Puneeth Raj Kumar Lives Forever In The Kannada South Indian Film History :
నటులను వేలం వెర్రిగా అభిమానిస్తాం. వారికోసం బట్టలు చించుకుంటాం. వారి కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తాం. వేళ్లు కోసుకుని రక్త తిలకాలు దిద్దుతాం. వారు తెరమీద కనబడితే ఈలలు వేస్తాం. ఎగురుతాం. రంగు కాగితాలు చల్లుతాం. అభిమాన సంఘాలు పెట్టుకుని కొట్టుకుంటాం. అభిమాన తారల చేతులకు చెంపలు వాటంగా పెడితే వారు చెళ్లుమనిపిస్తే జన్మ ధన్యమయ్యిందని పొంగిపోతాం. రెండో చెంప మీద కూడా చేయి చేసుకోలేదే అని పశ్చాత్తాప పడతాం. సినిమా విడుదల మొదటి రోజు మొదటి ఆట చూసి ఫ్యాన్లుగా మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం. ఇంకా ముదిరితే సైకో ఫ్యాన్స్ గా మారి మిగతా ఫ్యాన్స్ మీద యుద్ధాలు చేస్తాం. కొట్టుకుని చస్తాం. మనకు కూటికి గతిలేకపోయినా మన ఆరాధ్య నటుడికోసం ఏమయినా చేస్తాం. ఎంతయినా ఖర్చు చేస్తాం.
మనం అభిమానించే తారల్లో లోపాలను క్షమిస్తాం. వారి అజ్ఞానాన్ని అర్థం చేసుకుంటాం. వారి అహంకారాన్ని ఒక ఆభరణంగా చూస్తాం. వారి సంకుచిత కుల దృష్టిని విశాల దృక్పథంగా అనుకుంటాం. వారి ప్రాంతీయతలో విశ్వంభరత్వాన్ని దర్శించగలుగుతాం. వారి వ్యక్తిగత దురలవాట్లలో మ్యానరిజమ్స్ ను పట్టుకోగలుగుతాం.
మన చెమట చుక్కలు వారిని అత్యంత సంపన్నులుగా నిలబెడతాయి. మన రక్తం వారిని బలపరుస్తూ ఉంటుంది. మన మనసు పొరలమీద మీద వారి కీర్తి సౌధాలు నిర్మాణమవుతాయి.
మరి ప్రతిగా వారు మనకేమిస్తారు? అన్నది అడగకూడని ప్రశ్న. వారు మనకిచ్చిన వినోదానికి మనమిచ్చే టికెట్టు సొమ్ము చాలదు. ఇంకా ఇవ్వాలి.
మన రక్తమివ్వాలి. ప్రాణమివ్వాలి. ఇవ్వడానికి ఏమీ మిగలనంతగా ఇంకా ఇంకా ఏదో ఇవ్వాలి. ఇస్తూనే ఉండాలి.
వారు మానవాతీతులై దైవాంశ సంభూతులైపోతారు. వారిలో ఏవో మహిమలున్నట్లు వారికే కాకుండా మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. వారు కారణ జన్ములై వారి బ్లడ్డు…వారి బ్రీడూ…వారే చెప్పుకోవాల్సిన చరిత్రగా మారిపోతుంది.
తెలుగు చిత్ర సీమను మకుటం లేని మహారాజులుగా ఏలిన, ఏలుతున్న అత్యంత సంపన్నులు సమాజానికి ఏమి సేవ చేశారు? ఎంత సేవ చేయగలిగిన శక్తి ఉండి ఎంత చేశారు? ప్రభుత్వాలు, సమాజం నుండి వారు ఎన్ని తరాలకు సరిపడా పోగేసుకున్నారు? అన్న ప్రశ్నలకు ప్రేక్షకుల దగ్గర స్పష్టమయిన సమాధానాలున్నాయి. రాయడానికి వీల్లేని ఇంకా చాలా విషయాలు కూడా ప్రేక్షకులకు తెలుసు. అవన్నీ ఇక్కడ అనవసరం.
పొరుగున కర్ణాటకలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం తరువాత సామాన్యజనం స్పందిస్తున్న తీరు ఈ చర్చకు నేపథ్యం. ఇలా చర్చిస్తే ఒకరకంగా పునీత్ ను అవమానించినట్లు అవుతుంది. అయినా తప్పదు.
కీర్తి శేషంగా, శాశ్వతంగా మిగలడమే కీర్తి శేషులు కావడం.
మరణించినా బతికితేనే బాగా బతికినట్లు.
నలుగురు కూర్చుని నవ్వే వేళల ఒకసారి తలచుకుంటేనే బతికినట్లు.
కోట్ల మంది తమ సొంత మనిషిని కోల్పోయినట్లు బాధపడుతున్నారంటే అతను బతికినట్లు.
స్టార్ అంటే ఇంత సింపుల్ గా ఉంటాడా అన్నట్లు ఉన్నాడు కాబట్టే అతను లేని లోటు పూడ్చలేనిది.
పోగుపడుతున్న సంపదతో సేవను విస్తరిస్తూ పోతున్నాడు కాబట్టే అతను పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
మనుషుల్లో మనిషిగా ఉండడానికి ప్రయత్నించాడు కాబట్టే అతను పునీతుడయ్యాడు.
ఒళ్లో వచ్చిపడ్డ స్టార్ డమ్, వారసత్వ భుజకీర్తులు అహంకారాన్ని పెంచలేదు కాబట్టే అతను పునీతుడయ్యాడు.
చనిపోయినా నలుగురికి చూపునిచ్చిన పునీత్ లు తారాపథంలో దివిటీలు పెట్టి వెతికినా దొరకరు. అభిమానులతో పునీత్ మాటా మంతీ; సహ నటులతో మాటలు, సామాన్యులతో సంభాషణలు అన్నీ డిజిటల్ వేదికల మీద ఉన్నాయి.
నటిస్తే నటులవుతారు.
జీవిస్తే పునీతులవుతారు.
మనసున్న మనిషి పునీత్.
మరణం లేని మనిషి పునీత్.
-పమిడికాల్వ మధుసూదన్
Must Read :పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు!