

ఇది రిపబ్లిక్‌ అఫ్ వైసీపీ కాదని, రిపబ్లిక్ అఫ్ ఇండియా కాబట్టే మీరు ఏం వాగినా చెల్లుతోందని నాని వ్యాఖ్యానించారు, బందరు వచ్చి ఇక్కడి ఎమ్మెల్యే పేరు ఏంటని జనాన్ని అడిగాడని, అంటే తనపై విమర్శలు చేయడానికే వచ్చి తన పేరు తెలియని శుంట అనుకోవాలా అని నిలదీశారు. సాయి ధరమ్ తేజ ప్రమాదంపై తెలంగాణా పోలీసులు చెప్పిన విషయాన్నే మీడియా చెప్పిందని, ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే కేసియార్ ను, తెలంగాణ పోలీసులను నిలదీయాలని నాని సవాల్ చేశారు.

2020 జూన్‌లో సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి సహా సినీ ప్రముఖులు  ఆన్‌లైన్‌ టికెటింగ్‌ పెట్టాలని కోరారని, ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవహారంతో పవన్‌ కల్యాణ్ కు ఏం సంబంధమని నాని ప్రశ్నించారు. ఆన్‌లైన్‌ చేస్తే బ్లాక్‌ మార్కెటింగ్‌, పన్ను ఎగవేతలు తగ్గుతాయని, పారదర్శకత వస్తుందని సినీ ప్రముఖులు చెప్పారని, ఆన్‌లైన్‌ అమ్మకాల కోసం ప్రభుత్వం పోర్టల్‌ ను మాత్రమే నడుపుతుందని నాని స్పష్టం చేశారు. టికెట్లను థియేటర్‌ యాజమాన్యాలే అమ్ముకుంటాయని,  వసూలైన డబ్బును మరుసటి రోజే నిబంధనల ప్రకారం ఎవరి డబ్బు వారికి పంపిణీ అవుతుందని వివరించారు. బ్లాక్‌ టికెట్లు అమ్మి నిర్మాతల ద్వారా నల్లధనం వసూళ్లు తెచ్చి తనకు కట్టాలని పవన్‌ కల్యాణ్‌ కోరుకుంటున్నారా? అని నిలదీశారు. 2013 నాటి రేట్ల కంటే 40 శాతం టికెట్ల ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని మంత్రి గుర్తు చేశారు.

తెలుగు పరిశ్రమకు జగన్ ప్రభుత్వం ఎలా వేధించిందో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు నారాయణ దాస్ నారంగ్ చెప్పాలని నాని విజ్ఞప్తి చేశారు. పవన్ వ్యాఖ్యలపై వారు తప్పకుండా స్పందించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్