All The Suicides Of The Unemployed Are Kcr Government Killings :
“తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి నిరుద్యోగి ఆత్మహత్యకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఒకరకంగా ఈ ఆత్మహత్యలను ప్రభుత్వం చేస్తున్న హత్యలుగానే భావించాలి” అని టీజేఏస్ అధినేత కోదండరాం అన్నారు. మంగళవారం టీజేఏస్ రాష్ట్ర కార్యాలయంలో మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతా చారి వర్థంతి రోజున యువజన, విద్యార్థి జన సమితిల ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగే “తెలంగాణ యూత్ డిమాండ్స్ డే” సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. “రాష్ట్రంలో రోజురోజుకు నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే 21 మంది నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. అయినా కేసీఆర్ ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు. ఖాళీగా ఉన్న రెండు లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకై, ప్రయివేటు రంగంలో యువకులకు ఉపాధి కల్పనకై, స్థానిక పరిశ్రమలలో స్థానికులకే ఉద్యోగాలు కల్పంచే చట్టం సాధనకై టీజేఏస్ పార్టీ అనుబంధ విభాగాలైన యువజన, విద్యార్థి జన సమితిలు మరో పోరాటం చేయనున్నాయి. అందులో భాగంగా మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి వర్థంతి రోజైన డిసెంబరు 3 న హైదరాబాదులో వేలాదిమంది యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులతో తెలంగాణ యూత్ డిమాండ్స్ డే పేరుతో సదస్సును నిర్వహిస్తున్నాం. దీనికి భారీగా తరలిరావాలని యువకులకు పిలుపు ఇస్తున్నాం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఏస్ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు సయ్యద్ సలీంపాష, టీజేఏస్ రాష్ట్ర విద్యార్థి అధ్యక్షుడు బాబూ మహాజన్, టీజేఏస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్ రావు, టీజేఏస్ రాష్ట్ర నాయకులు నిజ్జన రమేష్ ముదిరాజ్, ఆశప్ప, విద్యార్థి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసంపల్లి అరుణ్ కుమార్, యూత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ ఏర్ర వీరన్న, విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేరాల ప్రశాంత్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పల్లె వినయ్, హైదరాబాదు జిల్లా విద్యార్థి అధ్యక్షుడు నకిరేకంటి నరేందర్, యూత్ హైదరాబాదు జిల్లా అధ్యక్షుడు సుశీల్ కుమార్, గ్రేటర్ నాయకులు జీవన్, డప్పు గోపి, శీను, రాబర్ట్, పవన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Must Read :ఉద్యోగాల భర్తీ పై బహిరంగ చర్చకు సవాల్