Matchbox price doubles after 14 years
అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల, కుక్కపిల్ల కావేవీ కవితకనర్హమంటాడు శ్రీశ్రీ. అందుకే ఇప్పుడు రాముడి అజ్ఞాతవాసమంత కాలం తర్వాత.. అంటే పద్నాలుగేళ్ల తర్వాత రూపాయి పెరిగిన అగ్గిపెట్టె ధర.. వార్తయి కూర్చుంది. మరిన్నేళ్ల తర్వాత ఒక రూపాయి ఉన్న అగిపెట్టె.. ఇంకో రూపాయి పెరిగితే వార్తే కదా..?
నిత్యం 20 పైసలు, 30 పైసల చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెరుతున్నప్పుడు… వాటిని భగ్గుమనిపించే శక్తి ఉన్న భాస్వరం మాత్రం ఏంపాపం చేసిందని..? పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీని తాకుకున్నప్పుడు… కేవలం రూపాయున్న అగ్గిపెట్టె ధర.. ఇంకో రూపాయి పెరిగితే ఏంటంట..? కాబట్టి అగ్గిపెట్టె ధర పెరుగుదలపై.. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నవారెవ్వరూ.. అంతగా ఆందోళన చెందకపోవచ్చు!వ్యాపారసూత్రాల పరిభాషలోనో… ఇన్ ఫ్లేషన్ పేరిట వాడే ఆర్థిక పరిభాషలోనో అగ్గిపెట్టె రేటు పెరగడానికి ఇతమిద్ధంగా ఇదీ కారణమని కంపెనీలు.. తమ విశ్వాసాన్ని దెబ్బ తినకుండా ప్రకటించడమే ఇప్పుడు హర్షించదగ్గ విషయం.
ఎందుకంటే ప్రపంచ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు విపరీతంగా తగ్గుతున్న కొద్దీ.. భారత్ లో పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం అందుకు విలోమానుపాతంలో పెరుగుతుండటంపై ఇప్పటికీ జనాలకు స్పష్టతనివ్వని సర్కారు పెద్దలున్నప్పుడు… అగ్గిపెట్టెల తయారీ కంపెనీలు ఎలాగూ అభినందనీయులే.
రా మెటీరియల్స్ ధరలు, రవాణా ఖర్చులు పెరగడంతోనే ధరలు పెంచుతున్నామని.. రెడ్ పాస్ఫరస్ ధర కేజీ 425 నుంచి అమాంతం డబులై 810కి చేరిందని.. దాంతో పాటే పోటాషియం క్లోరేట్, పేపర్, సల్ఫర్ వంటి రా మెటీరియల్స్ ధరలు కూడా పెరిగినట్టు సిన్సియర్ గా ప్రకటించిన స్మాల్ మ్యాచ్ బాక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రకటనను.. మార్కెట్ లో ఏ నిత్యావసరాల ధరలు పెరిగినా ధర్నాలతో ధ్వజమెత్తేవారు అంత సీరియస్ గా తీసుకోరనే అనుకోవచ్చు! ఎందుకంటే ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన నిత్యవసరాల ధరల జాబితా ఇప్పటికే చాలా పెరిగి పెద్దదవుతోంది కాబట్టి!! ఆ లిస్ట్ లో అగ్గిపెట్టె ధర లేటెస్ట్ గా చేరడంతో… ఆదిలో చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో లైన్ లో చివరివారి స్థానం ఇప్పుడు అగ్గిపెట్టేది కాబట్టి!
సాధారణంగా అగ్గికి ఆజ్యం పోసినట్టని వాడుతుంటామే..?!! అదిగో ఆ పరిస్థితి ఇప్పుడు కళ్లకు కడుతోంది. ఇవాళ పెరిగిన అగ్గిపెట్టెల ధరలకు ప్రధాన ఆజ్యం.. పెట్రో, డీజిల్ ధరల పెరుగుదలే!!
పెట్రో, డీజిల్ ధరల పెంపు పరోక్షంగా ఇవాళ పెరుగుతున్న నిత్యావసర ధరలన్నింటికీ మూలకారణం. ఎందుకంటే రవాణా ఛార్జీలు తడిసి మోపెడవుతున్న వేళ.. పెట్రోల్, డీజిల్ లేందే వాహనాలు కదల్లేని సమయాన ఆ పాపం వాటి పెంపుదే కదా మరి..?!! వీటికి తోడు 12 శాతం జీఎస్టీ.. అగ్గిపెట్టెల పరిశ్రమకు ప్రధానమైన తమిళనాడు ఇండస్ట్రీలో ఏర్పడుతున్న కూలీల కొరత.. వెరసి అగ్గిపెట్టె ధర రూపాయి పెరగడం భారమని మాత్రం.. పెట్రో, డీజిల్ ధరల పెరుగుదలను తప్పుబట్టని వారెవ్వరూ అనుకోవాల్సిన పనైతే లేదేమో!
-రమణ కొంటికర్ల
Also Read:
Also Read:
Also Read: