Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్-2021 విజేత చెన్నై

ఐపీఎల్-2021 విజేత చెన్నై

ఐపీఎల్ 2021 టైటిల్ ను చెన్నై సూపర్ కింగ్స్ చేజిక్కించుకుంది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 27 పరుగులతో విజయం సాధించి నాలుగోసారి ఐపీఎల్ విజేతగా అవతరించింది.  దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కతా కెప్టెన్ మోర్గాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై ఓపెనర్  డూప్లెసిస్ కీలక మ్యాచ్ లో రాణించి 59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో తోడ్పడ్డాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు.  మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్-32 (27 బంతుల్లో 3ఫోర్లు 1సిక్సర్);  రాబిన్ ఊతప్ప-31(15 బంతుల్లో 3సిక్సర్లు);  మొయిన్ అలీ-37-నాటౌట్ (20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. దీనితో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి  192 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరేన్-2, శివం మావి ఒక వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా జట్టులో ఓపెనర్లు వెంకటేష్ అయ్యర్, శుభమన్ గిల్ లు  ఇన్నింగ్స్ ధాటిగానే ఆరంభించారు. మొదటి వికెట్ కు 10.4 ఓవర్లలో 91 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధసెంచరీ చేసిన వెంకటేష్ అయ్యర్ మొదటి వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన నితీష్ రానా డకౌట్ అయ్యాడు. ఆ కాసేపటికే సునీల్ నరేన్ కూడా రెండు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. 43 బంతులో 6 ఫోర్లతో 51 పరుగులు చేసిన మరో ఓపెనర్ గిల్ నాలుగో వికెట్ గా వెనుదిరగడంతో కోల్ కతా కష్టాలు మొదలయ్యాయి. కెప్టెన్ మోర్గాన్(4), దినేష్ కార్తీక్(9), షకీబ్ అల్ హసన్(0), రాహుల్ త్రిపాఠి(2)  విఫలమయ్యారు. చివర్లో ఫెర్గ్యుసన్-18; శివం మావి-20 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 9  వికెట్ల నష్టానికి 165  పరుగులు చేయగలిగింది.  చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్-3, రవీంద్ర జడేజా, హజెల్ వుడ్ చెరో రెండు, బ్రావో, దీపక్ చాహర్ చెరో వికెట్ పడగొట్టారు.

ఫైనల్ చేరిన రెండుసార్లూ విజేతగా అవతరించిన కోల్ కతా నైట్ రైడర్స్ ఈసారి రన్నరప్ తోనే సరిపెట్టుకుంది.

డూప్లెసిస్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

ఈ సీజన్ లో మొత్తం 32 వికెట్లు తీసిన బెంగుళూరు బౌలర్ హర్షల్ పటేల్ కు పర్పుల్ క్యాప్ తో పాటు ‘ప్లేయర్ అఫ్ ది టోర్నమెంట్’ లభించింది.  చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కు ఆరెంజ్ క్యాప్ సాధించాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్