ICC T20 Wc New Zealand Beat India By 8 Wickets :
ఐసీసీ టి-20 వరల్డ్ కప్ లో ఇండియా మరోసారి పేలవమైన ఆటతీరు ప్రదర్శించి ఓటమి పాలైంది. సూపర్12లో నేడు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నిన్న చెప్పినట్లుగానే నేడు మెరుపు బంతులతో మూడు వికెట్లు సాధించాడు. వరుసగా రెండు ఓటములతో సెమీస్ అవకాశాలను ఇండియా దూరం చేసుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. రవీంద్ర జడేజా 19 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్సర్ తో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇదే జట్టులో అత్యధిక స్కోరు. హార్దిక్ పాండ్యా-23; కెఎల్ రాహుల్-18; రోహిత్ శర్మ-14; పంత్-12 పరుగులతో రెండంకెల స్కోరు చేయగలిగారు. ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగలిగింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు; ఇష్ సోది రెండు; సౌథి, ఆడమ్ మిల్నే చెరో వికెట్ పడగొట్టారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. గుప్తిల్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో వికెట్ కు డెరిల్ మిచెల్, కెప్టెన్ విలియమ్సన్ లు 72 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మిచెల్ ఒక్క పరుగు తేడాతో అర్ధ సెంచరీ కోల్పోయాడు, 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విలియమ్సన్ (31 బంతుల్లో 3 ఫోర్లతో 33 పరుగులు), డెవన్ కాన్వే(2)లు కలిసి మరో వికెట్ పడకుండా మరో 33 బంతులు మిగిలి ఉండగానే (14.3 ఓవర్లలోనే)విజయలక్ష్యం సాధించారు.
రెండు కీలక వికెట్లు(కోహ్లీ, రోహిత్ శర్మ) పడగొట్టిన కివీస్ బౌలర్ ఇష్ సోది కి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
Must Read :ఇది సంకల్ప బలం- నవ భారత్‌కు ప్రతీక: మోడీ